Toyota Glanza Facelift : 24.7 కి.మీ మైలేజ్​తో టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్! లాంచ్ రేపే..

టయోటా కిర్లోస్కర్ మోటార్ తమ హిట్ హ్యాచ్‌బ్యాక్ 'గ్లాంజా' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అక్టోబర్ 14న భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. కొత్త డిజైన్, జెడ్-సిరీస్ 3-సిలిండర్ ఇంజిన్, లెవెల్-2 అడాస్ సేఫ్టీ ఫీచర్లతో రానున్న ఈ కారు పూర్తి వివరాలు ఇవే..

Published on: Oct 13, 2026, 17:05:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ‘టయోటా గ్లాంజా’.. సరికొత్త రూపంలో అలరించేందుకు సిద్ధమైంది. అప్డేటెడ్ మారుతీ సుజుకీ బలెనో మార్కెట్లోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే, టయోటా కిర్లోస్కర్ మోటార్ తమ '2026 గ్లాంజా ఫేస్‌లిఫ్ట్' మోడల్‌ను రేపు, అక్టోబర్ 14న అధికారికంగా ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ విడుదల చేసిన ఫస్ట్ టీజర్ ఆటోమొబైల్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్​.. లాంచ్​కు రెడీ!
టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్​.. లాంచ్​కు రెడీ!

లాంచ్ నేపథ్యంలో ఈ టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్ విశేషాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్- కొత్త డిజైన్, మరింత స్పోర్టీ లుక్..

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ ముందు భాగం గణనీయమైన మార్పులకు గురైంది. టయోటా తమ ఐకానిక్ లోగోను రేడియేటర్ గ్రిల్ నుంచి ఏకంగా బానెట్ ముందు అంచుపైకి మార్చేసింది. సిల్వర్ గార్నిష్ ఫినిషింగ్‌తో కూడిన సరికొత్త గ్రిల్, హెక్సాగోనల్ ఆకారంలో ఉన్న ఎయిర్ డామ్, కొత్త ఆకారంలో రెక్టాంగ్యులర్ (దీర్ఘచతురస్రాకార) ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్‌లు ఈ కారుకు ప్రీమియం లుక్‌ని తెచ్చిపెట్టాయి. 16-ఇంచుల సరికొత్త అలాయ్ వీల్స్ మినహా పక్క ప్రొఫైల్ మారలేదు.

టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్- అత్యాధునిక క్యాబిన్, లెవెల్-2 అడాస్ సేఫ్టీ!

క్యాబిన్ లోపల డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, 9-ఇంచుల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు కొనసాగనున్నాయి. ఈ కొత్త వర్షన్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కూల్డ్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, అప్‌గ్రేడ్ చేసిన ఆడియో సిస్టమ్‌లను అందించే అవకాశం ఉంది.

ఈ హ్యాచ్​బ్యాక్​లో అందించనున్న ప్రధాన భద్రతా ఫీచర్ లెవెల్-2 అడాస్. హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఈ టెక్నాలజీ రావడం టయోటా గ్లాంజాకే ప్రత్యేకతగా నిలవనుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ హై-బీమ్ అసిస్ట్ వంటి సదుపాయాలు ప్రయాణికులకు గరిష్ట భద్రతను ఇస్తాయి. వీటితో పాటు టీపీఎంఎస్, 360-డిగ్రీ కెమెరా, హిల్-హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు లభించనున్నాయి.

టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్- ఇంజిన్, మైలేజ్..

ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్ 4-సిలిండర్ కే-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ స్థానంలో, 2026 గ్లాంజాలో సరికొత్త 1.2-లీటర్ 3-సిలిండర్ Z12E పెట్రోల్ ఇంజిన్‌ను టయోటా తీసుకురానుంది. ఈ నూతన ఇంజిన్ 83 హెచ్​పీ పవర్, 112 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మునుపటి ఇంజిన్ కంటే పవర్ కాస్త తగ్గినా, ఇంధన పొదుపు విషయంలో ఇది లీటరుకు 23.8 నుంచి 24.7 కిలోమీటర్ల వరకు మెరుగైన మైలేజ్ అందిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. సీఎన్జీ మోడళ్లలోనూ ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను అందించేందుకు టయోటా సన్నాహాలు చేస్తోంది.

టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్- ధర, పోటీ..

ప్రస్తుతం మార్కెట్లో విక్రయమవుతున్న గ్లాంజా ప్రారంభ ధర రూ. 6.73 లక్షల నుంచి రూ. 9.99 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. అధునాతన అప్డేట్లు పొందిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధర కాస్త పెరిగే అవకాశముంది.

లాంచ్ అనంతరం భారత మార్కెట్లో మారుతీ సుజుకీ బలెనో, హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ వంటి పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఈ టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ ప్రధాన పోటీదారుగా నిలవనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More