Tata Motors : కార్ల ధరలు పెంచిన టాటా మోటార్స్! సెప్టెంబర్ 1 నుంచి కొత్త రేట్లు వర్తింపు..
Tata Motors price hike : టాటా మోటార్స్ తన కార్లు, ఎస్‌యూవీల ధరలను రూ. 25,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న తయారీ ఖర్చుల కారణంగా సెప్టెంబర్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని స్పష్టం చేసింది. ఐసీఈ, ఎలక్ట్రిక్ వాహనాలన్నింటికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని వివరించింది.
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో దిగ్గజ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్.. వినియోగదారులకు షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా తన కార్లు, ఎస్‌యూవీల ధరలను రూ. 25,000 వరకు పెంచుతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. పెరిగిన ఇన్‌పుట్ కాస్ట్, ద్రవ్యోల్బణ ఒత్తిడిని కొంతవరకు కస్టమర్లకు పాస్ ఆన్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అయితే, తయారీ వ్యయభారంలో సింహభాగాన్ని తామే భరిస్తున్నామని, కేవలం కొంత భారాన్ని మాత్రమే కస్టమర్లపైకి మళ్లిస్తున్నామని టాటా మోటార్స్ తెలిపింది.

సెప్టెంబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి..
ఈ కొత్త ధరల సవరణ 2026 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. పెట్రోల్, డీజిల్ (ఐసీఈ) మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కూడా ఈ ధరల పెంపు పరిధిలోకి వస్తాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు వ్యత్యాసంగా ఉంటుంది. వ్యక్తిగత మోడళ్ల వారీగా. కొత్త ధరల వివరాలను కంపెనీ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు.
సెప్టెంబర్ 1 దగ్గర పడుతున్న కొద్ది మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తగ్గిన లాభాలు.. పెరుగుతున్న ఖర్చులు..
భారతీయ ప్యాసింజర్ వాహన రంగం ప్రస్తుతం ముడిసరుకు ధరల పెరుగుదలతో సతమతమవుతోంది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలోనూ ఈ సవాళ్లు కొనసాగే అవకాశం ఉందని టాటా మోటార్స్ ఇదివరకే పేర్కొంది.
మార్జిన్లపై పడుతున్న భారాన్ని కంపెనీ ఇటీవలి ఆర్థిక ఫలితాలు కూడా స్పష్టం చేశాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 775 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 3,924 కోట్లుగా ఉండటం గమనార్హం. అంటే లాభాలు భారీగా తగ్గినట్లు స్పష్టమవుతోంది.
హ్యుందాయ్ కార్ల ధరల బాదుడు: కొనాలనుకుంటే ఈ 10 రోజుల్లోనే కొనండి
ప్రస్తుత పండుగ సీజన్ ఆఫర్లు..
ధరల పెంపు ప్రకటన వెలువడినప్పటికీ, ప్రస్తుత ఆగస్ట్ నెలలో కంపెనీ తన వాహనాలపై ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లను అందిస్తోంది. పండగ సీజన్ కొనుగోళ్లను క్యాష్ చేసుకొనేందుకు ఐసీఈ, ఈవీ శ్రేణిలో పలు రాయితీలను ప్రకటించింది.
ఆల్ట్రోజ్, నెక్సాన్, కర్వ్, హారియర్, సఫారీ వంటి మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ప్రయోజనాలు, లాయల్టీ రివార్డులు అందుబాటులో ఉన్నాయి. డీలర్‌షిప్, లభ్యతను బట్టి ఈ ఆఫర్లలో మార్పులు ఉండవచ్చు.
మరోవైపు నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీలతో పాటు హారియర్ ఈవీ వంటి పెద్ద ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలపై కూడా ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో ప్రమోషనల్ బెనిఫిట్స్ ఇస్తున్నారు.
అంతేకాకుండా సియెర్రా జూబ్లీ ఎడిషన్, నెక్సాన్ క్యామో ఎడిషన్, పంచ్ హెచ్‌బీఎక్స్ ఎడిషన్ వంటి స్పెషల్ ఎడిషన్ కార్లను కూడా మార్కెట్లోకి తెచ్చారు.
కస్టమర్లకు గమనిక..
సెప్టెంబర్ 1న ధరలు పెరగనున్న నేపథ్యంలో, కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫెస్టివ్ ఆఫర్లు చక్కటి అవకాశంగా నిలుస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ధరల పెంపునకు ముందే వాహనాన్ని బుక్ చేసుకుంటే అదనపు భారాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


