Kia Syros EV : కియా సైరోస్ ఈవీ కొనాలా? వద్దా? ఫస్ట్​ డ్రైవ్ రివ్యూ ఇదిగో..

Kia Syros EV First Drive Review : కియా సైరోస్ ఈవీని బెంగళూరు ట్రాఫిక్, గుంతల రోడ్లపై రోజంతా నడిపింది హెచ్​టీ ఆటో టీమ్. మరి ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీని కొనమని చెప్పిందా? వద్దని తేల్చేసిందా? ఫస్ట్ డ్రైవ్ రివ్యూ చూసేయండి..

Published on: Aug 4, 2026, 06:28:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త కారును పరీక్షించడానికి బెంగళూరు నగరం అంత తేలికైన ప్రదేశమేమీ కాదు! ఒక క్షణంలో బంపర్-టు-బంపర్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోతాము, మరుసటి క్షణంలో ఫ్లైఓవర్‌పై సాఫీగా వెళిపోతుంటాము.. ఆ వెంటనే, కారు సస్పెన్షన్‌ను పరీక్షించే గుంతల రోడ్డు స్వాగతం పలుకుతుంది. సరిగ్గా ఇలాంటి బెంగళూరు వీధుల్లోనే హెచ్​టీ ఆటో టీమ్ ‘కియా సైరోస్ ఈవీ’తో ఒక రోజంతా గడిపింది. చూసేందుకు ఇది రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ సైరోస్ మోడళ్లలాగే అనిపించింది. అదే బాడీ షేప్, దాదాపు అదే కేబిన్ లేఅవుట్, చాలా వరకు అవే ఫీచర్లు ఉన్నాయి.

కియా సైరోస్ ఈవీ కొనాలా? వద్దా? ఫస్ట్​ డ్రైవ్ రివ్యూ ఇదిగో..
కియా సైరోస్ ఈవీ కొనాలా? వద్దా? ఫస్ట్​ డ్రైవ్ రివ్యూ ఇదిగో..

అయితే రోజంతా దీనిని నడిపిన తర్వాత హెచ్​టీ ఆటో టీమ్​కి ఒక విషయం అర్థమైంది. ఇది కేవలం ఇంజిన్ తీసేసి బ్యాటరీ పెట్టిన కారు మాత్రమే కాదు.. రోజువారీ వాడకంలో కొన్ని కీలక విషయాల్లో పెట్రోల్ సైరోస్ కంటే కూడా ఈ ఈవీ వర్షనే చాలా బాగుందని!

తెలిసిన రూపమే.. కానీ ఫ్యూచరిస్టిక్ డిజైన్!

సైరోస్ ఈవీని చూడగానే ఇది సైరోస్ మోడల్ అని గుర్తుపట్టడం పెద్ద కష్టమేమీ కాదు. సన్నటి ఫ్రంట్ గ్రిల్ ప్రధాన మార్పుగా కనిపిస్తుంది. కొత్త అలాయ్ వీల్స్ దీనికి పెట్రోల్/డీజిల్ మోడళ్ల నుంచి ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. లోయర్ వేరియంట్లలో 16-అంగుళాల వీల్స్ రాగా, టాప్ మోడల్‌లో కాస్త పెద్ద వీల్స్ అందించారు. నిజానికి సైరోస్ డిజైన్ మొదటి నుంచీ కాస్త ఫ్యూచరిస్టిక్‌గా ఉండేది. ఇప్పుడు ఈ ఈవీ మోడల్‌ను చూస్తుంటే.. ఈ డిజైన్ అసలు ఎలక్ట్రిక్ కారు కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది.

కేబిన్ అవే ఫీచర్లు.. కానీ ప్లేస్ మారింది!

లోపలికి అడుగుపెట్టగానే అంతా పరిచయమున్న వాతావరణమే కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మునుపటి మోడల్ నుంచే తీసుకున్నారు. డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్లు కేబిన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి చాలా షార్ప్‌గా, వేగంగా స్పందిస్తాయి. అయితే క్లైమేట్ కంట్రోల్ కోసం ఇచ్చిన చిన్న 5-అంగుళాల డిస్​ప్లే స్టీరింగ్ వీల్ వెనుక దాక్కున్నట్లు ఉంటుంది. డిజైన్ పరంగా బాగున్నా, ప్రయాణంలో దానిని ఆపరేట్ చేయడం కాస్త ఇబ్బందే.

ఫీచర్ల విషయానికి వస్తే టాప్ వేరియంట్‌లో వెంటిలేటెడ్ అండ్ పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా వంటివన్నీ ఉన్నాయి.

కియా సైరోస్​ ఈవీ కేబిన్‌లో జరిగిన అతిపెద్ద మార్పు గేర్ సెలెక్టర్. కియా దీనిని స్టీరింగ్ వీల్ వెనుక భాగానికి మార్చింది. మొదట్లో అలవాటుపడటానికి కొద్ది సమయం పట్టినా, ఆ తర్వాత ఇది చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. దీనివల్ల సెంటర్ కన్సోల్‌లో చాలా స్పేస్ కలిసి వచ్చింది. ఆ ఖాళీ స్థలంలో పెద్ద స్టోరేజ్, సులభంగా అందుబాటులో ఉండే వైర్‌లెస్ ఛార్జర్, వెడల్పాటి ఆర్మ్‌రెస్ట్‌ను అమర్చారు.

వెనుక సీటు సౌకర్యం: సైరోస్ అతిపెద్ద బలం!

ఈ ఎలక్ట్రిక్ కారులో నన్ను బాగా ఆకట్టుకున్న అంశం వెనుక సీటు ప్రయాణం. 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉన్న హెచ్​టీ టీమ్​ సభ్యుడు.. వెనుక కూర్చున్నా మోకాళ్లకు, తలకు కావాల్సినంత స్థలం లభించింది. స్లైడింగ్ వెనుక సీట్లు ఉండటం వల్ల ప్రయాణికుల స్పేస్ లేదా బూట్ స్పేస్ అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. రీక్లైనింగ్ బ్యాక్‌రెస్ట్ లాంగ్ డ్రైవ్‌లలో అలసట లేకుండా చేసింది.

వెనుక ప్రయాణికులకు కూడా వెంటిలేటెడ్ సీట్లు, సన్‌షేడ్లు, ఏసీ వెంట్లు, టైప్-సి ఛార్జింగ్ పోర్టులు ఇచ్చారు. ముగ్గురు పెద్దలు పక్కపక్కనే కూర్చోవచ్చు, కానీ ఇద్దరు కూర్చుంటే ప్రయాణం మరింత హాయిగా ఉంటుంది.

ఈ స్లైడింగ్ సీట్ల వల్ల డిక్కీ సామర్థ్యం కూడా మారుతుంది. సీట్లు వెనక్కి ఉన్నప్పుడు 390 లీటర్ల స్పేస్ దక్కితే, ముందుకు జరిపితే అది 465 లీటర్లకు పెరుగుతుంది. వెనుక సీట్లను పూర్తిగా మడిచేస్తే ఏకంగా 1,200 లీటర్లకు పైగా స్థలం లభిస్తుంది. అయితే బూట్ లిప్ కాస్త ఎత్తుగా ఉండటం వల్ల బరువైన లగేజ్ బ్యాగులను లోపలికి తోయడం కొద్దిగా శ్రమతో కూడుకున్న పని.

డ్రైవింగ్ అనుభవం ఎలా ఉందంటే?

హెచ్​టీ ఆటో టీమ్​కి కియా సైరోస్ పెట్రోల్ సైరోస్‌లో నచ్చని ప్రధాన అంశం దాని సస్పెన్షన్. గుంతల రోడ్లపై కారు ఎక్కువగా ఊగుతూ ఉండేది. కానీ ఈ ఈవీ మోడల్ ఆ లోపాన్ని అధిగమించింది. కింద భాగంలో అమర్చిన బ్యాటరీ బరువు వల్ల కారు రోడ్డుపై స్థిరంగా, ప్రశాంతంగా సాగుతోంది. చిన్న చిన్న గుంతలను కారు అసలు లెక్కచేయడం లేదు.

నగరంలో నడపడం అత్యంత సులభం. మంచి విజబిలిటీ ఉండటం వల్ల ట్రాఫిక్‌లో రాకపోకలు సాగించడం, పార్కింగ్ చేయడం చాలా తేలికగా అనిపిస్తుంది. ముందు సీట్లు మంచి సపోర్ట్‌ను ఇస్తాయి.

ఇందులో ఈకో, నార్మల్, స్పోర్ట్ అని మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. నగరంలో రోజూవారీ ప్రయాణానికి నార్మల్ మోడ్ సరిగ్గా సరిపోతుంది. మైలేజ్/రేంజ్ కోసం ఈకో మోడ్, త్వరిత ఓవర్‌టేకింగ్‌ల కోసం స్పోర్ట్ మోడ్ ఉపయోగపడతాయి.

సైరోస్ ఈవీలో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి..

51.4 kWh బ్యాటరీ: 171 PS పవర్, ఏఆర్ఏఐ (ARAI) సర్టిఫైడ్ రేంజ్ 526 కిలోమీటర్లు.

42 kWh బ్యాటరీ: 135 PS పవర్, ఏఆర్ఏఐ సర్టిఫైడ్ రేంజ్ 443 కిలోమీటర్లు.

రెండూ కూడా 255 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

మెరుగుపడాల్సిన అంశాలు కొన్ని..

సైరోస్ ఈవీలో కొన్ని చిన్న లోపాలు కూడా ఉన్నాయి. బ్రేక్ పెడల్ నొక్కినప్పుడు మొదట్లో బ్రేక్ బైట్ సరిగ్గా అనిపించదు. రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను పెంచితే కొంత మార్పు కనిపిస్తుంది, కానీ బ్రేకింగ్ విషయంలో మరింత ఆత్మవిశ్వాసం ఇచ్చేలా ఉండాల్సింది.

అలాగే, సిటీ స్పీడ్స్ వరకు కేబిన్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ 70-80 కిలోమీటర్ల వేగం దాటిన తర్వాత టైర్ల శబ్దం, పిల్లర్ల వద్ద గాలి శబ్దం కేబిన్‌లోకి కాస్త స్పష్టంగా వినిపిస్తుంది. ఇవేమీ పెద్ద సమస్యలు కాకపోయినా, కారు మిగతా విషయాల్లో చాలా ప్రీమియమ్‌గా ఉండటం వల్ల ఇవి వెంటనే తెలిసిపోతాయి.

కియా సైరోస్​ ఈవీ ఫస్ట్​ డ్రైవ్ రివ్యూ- కొనాలా? వద్దా?

కియా సైరోస్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ.. ఊహించిన దానికంటే మెరుగైన ఇంప్రెషన్ ఇచ్చింది. ఇది పెట్రోల్ మోడల్‌లో ఉన్న ప్రధాన లోపమైన సస్పెన్షన్ రైడ్ క్వాలిటీని చక్కగా సరిదిద్దింది. ఆచరణాత్మక కేబిన్, వెనుక సీటు ప్రయాణం, సుదీర్ఘమైన ఫీచర్ల జాబితాను అలాగే నిలబెట్టుకుంది.

ఇక్కడ అసలు ప్రశ్న సైరోస్ ఈవీ మంచి కారా కాదా అని కాదు.. ఖచ్చితంగా ఇది మంచి కారే! అయితే మీరు దీనిని ఎలా కొనుగోలు చేస్తున్నారు అనేదే ముఖ్యం. సాధారణ ఎక్స్-షోరూమ్ ధరలో చూస్తే, ప్రత్యర్థులతో పోలిస్తే ఇది కాస్త ప్రీమియంగా అనిపించవచ్చు. కానీ కియా అందిస్తున్న 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) ప్రోగ్రామ్‌ ఎంచుకుంటే లెక్కలన్నీ మారిపోతాయి. ఈ ఆఫర్ కింద ప్రారంభ ధర రూ.8 లక్షల స్థాయికి, టాప్ వేరియంట్ రూ.15 లక్షల స్థాయికి అందుబాటులోకి వస్తుంది. ఈ ధరలో చూస్తే సైరోస్ ఈవీ ప్రతీ రూపాయికి తగిన విలువను ఇచ్చే అద్భుతమైన కారుగా మారుతుంది!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More