బీజేపీ ఎంపీ తేజస్వీపై తెలంగాణ నేతలు సీరియస్ - లోక్ సభలో అసలేం జరిగింది..?

Tejasvi Surya comments  On AP Bifurcation : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దేశ విభజనతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Published on: Apr 16, 2026 5:36 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ప్రసంగించారు. కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు చేస్తున్న ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య (ఫైల్ ఫొటో)
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య (ఫైల్ ఫొటో)

ఏపీ విభజనపై కామెంట్స్…

డీఎంకే నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు… దక్షిణాదిలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు ఎందుకు ఇంత ఆందోళన చేస్తున్నాయి…? వారు చిందిస్తున్న కన్నీళ్లు మొసలి కన్నీళ్లు. కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు భాగాలుగా విభజించింది. బ్రిటిష్ వాళ్లు దేశ విభజన చేసిన దాని కన్నా ఘోరంగా ఏపీని విభజించారు” అని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు.

విభజన సమయంలో తెలుగు ప్రజల సెంటిమెంట్లను, ఆర్థిక వనరులను కాంగ్రెస్ పట్టించుకోలేదని ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడారు. ఆ పాపం ఇప్పటికీ ఆ పార్టీని వెంటాడుతూనే ఉంటుందని విమర్శించారు. విభజన వల్ల ఏర్పడిన గాయాలు ఇప్పటికీ మానలేదంటూ కామెంట్స్ చేశారు.

పునర్విభజన బిల్లు సందర్భంగా ఏపీ విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

సభ్యత్వం రద్దు చేయాలి - మంత్రి పొన్నం

ఇదే విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… తెలంగాణ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తేజస్వి సూర్య వెంటనే తన మాటలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. పార్లమెంట్ సభ్యత్వాన్ని తొలగించి బర్తరఫ్ చేయాలని స్పీకర్ ను కోరారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం , అమరవీరులకు అవమానపరచడమే కాదు ఉద్యమస్పూర్తికి విఘాతం కలిగించేలా ఆయన మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"తేజస్వి మాట్లాడిన మాటలు పార్లమెంట్ రికార్డుల నుండి తొలగించాలి. లోకసభ స్పీకర్ స్పందించి పార్లమెంట్ ద్వారా పాస్ అయిన బిల్లును అవహేళన చేస్తున్న మాటలపై రికార్డుల నుండి తొలగించడమే కాదు అతని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ త్యాగాలు చేసి ప్రజాస్వామికంగా చట్టాల ద్వారా తెచ్చుకున్నాం. బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడితే ఎవరు ఎందుకు స్పందించడం లేదు..?" అని మంత్రి పొన్నం ప్రశ్నించారు.

క్షమాపణలు చెప్పాలి - కేటీఆర్

తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చినా.. తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉండడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని ధ్వజమెత్తారు.

బీజేపీ నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని ఆయన మండిపడ్డారు. స్వయంగా ప్రధానమంత్రి మోడీ నుంచి మొదలుకొని ఈరోజు పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యతిరేకతను పదేపదే చాటుకుంటున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, ఎవరి భిక్ష వల్లనో ఏర్పడింది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం, వేలాది మంది యువకుల బలిదానాల ఫలితంగా ఈ గడ్డ విముక్తి పొందిందని ఆయన గుర్తు చేశారు. అస్తిత్వం కోసం ప్రజలు చేసిన ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాన్ని దేశ విభజన లాంటి విషాదకర సంఘటనలతో పోల్చడం ద్వారా బీజేపీ తన కుసంస్కారాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆయన హెచ్చరించారు.

తెలంగాణను కించపరిచిన తేజస్వీ సూర్య తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలకు బీజేపీ కూడా తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలన్నారు. లేకుంటే తేజస్వి సూర్య వ్యాఖ్యలే బిజెపి అధికారిక విధానంగా భావించాల్సి వస్తుందన్నారు.

విషం చిమ్ముతున్నారు - హరీశ్ రావ్

మాజీ మంత్రి హరీశ్ రావ్ స్పందిస్తూ… తేజస్వీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. “ఇండియా పాకిస్థాన్ విభజన లాంటిదే తెలంగాణ ఏర్పాటు అయితే ఆనాడు బీజేపీ విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపింది? ప్రధాని మోడీ కూడా గతంలో అనేకసార్లు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై విషం చిమ్మారు. నాడు మోడీ అయినా నేడు తేజస్వీ సూర్య అయినా తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచడమే పనిగా పెట్టుకున్నారు. తేజస్వీ సూర్య అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకుండా గుడ్లప్పగించి చూడడం సిగ్గుచేటు” అని విమర్శించారు.

తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అజ్ఞానానికి, తెలంగాణ పట్ల ఉన్న వివక్షా పూరిత ఆలోచనా ధోరణికి అద్దం పడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్రంగా ఖండించారు. "తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడం వెనుక మీ ఆంతర్యం ఏమిటి? స్వదేశంలోని ఒక రాష్ట్రాన్ని శత్రుదేశమైన పాకిస్థాన్‌తో పోల్చడం క్షమించరాని నేరం. ఇది దేశద్రోహంతో సమానం. తెలంగాణ ప్రజలు మీ దృష్టిలో శత్రువులా? మీ మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా గాయపరిచాయి. మీ విద్వేష పూరిత రాజకీయాల కోసం తెలంగాణ అస్తిత్వాన్ని వాడుకోవాలని చూస్తే సహించేది లేదు" అని స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More