ఈవీ వాడుతున్నారా? దేశంలోని ఏ హైవేపై ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయో తెలుసా?
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతుండటంతో, కేంద్ర ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు హైవేలపై ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను భారీగా విస్తరించాయి. 2025లో ప్రధాన రహదారులపై ఫాస్ట్ ఛార్జర్ల లభ్యత ఏకంగా 40 నుండి 90 శాతం వరకు వృద్ధి చెందింది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విప్లవం ఇప్పుడు జాతీయ రహదారులపై స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈవీల వాడకం పెరుగుతుండటంతో, గత ఏడాది కాలంగా ప్రధాన జాతీయ రహదారుల వెంట ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలు కూడా అనూహ్యంగా పుంజుకున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు చూపుతున్న చొరవ దీనికి ప్రధాన కారణం.

డేటా అనలిటిక్స్ ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్‌ప్ విత్ ఈవీస్' నుంచి సేకరించిన తాజా సమాచారం ప్రకారం.. 2025లో దేశంలోని కీలక మార్గాల్లో పబ్లిక్ ఛార్జర్ల సంఖ్య 40 నుంచి 90 శాతం వరకు పెరిగింది!
పరిశ్రమ నిపుణుల విశ్లేషణ..
"దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జర్ల విస్తరణను పరిశీలిస్తే, ప్రధాన జాతీయ రహదారులపై ఇప్పుడు ఛార్జర్ల లభ్యతలో పెద్దగా అంతరాలు లేవు," అని ఎక్స్‌ప్ విత్ ఈవీస్ వ్యవస్థాపకుడు ప్రియాంశ్ మురార్కా తెలిపారు.
"దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఛార్జర్ల కొరత ఉండవచ్చు, కానీ మొత్తంగా చూస్తే పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగుపడింది. అయితే, ఇప్పుడు ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే.. హైవేపై వెళుతున్నప్పుడు కొన్ని ఛార్జర్లు సాంకేతిక కారణాల వల్ల పనిచేయకపోవడం. వీటిని నిరంతరం ఆన్‌లైన్‌లో ఉండేలా చూడటమే ఇప్పుడు పెద్ద సవాలు," అని ఆయన వివరించారు.
ముఖ్యమైన హైవేలపై ఛార్జింగ్ నెట్‌వర్క్ (2025 డేటా):
ఎన్‌హెచ్ 48 (దీల్లీ - చెన్నై): ఈ జాతీయ రహదారిపై అత్యధికంగా 652 పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇక్కడ 41% వృద్ధి నమోదైంది.
ఎన్‌హెచ్ 44 (శ్రీనగర్ - కన్యాకుమారి): దేశంలోనే అతి పొడవైన ఈ జాతీయ రహదారిపై ఛార్జింగ్ స్టేషన్లు 70% పెరిగి, మొత్తం 574కి చేరుకున్నాయి.
ఎన్‌హెచ్ 66 (పన్వెల్ - కన్యాకుమారి): ఈ రూట్‌లో 240 స్టేషన్లు ఉన్నాయి (45% వృద్ధి).
ఎన్‌హెచ్ 16 (కోల్‌కతా - చెన్నై): ఇక్కడ ఏకంగా 92% వృద్ధితో 227 స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి.
ఎన్‌హెచ్ 65 (పుణె - మచిలీపట్నం): 46% వృద్ధితో 213 స్టేషన్లు ఏర్పాటయ్యాయి.
టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా వంటి కంపెనీలు ఛార్జ్ జోన్, స్టాటిక్ వంటి ఆపరేటర్లతో కలిసి ఈ నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఛార్జింగ్ స్టేషన్లు పెట్టే విషయంలో చురుగ్గా పాల్గొంటున్నాయి.
స్టాటిక్ సీఈఓ అక్షిత్ బన్సల్ మాట్లాడుతూ.. "దిల్లీ-చండీగఢ్ కారిడార్ ఛార్జింగ్ సౌకర్యాలకు ఉత్తమ ఉదాహరణగా నిలుస్తోంది. దీని తర్వాత దిల్లీ-జైపూర్, జైపూర్-ఉదయ్‌పూర్ మార్గాలు 'ఈవీ టూరిజం' హైవేలుగా అవతరిస్తున్నాయి. హైవే ఎలక్ట్రిఫికేషన్ అనేది ఇప్పుడు కేవలం అక్కడక్కడా ఛార్జర్లు పెట్టడం గురించి కాదు, ఒక క్రమ పద్ధతిలో కారిడార్లను అభివృద్ధి చేయడం గురించి," అని పేర్కొన్నారు.
రెస్టారెంట్లు - కొత్త ఛార్జింగ్ పాయింట్లు..
"సాధారణంగా మూడు, నాలుగు గంటల డ్రైవింగ్ తర్వాత ఎవరైనా పిట్-స్టాప్ (విరామం) కోరుకుంటారు. ఆ సమయంలో హైవే రెస్టారెంట్లలో ఛార్జర్ అందుబాటులో ఉంటే, భోజనం చేసే లోపు వాహనం ఛార్జ్ అయిపోతుంది," అని ఛార్జ్ జోన్ సీఈఓ కార్తికేయ హరియాణి వివరించారు
దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వెసులుబాటు ఎక్కువగా కనిపిస్తోంది. ఆ తర్వాత పశ్చిమ, ఉత్తర భారతం నిలుస్తున్నాయి.
భవిష్యత్తు లక్ష్యాలు..
గత ఏడాది భారతదేశంలో ఈవీ విక్రయాలు 20 లక్షల మార్కును దాటాయి. ఇది మొత్తం వాహనాల విక్రయాల్లో 8 శాతానికి సమానం. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మహీంద్రా, టాటా మోటార్స్,
టాటా మోటార్స్, మారుతీ సుజుకీ 2030 నాటికి లక్ష ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. మహీంద్రా 2027 నాటికి 1,000 పాయింట్లను లక్ష్యంగా పెట్టుకుంది.
టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. "ఉత్పత్తుల విడుదల, మౌలిక సదుపాయాల కల్పన రెండూ కలిసి సాగినప్పుడే ఈవీ రంగం నిలకడగా ఎదుగుతుంది," అని పేర్కొన్నారు.
మారుతీ సుజుకీ కూడా, తమ ఈ-విటారా లాంచ్‌కు ముందే కస్టమర్లలో భరోసా నింపేందుకు, అన్ని రకాల ఛార్జింగ్ వెసులుబాట్లను వృద్ధి చేస్తామని హామీనిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


