Tata Sierra EV : టాటా సియెర్రా ఈవీ ఎలా ఉంది? కొనొచ్చా? వద్దా? ఫస్ట్ డ్రైవ్ రివ్యూ..
Tata Sierra EV first drive review : భారత ఆటోమొబైల్ రంగాన్ని ఒకప్పుడు ఊపేసిన ఐకానిక్ బ్రాండ్ 'టాటా సియెర్రా' సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో టాటా సియెర్రా ఈవీ ఫస్ట్ డ్రైవ్ రివ్యూని ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారతీయ వాహన ప్రియుల గుండెల్లో ‘టాటా సియెర్రా’ పేరు వినబడగానే ఒక తెలియని నోస్టాల్జియా (గత స్మృతులు) గుర్తొస్తుంది. 90ల కాలంలో ఇండియన్ రోడ్లపై సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఈ క్లాసిక్ కారును, టాటా మోటార్స్ ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో ‘టాటా సియెర్రా ఈవీ’గా పునఃసృష్టి చేసింది. కేవలం పాత జ్ఞాపకాలను క్యాష్ చేసుకోవడానికే కాకుండా, భవిష్యత్తు ఎలక్ట్రిక్ మార్కెట్‌ను శాసించేలా అత్యంత ఆధునిక సాంకేతికతతో ఈ కారును తీర్చిదిద్దారు. ఈ సరికొత్త సియెర్రా ఈవీ 75 కేడబ్ల్యూహెచ్ క్యూడబ్ల్యూడీ (క్వాడ్ వీల్ డ్రైవ్) వేరియంట్‌ను రోడ్డుపై టెస్ట్ చేసినప్పుడు హెచ్‌టీ ఆటో టీమ్‌కి ఎదురైన ఆసక్తికర అనుభవాలు ఇవే..
టాటా సియెర్రా ఈవీ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ- డిజైన్..
మొదటి చూపులోనే సియెర్రా ఈవీ తన పాత బాక్సీ, చంకీ ఆకృతితో ఒక ప్రత్యేకమైన రోడ్ ప్రెజెన్స్‌ను కలిగి ఉంది. కారు పరిమాణం కాస్త పెద్దదిగా, గంభీరంగా కనిపిస్తుంది. హెచ్‌టీ ఆటో టీమ్ టెస్ట్ చేసిన కారు 'నైనిటాల్ నాక్టర్న్' కలర్ ఫినిషింగ్‌తో వచ్చింది. మొదట ఈ రంగు కొంచెం డల్‌గా అనిపించినప్పటికీ, ఎండ వెలుతురు పడగానే దీని మెటాలిక్ పర్పుల్-బ్రాంజ్ షేడ్ కారుకు విలాసవంతమైన లుక్‌ను ఇచ్చింది.
సాధారణ ఐసీఈ మోడల్‌తో పోలిస్తే ఈవీ వేరియంట్‌లో ఫ్రంట్ గ్రిల్ పూర్తిగా క్లోజ్డ్ బాడీ కలర్‌లో ఉంటుంది. డోర్లపై 'Tata.ev' బ్యాడ్జింగ్, వెనుక పిల్లర్‌పై 'QWD' లోగోలు ఇది పర్యావరణహిత కారు అని గుర్తుచేస్తాయి. వెనుక వైపు ఉన్న క్లామ్‌షెల్ తరహా బూట్ ఓపెనింగ్ కారుకు మంచి లుక్‌ని ఇచ్చింది. ఎలక్ట్రికల్ టెయిల్‌గేట్ ఆపరేషన్ బాగుంది కానీ రెస్పాన్స్ కాస్త నెమ్మదిగా అనిపించింది. అలాగే, కింది భాగంలో వాడిన గ్లోస్ బ్లాక్ ప్లాస్టిక్‌పై గీతలు పడే అవకాశం ఎక్కువ, దీని మెయింటెనెన్స్ కాస్త కష్టమే.
టాటా సియెర్రా ఈవీ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ- క్యాబిన్ ఫీచర్లు..
ఈ టాటా సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లోపల అడుగుపెట్టగానే సరికొత్త టెక్నాలజీ ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్‌పై ఉన్న ట్రిపుల్-స్క్రీన్ సెటప్ కారుకు అత్యంత ప్రీమియం లుక్‌ను తీసుకువచ్చింది. కేవలం స్క్రీన్లు మాత్రమే కాకుండా, ఈ ఎలక్ట్రిక్ వేరియంట్‌లో ప్రత్యేకంగా అగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్‌ప్లే అందించారు. ఇది రోడ్డుపై వెళ్లేటప్పుడు నావిగేషన్‌ను చూపించడమే కాకుండా, ఎదురుగా వచ్చే వాహనాలను, మనుషులను హైలైట్ చేస్తూ డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది.
స్టీరింగ్ వీల్ వెనుక ఉన్న ప్యాడెల్స్ ద్వారా రీజెనరేటివ్ బ్రేకింగ్ స్థాయిని మార్చుకోవచ్చు. మనం యాక్సిలరేటర్ నుంచి కాలు తీయగానే కారు ఒక్కసారిగా జర్క్ ఇవ్వకుండా చాలా స్మూత్‌గా వేగాన్ని తగ్గిస్తుంది. కారు సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. డ్రైవర్ సీటును 6 రకాలుగా, కో-ప్యాసింజర్ సీటును 4 రకాలుగా ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వేసవి కాలానికి ఉపయోగపడే వెంటిలేటెడ్ సీట్ల ఫీచర్ ఉన్నప్పటికీ, ఆ బ్లోయర్ శబ్దం కాస్త ఎక్కువగా వినిపిస్తుంది. అయితే, పాత సియెర్రాను గుర్తుకు తెచ్చేలా ఉన్న పెద్ద గ్లాస్ రూఫ్ క్యాబిన్‌కు అద్భుతమైన ఫీల్‌ను ఇస్తుంది.
టాటా సియెర్రా ఈవీ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ- పర్ఫార్మెన్స్..
సియెర్రా ఈవీలో ఉన్న ‘బూస్ట్ మోడ్’ ఆన్ చేసి యాక్సిలరేటర్ నొక్కితే కారు బుల్లెట్‌లా ముందుకు దూసుకెళ్తుంది. క్యాబిన్ లోపల ఇంజిన్ శబ్దం అస్సలు లేకపోవడం వల్ల మనం ఎంత వేగంతో వెళ్తున్నామో కూడా తెలియకుండానే వంద దాటేస్తుంది. సిటీ ట్రాఫిక్, సాధారణ హైవేల కోసం 'సిటీ', 'స్పోర్ట్' మోడ్స్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి.
అయితే, ఇంత వేగంగా వెళ్లే కారుకు బ్రేకులు ఇంకాస్త పవర్‌ఫుల్‌గా ఉంటే బాగుండనిపించింది. బ్రేక్ పెడల్ ఫీల్ కొంచెం సాఫ్ట్‌గా ఉంది. బ్యాటరీ ప్యాకేజింగ్ వల్ల కారు ముందు భాగంలో ‘ఫ్రంక్’ స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. ఇందులో కారు ఛార్జర్, చిన్న టూల్స్ సులభంగా సర్దుకోవచ్చు.
టాటా సియెర్రా ఈవీ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ- ఆఫ్-రోడింగ్ సామర్థ్యం..
హెచ్‌టీ ఆటో టీమ్ ఈ కారును ప్రత్యేకమైన ఆఫ్-రోడ్ ట్రాక్‌పై కూడా పరీక్షించింది. యాక్సిల్ ట్విస్టర్, టిల్టెడ్ యు-టర్న్ వంటి క్లిష్టమైన అడ్డంకులను కూడా ఈ ఈవీ చాలా సులభంగా అధిగమించింది. ఘాట్ రోడ్లపై కారును ఆపి మళ్లీ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడా వెనక్కి జారకుండా పవర్‌ఫుల్ గ్రిప్‌ను ప్రదర్శించింది. ఇక్కడే టాటా క్యూడబ్ల్యూడీ టెక్నాలజీ పవర్ ఏంటో అర్థమవుతుంది.
కారు సస్పెన్షన్ విషయానికి వస్తే.. టాటా ఇందులో ఫ్రీక్వెన్సీ-సెలెక్టివ్ డ్యాంపింగ్ టెక్నాలజీని వాడింది. దీనివల్ల రోడ్డుపై ఉన్న గుంతలు, చిన్న చిన్న గతుకులు అసలు లోపల ఉన్నవారికి తెలియవు. రైడ్ చాలా సాఫ్ట్‌గా ఉండటం వల్ల మలుపుల్లో కొద్దిగా బాడీ రోల్ (కారు పక్కకు వాలినట్లు అవ్వడం) ఉంటుంది, కానీ లాంగ్ జర్నీలలో ప్రయాణికులకు ఇది అలసట రానివ్వదు. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కోసం స్క్రీన్‌లో కాకుండా విడిగా ఒక ఫిజికల్ బటన్ ఇచ్చి ఉంటే డ్రైవింగ్ ఇంకా సులభంగా ఉండేది.
టాటా సియెర్రా ఈవీ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ- తీర్పు..
డ్రైవింగ్ ప్రారంభించినప్పుడు ఫుల్ ఛార్జ్‌తో 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ చూపించిన సియెర్రా ఈవీ, రోజంతా రఫ్‌గా డ్రైవ్ చేసిన తర్వాత కూడా 65శాతం బ్యాటరీతో 235 కిమీల రేంజ్ మిగిల్చింది. దీనిని బట్టి రియల్ వరల్డ్‌లో ఈ కారు ఎంత ఎఫీషియంట్‌గా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే.. టాటా సియెర్రా ఈవీ కేవలం పాత జ్ఞాపకం మాత్రమే కాదు, మార్కెట్లో ఉన్న ఇతర లగ్జరీ ఈవీలకు గట్టి పోటీ ఇవ్వగల దమ్మున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


