Tata Sierra : 50వేల సేల్స్​ దాటిన సియెర్రా- కొత్త ఎడిషన్​ లాంచ్​ చేసిన టాటా మోటార్స్..

Tata Sierra sales : భారత ఆటోమొబైల్ మార్కెట్లో టాటా సియెర్రా సరికొత్త మైలురాయిని అధిగమించింది. దేశీయంగా 50,000 యూనిట్ల విక్రయాల మార్కును దాటింది. ఈ సందర్భంగా కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన 'జూబ్లీ ఎడిషన్'ని కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది.

Published on: Jul 11, 2026, 12:18:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో ఎస్‌యూవీ కార్ల విభాగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ స్వదేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త మైలురాయిని అందుకుంది! తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న టాటా సియెర్రా మోడల్ తాజాగా 50,000 యూనిట్ల విక్రయాల రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఘనవిజయాన్ని పురస్కరించుకుని టాటా మోటార్స్ తన కస్టమర్లకు పండగ లాంటి వార్త చెప్పింది. సియెర్రా లైనప్‌లో సరికొత్త 'జూబ్లీ ఎడిషన్'ని మార్కెట్లో అధికారికంగా ప్రవేశపెట్టింది.

టాటా సియెర్రా జూబ్లీ ఎడిషన్..
టాటా సియెర్రా జూబ్లీ ఎడిషన్..

ఈ స్పెషల్ ఎడిషన్ కారును కంపెనీ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. కారు ఇంజిన్, మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు చేయనప్పటికీ, వాహనదారులకు మరింత సౌకర్యాన్ని, ప్రీమియం లుక్‌ను అందించేలా బాహ్య డిజైన్, ఇంటీరియర్ ఫీచర్లలో కీలక మార్పులు చేశారు. తక్కువ బడ్జెట్ లోనే టాప్-ఎండ్ ఫీచర్లు కోరుకునే మధ్యతరగతి కార్ల ప్రేమికులకు ఈ ఎడిషన్ ఒక అద్భుతమైన ఆప్షన్‌గా మారనుంది.

టాటా సియెర్రా స్మార్ట్+ జూబ్లీ ఎడిషన్..

ఇది ఈ టాటా సియెర్రా సిరీస్‌లోనే ప్రారంభ వేరియంట్. సాధారణ బేస్ మోడల్‌తో పోలిస్తే ఇందులో లుక్ పరంగా చాలా మార్పులు చేశారు. కారుకు మరింత రగ్గడ్, స్పోర్టీ లుక్ ఇచ్చేందుకు కొత్త గ్రిల్ ఇన్సర్ట్, టెయిల్‌గేట్ క్లాడింగ్, రూఫ్ రెయిల్స్ అమర్చారు. కారు లోపలి భాగాన్ని గమనిస్తే, ప్రీమియం అనుభూతిని ఇచ్చేలా సెమీ-లెదరెట్ సీట్ కవర్లు, నాలుగు స్పీకర్ల ఆడియో సిస్టమ్‌ను అందించారు. దీనితో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే భారీ 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇందులో జోడించడం విశేషం.

టాటా సియెర్రా ప్యూర్ జూబ్లీ ఎడిషన్..

స్మార్ట్+ వేరియంట్ కంటే ఒక మెట్టు పైన ఉండే ఈ టాటా సియెర్రా 'ప్యూర్ జుబిలీ ఎడిషన్' ఎస్​యూవీలో భద్రతకు, నిత్య జీవితంలో కారు వాడకానికి ఉపయోగపడే ప్రాక్టికల్ ఫీచర్లపై టాటా దృష్టి పెట్టింది.

కారు చక్రాల చుట్టూ వీల్ ఆర్చ్ క్లాడింగ్ ఇచ్చారు.

కారు వెనుక భాగంలో సామాన్లు సర్దుకోవడానికి పార్సెల్ ట్రే, ఎండ నుంచి రక్షణకు మాగ్నెటిక్ సన్‌షేడ్స్ అందించారు.

డ్రైవింగ్ చేసేటప్పుడు మంచి గ్రిప్ కోసం లెదరెట్ స్టీరింగ్ వీల్ కవర్ అమర్చారు.

అన్నింటికంటే ముఖ్యంగా, భద్రతను పటిష్టం చేస్తూ కారు ముందు, వెనుక భాగంలో రికార్డింగ్ చేసుకునేలా ‘డాష్‌క్యామ్‌లు’ ఇచ్చారు. నేటి రోజుల్లో రోడ్డు ప్రమాదాల క్లెయిమ్‌లకు, భద్రతకు ఈ డాష్‌క్యామ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి.

అడ్వెంచర్ జూబ్లీ ఎడిషన్..

లాంగ్ టూర్లు, అడ్వెంచర్ వేరియంట్​లు ఇష్టపడే వారి కోసం టాటా మోటార్స్ ఈ వేరియంట్‌ను సిద్ధం చేసింది. ఇందులో ప్రత్యేకంగా ‘ఆర్​ఓక్యూ కిట్’ని అందించారు. ఈ కిట్‌తో పాటు ప్యూర్ ఎడిషన్‌లో లాగే కారు ముందు, వెనుక రక్షణ కోసం హై-క్వాలిటీ డాష్‌క్యామ్‌లను అమర్చారు. లాంగ్ డ్రైవ్స్​లో ఈ అడ్వెంచర్ ఎడిషన్ వాహనదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

టాటా సియెర్రా సాధించిన ఈ 50 వేల యూనిట్ల మార్కు దేశీయంగా టాటా కార్లకు ఉన్న తిరుగులేని ఆదరణకు నిదర్శనం. టాప్ వేరియంట్ కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టకుండా, అందుబాటు ధరలోనే అదిరిపోయే ఫీచర్లు ఆశించే కస్టమర్లను ఈ జూబ్లీ ఎడిషన్లు ఆకట్టుకుంటాయని టాటా మోటార్స్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సరికొత్త మోడళ్లపై ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు తమ సమీపంలోని టాటా మోటార్స్ అధికారిక డీలర్‌షిప్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

టాటా సియెర్రా ఐసీఈ వర్షెన్ గతేడాది నవంబర్​లో, ఈవీ వర్షెన్ గత నెలలో లాంచ్ అయిన విషయం తెలిసిందే.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More