శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.
Tata Steel : ఏపీఎల్ అపోలోతో టాటా స్టీల్ రూ. 15,510 కోట్ల భారీ డీల్- స్టాక్ ప్రైజ్ క్రాష్!
స్టీల్ ట్యూబ్స్ దిగ్గజం ఏపీఎల్ అపోలోలో 26.6 శాతం వాటాను రూ. 15,510 కోట్లకు కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ బోర్డు ఆమోదం తెలిపింది. పబ్లిక్ వాటాదారుల కోసం మరో 26 శాతం ఓపెన్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఈ డీల్ వార్తల నేపథ్యంలో రెండు సంస్థల స్టాక్స్ భారీగా పతనమయ్యాయి.
భారత ఉక్కు పరిశ్రమలో మరో చారిత్రక ఒప్పందానికి రంగం సిద్ధమైంది! దిగ్గజ సంస్థ టాటా స్టీల్ తన డౌన్‌స్ట్రీమ్ ఉక్కు వ్యాపారాన్ని భారీగా విస్తరించే దిశగా కీలక అడుగు వేసింది. స్టీల్ ట్యూబ్స్, పైపుల తయారీలో అగ్రగామిగా ఉన్న ‘ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ లిమిటెడ్’లో 26.6 శాతం వాటాను రూ. 15,510 కోట్లకు కొనుగోలు చేసేందుకు సోమవారం ఆమోదం తెలిపింది. అధిక లాభాలను తెచ్చిపెట్టే విలువ ఆధారిత ఉక్కు ఉత్పత్తుల విభాగంలో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో టాటా స్టీల్ ఈ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన వివరాల ప్రకారం.. ఏపీఎల్ అపోలో ప్రమోటర్ గ్రూప్ సంస్థ అయిన ‘ఎస్ గుప్తా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ నుంచి ఒక్కో షేరును రూ. 2,100 చొప్పున మొత్తం 7.38 కోట్ల (73.8 మిలియన్ల) షేర్లను టాటా స్టీల్ కొనుగోలు చేస్తుంది. నియంత్రణ సంస్థల అనుమతులు, ఇతర షరతులకు లోబడి ఈ వాటా కొనుగోలు మూడు దశల్లో పూర్తవుతుంది. మొదటి దశలో 9.91 శాతం వాటాను, రెండో దశలో 11.90 శాతం వాటాను, మిగిలిన 4.57 శాతం వాటాను 2028 మార్చి 31 నాటికి టాటా స్టీల్ సొంతం చేసుకుంటుంది. ఈ కొనుగోలు మొత్తాన్ని పూర్తిగా నగదు రూపంలోనే టాటా స్టీల్ చెల్లిస్తుంది. మొదటి దశను బ్లాక్ డీల్ ద్వారా, మిగిలిన రెండు దశలను ఆఫ్-మార్కెట్ బదిలీల ద్వారా పూర్తి చేస్తారు.
దేశంలోని లక్షలాది మంది రిటైల్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు టాటా స్టీల్, ఏపీఎల్ అపోలో షేర్లలో పెట్టుబడులు పెట్టి ఉండటంతో, ఈ మెగా డీల్ వార్త మదుపర్లలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.
రెండు దశల వ్యూహంతో మెగా ఒప్పందం.. !
ఏపీఎల్ అపోలోలో వాటా కొనుగోలు అనేది రెండు దశల భారీ లావాదేవీలో ఒక భాగం. తొలి దశలో టాటా స్టీల్ తన ట్యూబ్స్ వ్యాపారాన్ని, 'టాటా స్టీల్ కలర్స్' విభాగాన్ని రూ. 28,000 కోట్లకు ఏపీఎల్ అపోలోకి విక్రయిస్తోంది. రెండో దశలో ఏపీఎల్ అపోలో ప్రమోటర్ల నుంచి వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఆ సంస్థలో కీలక వాటాదారుగా అవతరిస్తోంది.
"గత ఏడాది కాలంగా విలువ ఆధారిత ఉత్పత్తుల విభాగంలో దూకుడుగా ఎదగాలని, అంతర్గత వృద్ధితో పాటు కొనుగోళ్ల ద్వారా మా డౌన్‌స్ట్రీమ్ వ్యాపారాన్ని విస్తరించాలని వ్యూహాత్మక లక్ష్యంగా పెట్టుకున్నాము," అని టాటా స్టీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) కౌశిక్ ఛటర్జీ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. కలర్-కోటెడ్ ఉత్పత్తులలో భవిష్యత్ వ్యాపారాన్ని నిర్మించడానికి ఏపీఎల్ అపోలో ఒక అద్భుతమైన అవకాశమని ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం ఏపీఎల్ అపోలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5 మిలియన్ టన్నులు కాగా, రెండు సంస్థల కలయికతో ఏడాదికి 15.5 మిలియన్ టన్నుల లాభదాయక డౌన్‌స్ట్రీమ్ వ్యాపారంగా ఎదిగే సత్తా ఉందని ఛటర్జీ పేర్కొన్నారు.
ఓపెన్ ఆఫర్‌తో మెజారిటీ వాటా.. సబ్సిడరీగా ఏపీఎల్ అపోలో!
ప్రమోటర్ల నుంచి వాటా కొనుగోలుతో పాటు ఏపీఎల్ అపోలో పబ్లిక్ వాటాదారుల నుంచి అదనంగా 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ 'ఓపెన్ ఆఫర్' ప్రకటించింది. ఇందుకోసం ఒక్కో షేరుకు రూ. 2,301.40 ధరను నిర్ణయించింది. ఒకవేళ వాటాదారులందరూ ఈ ఆఫర్‌కు అంగీకరిస్తే, టాటా స్టీల్‌కు రూ. 16,755.66 కోట్ల వరకు ఖర్చు కానుంది.
ఈ ఓపెన్ ఆఫర్ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయితే, ఏపీఎల్ అపోలోలో టాటా స్టీల్ వాటా ఏకంగా 52.6 శాతానికి చేరుకుంటుంది. తద్వారా టాటా స్టీల్ మెజారిటీ యాజమాన్య హక్కులను పొంది, ఏపీఎల్ అపోలో దాని అనుబంధ సంస్థగా (సబ్సిడరీ) మారుతుంది. ఈ లావాదేవీలన్నీ పూర్తయిన తర్వాత, ఏపీఎల్ అపోలో ప్రస్తుత ప్రమోటర్ గ్రూప్ ప్రమోటర్ కేటగిరీ నుంచి తప్పుకుని పబ్లిక్ షేర్‌హోల్డర్ కేటగిరీలోకి మారాలని భావిస్తోంది.
డౌన్‌స్ట్రీమ్ ఉక్కు వ్యాపారంపై టాటా స్టీల్ ప్రత్యేక గురి ఎందుకు?
ప్రాథమిక ఉక్కును కేవలం ముడి రూపంలో విక్రయించకుండా, ప్రత్యేక అవసరాలకు తగిన అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చే ప్రక్రియనే 'డౌన్‌స్ట్రీమ్ ఆపరేషన్స్' అంటారు. తమ మొత్తం ఉత్పత్తుల జాబితాలో డౌన్‌స్ట్రీమ్ వాటాను పెంచుకోవాలనే టాటా స్టీల్ వ్యూహానికి ఈ ఒప్పందం సరిగ్గా సరిపోతుంది. భవిష్యత్తులో తమ అప్‌స్ట్రీమ్ ఉక్కు ఉత్పత్తి పరిమాణాన్ని దాటి, డౌన్‌స్ట్రీమ్ వాటాను 55 నుంచి 60 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాటా స్టీల్ సీఈఓ టీవీ నరేంద్రన్ గతంలోనే స్పష్టం చేశారు.
కేవలం ముడి ఉక్కు సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోకుండా ప్రెసిషన్ ట్యూబ్స్, స్పెషాలిటీ స్టీల్ వైర్లు, కోటెడ్ షీట్లు, టిన్ ప్లేట్ల వంటి అధిక మార్జిన్ ఇచ్చే ఉత్పత్తులపై కంపెనీ దృష్టి సారించింది. తాజా ఒప్పందం వల్ల టాటా స్టీల్ డౌన్‌స్ట్రీమ్ ఇంటిగ్రేషన్ ప్రస్తుతం ఉన్న 35 శాతం నుంచి దాదాపు 53 శాతానికి పెరుగుతుందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. దీనివల్ల ఉత్పత్తుల వైవిధ్యం మెరుగుపడటంతో పాటు కంపెనీ లాభదాయకత మరింత పెరగనుంది.
ఏపీఎల్ అపోలో ఆర్థిక ప్రస్థానం.. నాలుగు దశాబ్దాల ప్రయాణం!
స్టీల్ ట్యూబ్స్, పైపులతో పాటు మెటల్, కలర్-కోటెడ్ కాయిల్స్ తయారీలో ఏపీఎల్ అపోలో దేశంలోనే అగ్రగామిగా ఉంది! కంపెనీ ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే వరుసగా అద్భుత వృద్ధిని నమోదు చేస్తోంది. సంస్థ ఏకీకృత ఆదాయం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 18,119 కోట్లు కాగా, 2024-25లో రూ. 20,690 కోట్లకు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 23,079 కోట్లకు చేరుకుంది. ఇక నికర లాభం కూడా 2023-24లో రూ. 732 కోట్లు, 2024-25లో రూ. 757 కోట్లు ఉండగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 1,203 కోట్లకు ఎగబాకింది.
1986 ఫిబ్రవరి 24న ఒక ప్రైవేట్ సంస్థగా దివంగత సుదేశ్ గుప్తా ఏపీఎల్ అపోలోను స్థాపించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు సంజయ్ గుప్తా కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భారత్‌తో పాటు యూఏఈలోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపీఎల్ అపోలో సామర్థ్యం, టాటా స్టీల్ దిగ్గజ బ్రాండ్ విలువ కలవడం భారత ఉక్కు రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.
టాటా స్టీల్ షేరు ధర..
ఈ డీల్ వార్తల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ సెషన్లో టాటా స్టీల్ భారీగా పతనమైంది. ఉదయం 10 గంటల 40 నిమిషాల ప్రాంతంలో టాటా స్టీల్ షేరు ధర 6.8శాతం పడి రూ. 166 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక ఏపీఎల్ అపోలో సైతం 16శాతం పడి రూ. 1781 వద్ద కొనసాగుతోంది.

E-Paper
