Best hatchback car : గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ ఆల్ట్రోజ్.. ఏది బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్?
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పోటీపడుతున్న సరికొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్, టాటా ఆల్ట్రోజ్ టాప్ వేరియంట్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు, ఇంజిన్ పర్ఫార్మెన్స్, ఫీచర్లు, ధరలు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇంధన పొదుపు పెంచేందుకు దాదాపు అన్ని ఆటోమొబైల్ సంస్థలు 4-సిలిండర్ ఇంజిన్ల స్థానంలో 3-సిలిండర్ ఇంజిన్లను పరిచయం చేస్తున్నాయి. మరోవైపు, పెట్రోల్ ధరకు ప్రత్యామ్నాయంగా సీఎన్జీ మోడళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ మోడల్ తాజాగా ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇది.. మొదటినుంచీ సేఫ్టీ, పవర్‌తో మెప్పిస్తున్న ‘టాటా ఆల్ట్రోజ్’కు గట్టి పోటీని ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు కార్ల టాప్ వేరియంట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను ఇక్కడ పరిశీలిద్దాము..

టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ టాటా ఆల్ట్రోజ్- ఇంజిన్, పర్ఫార్మెన్స్..
టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో మారుతీ సుజుకీ బలెనో తరహాలోనే సరికొత్త 1.2-లీటర్ Z12E 3-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 81.8 బీహెచ్పీ పవర్, 112.4 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. సీఎన్జీ వర్షన్లో ఇదే ఇంజిన్ 68.79 బీహెచ్పీ పవర్, 101.8 ఎన్ఎం టార్క్‌ను అందిస్తూ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది.
దీనికి భిన్నంగా టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ వినియోగదారులకు రెండు విభిన్న ఇంజిన్ ఆప్షన్లను అందిస్తోంది. ఇందులో 1.2-లీటర్ 3-సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ (86 బీహెచ్పీ, 115 ఎన్!ఎం) ఒకటైతే, 1.5-లీటర్ 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ (88 బీహెచ్పీ, 200 ఎన్ఎం) సదుపాయం ఉంది. డీజిల్ ఇంజిన్ ఇచ్చే హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఆల్ట్రోజ్ ప్రత్యేకం. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీతో పాటు అత్యంత ప్రతిస్పందన కలిగిన 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (డీసీఏ) గేర్‌బాక్స్ అందుబాటులో ఉన్నాయి.
టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ టాటా ఆల్ట్రోజ్- ఫీచర్లు, టెక్..
టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ టాప్ వేరియంట్ ఈ విభాగంలోనే తొలిసారిగా లెవెల్-2 అడాస్ సేఫ్టీ ఫీచర్‌ను కలిగి ఉంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కూలింగ్ ఫంక్షన్‌తో కూడిన వైర్లెస్ ఛార్జర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్ప్లే, లేథరెట్ సీటింగ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.
మరోవైపు టాటా ఆల్ట్రోజ్ సరికొత్త ప్రీమియం ఫీచర్లతో అలరిస్తోంది. ఇందులో ఎలక్ట్రికల్ సన్‌రూఫ్, 10.24-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ (వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే), ఎయిర్ ప్యూరిఫైయర్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ సిస్టమ్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరా, 65డబ్ల్యూ టైప్-సీ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు, డిజిటల్ టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, వెనుక ఏసీ వెంట్లను పొందుపరిచారు.
టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ టాటా ఆల్ట్రోజ్- ధరలు..
టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.99 లక్షలుగా ఉండగా, ఫుల్లీ లోడెడ్ టాప్ వేరియంట్ ధర రూ. 10.98 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది.
ఇక టాటా ఆల్ట్రోజ్ ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు కాగా, అన్ని హంగులు కలిగిన టాప్ వేరియంట్ ధర రూ. 10.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.
హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో నిత్యం ట్రాఫిక్‌లో రాకపోకలు సాగిస్తూ అధునాతన డ్రైవింగ్ అసిస్టెన్స్ (అడాస్) కోరుకునే వారికి గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ మంచి ఎంపిక. అలాగే సన్‌రూఫ్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్, బలమైన నిర్మాణం (సేఫ్టీ) ఆశించే వారికి టాటా ఆల్ట్రోజ్ సరైన పోటీదారుగా నిలుస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


