Upcoming electric cars : ఇండియాలో లాంచ్‌కు రెడీ అవుతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవి- ధర రూ. 15లక్షల లోపే!
భారత మార్కెట్లో రూ. 15 లక్షలలోపు ధరలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్ల సందడి మొదలుకానుంది. హ్యుందాయ్, మారుతీ సుజుకీతో పాటు రెనాల్ట్, విన్‌ఫాస్ట్ సంస్థలు బడ్జెట్ ఈవీలను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. 2027లో రోడ్లపైకి రానున్న ఈ ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ కార్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విప్లవం వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు కేవలం ఖరీదైన విభాగానికే పరిమితమైన ఈవీలు, ఇప్పుడు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలోకి వస్తున్నాయి. ప్రస్తుతం రూ. 15 లక్షల లోపు విభాగంలో టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ, సిట్రోయెన్, మహీంద్రా సంస్థలు హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ ఎస్‌యూవీలు, క్రాసోవర్ మోడళ్లతో గట్టి పట్టు సాధించాయి. ఈ నేపథ్యంలో హ్యుందాయ్, మారుతీ సుజుకీ, రెనాల్ట్, విన్‌ఫాస్ట్ వంటి దిగ్గజ కంపెనీలు రూ. 15 లక్షల లోపు ధరలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను భారత రోడ్లపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. త్వరలో మార్కెట్లో సందడి చేయనున్న ఆ కార్ల వివరాలను పరిశీలిద్దాం.

హ్యుందాయ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ..
2027 తొలి త్రైమాసికంలో హ్యుందాయ్ సంస్థ భారత మార్కెట్లోకి సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయనుంది. ప్రస్తుతం 'HE1i' అనే కోడ్ నేమ్‌తో పిలుస్తున్న ఈ కారును, మార్కెట్లో ‘ఐయోనిక్ పీ’ పేరుతో తీసుకొచ్చే అవకాశం ఉంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కంటే తక్కువ ధరలో, దిగువ విభాగంలో దీనిని నిలబెట్టనున్నారు.
తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో ఈ కారు ఉత్పత్తి జరగనుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ప్రజాదరణ పొందిన ఇన్‌స్టర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌కు ఉపయోగించిన 'E-GMP (K)' ప్లాట్‌ఫామ్ ఆధారంగానే దీనిని నిర్మిస్తున్నారు. భారతీయ వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా పూర్తిస్థాయి ఎస్యూవీ శైలిలో రూపొందుతున్న ఈ కారు, టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. విభిన్న ప్రయాణ అవసరాలకు తగ్గట్టుగా రెండు బ్యాటరీ ఆప్షన్లలో ఇది లభించనుంది. ఇందులో లెవెల్-2 అడాస్ భద్రతా ఫీచర్లు, కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటాయని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది. తొలుత ఈ కారుకు అవసరమైన బ్యాటరీ సెల్స్‌ను ‘స్వోల్ట్’ నుంచి దిగుమతి చేసుకుని, ఆ తర్వాత దేశీయంగా ‘ఎక్సైడ్’తయారు చేసే బ్యాటరీలను వినియోగించనున్నారు.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఈవీ..
భారత మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ కారుగా 'ఈ-విటారా'ను తీసుకొచ్చిన దిగ్గజ మారుతీ సుజుకీ, మంచి అమ్మకాలతో దూసుకుపోతోంది. ఇప్పుడు మరింత తక్కువ ధరలో, బడ్జెట్ విభాగంలోకి అడుగుపెట్టేందుకు చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పెట్రోల్ విభాగంలో సూపర్ హిట్ అయిన ‘ఫ్రాంక్స్’ కారును ఎలక్ట్రిక్ అవతారంలోకి మార్చేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది.
ఫ్రాంక్స్ ఈవీ బయటి డిజైన్ దాదాపు ప్రస్తుత క్రాసోవర్ శైలిలోనే ఉన్నప్పటికీ, లోపల సరికొత్త ఇంటీరియర్, శక్తివంతమైన ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రెయిన్‌ను జతచేస్తారు. దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాటా పంచ్ ఈవీకి ప్రత్యక్ష పోటీదారుగా మారుతీ సుజుకీ దీనిని బరిలోకి దించనుంది. ఫ్రాంక్స్ ఈవీతో పాటు ఒక ఎలక్ట్రిక్ ఎంపీవీ, మరో కాంపాక్ట్ ఎస్‌యూవీపై కూడా ఈ సంస్థ పనిచేస్తోంది.
వీటిలో ఎలక్ట్రిక్ ఎంపీవీని 2027లో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
రెనాల్ట్, విన్‌ఫాస్ట్ నుంచి చౌకైన ఎలక్ట్రిక్ కార్లు..
ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ కూడా తన భాగస్వామి నిస్సాన్‌తో కలిసి భారత్ కోసం ఏ-సెగ్మెంట్ ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చే ప్రణాళికలను గతంలోనే ప్రకటించింది. 2023 ఫిబ్రవరిలో ప్రకటించిన ఈ ప్రాజెక్టు కింద, చెన్నై ప్లాంట్‌లో రెండు చౌకైన ఎలక్ట్రిక్ కార్లను స్థానికంగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి సామాన్యులకు అందుబాటు ధరలో కారును అందించేందుకు స్థానిక విడిభాగాలనే ఎక్కువగా వాడాలని నిర్ణయించారు. అయితే ఆ ప్రకటన తర్వాత ఈ ప్రాజెక్టు పురోగతిపై కంపెనీ ఇంకా కొత్త వివరాలను వెల్లడించలేదు.
మరోవైపు వియత్నాం ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం విన్‌ఫాస్ట్ సైతం భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. 'వీఎఫ్ ఎక్స్', 'వీఎఫ్ వై' అనే కోడ్ నేమ్స్‌తో రెండు కొత్త ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై ఈ సంస్థ వేగంగా పనిచేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న టూ-డోర్ కారు 'వీఎఫ్ 3' కంటే పెద్దదిగా, 'వీఎఫ్ 6' కంటే చిన్నదిగా ఈ 'వీఎఫ్ X' మోడల్ ఉండబోతోంది. స్థానికంగా తయారీని చేపట్టడం ద్వారా ధరలను అత్యంత కాంపిటీటివ్‌గా నిర్ణయించాలని విన్‌ఫాస్ట్ భావిస్తోంది.
మొత్తంమీద 2027 నాటికి రూ. 15 లక్షల లోపు విభాగంలో దిగ్గజ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది తక్కువ ధరలో ఆధునిక ఫీచర్లు కోరుకునే భారతీయ వినియోగదారులకు ఎంతో మేలు చేయనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


