Honda Elevate facelift : హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ డ్రైవ్ రివ్యూ.. పోటీని తట్టుకోగలదా? కొనొచ్చా? వద్దా?

ఇటీవలే లాంచ్ అయిన హోండా ఎలివేట్​ ఫేస్​లిఫ్ట్​ని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హెచ్​టీ ఆటో టీమ్ చేసిన డీటైల్డ్​ ఎలివేట్​ ఫేస్​లిఫ్ట్ డ్రైవ్​ రివ్యూని ఇక్కడ చూసేయండి..

Published on: Oct 11, 2026, 08:17:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ల్యాప్‌టాప్ తరహా పెద్ద స్క్రీన్​లు, టర్బో ఇంజిన్లు, స్ట్రాంగ్ హైబ్రిడ్ సాంకేతికతతో భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కార్ల తయారీ సంస్థలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి కార్లు సరికొత్త ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో, తన పాతకాలపు నమ్మకమైన శైలినే నమ్ముకుని హోండా ఎలివేట్.. కొత్త ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​తో భారతీయుల ముందుకు వచ్చింది.

హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్ రివ్యూ..
హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్ రివ్యూ..

హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్ వెలుపలి డిజైన్‌లో కొన్ని మార్పులు, క్యాబిన్‌లో కొన్ని అత్యవసర అప్‌డేట్లను సంస్థ జోడించింది. అయితే పైపైన కనిపించే ఈ కొత్త హంగులను పక్కనబెడితే, కారు ప్రాథమిక నిర్మాణంలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇప్పటికీ అదే నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, సీవీటీ గేర్‌బాక్స్‌లతో లభిస్తోంది. పోటీ తీవ్రంగా ఉన్న ఈ విభాగంలో ఈ కొన్ని మార్పులతో ఎలివేట్ నిలదొక్కుకోగలదా? డ్రైవింగ్‌లో ఇది ఎలాంటి అనుభూతిని ఇస్తోంది? హెచ్​టీ ఆటో డ్రైవ్ రివ్యూను ఇక్కడ చూసేయండి..

హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్ రివ్యూ- ఎక్స్‌టీరియర్ డిజైన్..

ఈ ఎస్​యూవీని మొదటిసారి చూడగానే పాత మోడల్ రూపురేఖలే కనిపిస్తాయి. బాక్సీ డిజైన్, ఎత్తైన పొజిషన్‌ను హోండా అలాగే కొనసాగించింది.

2026 హోండా ఎలివేట్ ముందు భాగంలో ప్రధాన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఫ్రంట్ గ్రిల్ పైభాగంలో మందపాటి హారిజాంటల్ ఎలిమెంట్ రాగా, హోండా లోగోను గ్రిల్ నుంచి బానెట్ ముందుకు మార్చారు. మెరిసే క్రోమ్ స్థానంలో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. ఫాగ్ లాంప్ పరిసరాలను కారు రంగులోనే తీర్చిదిద్దారు. పాత గ్రిల్ డిజైన్‌తో పోలిస్తే కొత్తది కాస్త బరువుగా అనిపించినా, కారుకు కమాండింగ్ లుక్ ఇస్తుంది.

సైడ్స్​ నుంచి చూస్తే క్రోమ్ విండో లైన్ స్థానంలో బ్లాక్ ట్రిమ్, డోర్ హ్యాండిల్స్ బాడీ కలర్లోకి మారాయి. 17 ఇంచుల అల్లాయ్ వీల్స్ డిజైన్‌ను మార్చారు. వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్ కారుకు అధునాతన లుక్‌ని అందిస్తున్నాయి. టాప్-స్పెసిఫికేషన్ మోడల్‌లో వెనుక చక్రాలకు డిస్క్ బ్రేకులను జోడించడం విశేషం.

హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్ రివ్యూ- ఇంటీరియర్..

క్యాబిన్ లోపల అడుగుపెట్టగానే పాత టాన్ ఫినిషింగ్ స్థానంలో నయా ఐవరీ, బ్లాక్ కాంబినేషన్ ఉనికి చాటుతుంది. వెలుతురు బాగా వచ్చి క్యాబిన్ చాలా విశాలంగా అనిపిస్తుంది. అయితే ఈ లేత రంగు సీట్లను శుభ్రంగా ఉంచుకోవడం కాస్త శ్రమతో కూడుకున్నదే!

ఫీచర్ల పరంగా హోండా ఈసారి కొనుగోలుదారుల కోరికలను నెరవేర్చింది:

  • 360-డిగ్రీ కెమెరా: ఇరుకైన సందుల్లో కారును పార్కింగ్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది.
  • పవర్డ్ సీట్లు: ముందు వరుస డ్రైవర్, ప్యాసింజర్ సీట్లను ఎలక్ట్రానిక్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
  • ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్: పాత హ్యాండ్ బ్రేక్ స్థానంలో ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఈపీబీని సీవీటీ వేరియంట్లలో ఇచ్చారు.
  • వైర్‌లెస్ ఛార్జింగ్: స్మార్ట్‌ఫోన్ల ఛార్జింగ్ సౌకర్యాన్ని మెరుగుపరిచారు.

10.25 ఇంచుల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అలాగే కొనసాగించారు. స్క్రీన్ రెస్పాన్స్ బాగున్నప్పటికీ, ప్రత్యర్థులతో పోలిస్తే గ్రాఫిక్స్ కాస్త పాతబడినట్లు అనిపిస్తాయి. అయితే ఏసీ నియంత్రణ కోసం ఫిజికల్ బటన్లను ఉంచడం అభినందనీయం.

హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్ రివ్యూ- సెగ్మెంట్​లోనే తొలిసారి!

ఎలివేట్‌లో స్పేస్ ఎప్పుడూ ఒక పెద్ద ప్లస్ పాయింట్. ముందు సీటును డ్రైవర్ పొడవుకు సర్దుబాటు చేసినా, వెనుక సీటులో మోకాళ్లకు, తలకు పుష్కలంగా ఖాళీ ఉంటుంది. సీట్ తొడల కింద మంచి సపోర్ట్ ఇస్తుంది.

హోండా ఈ ఫేస్‌లిఫ్ట్‌లో అందించిన అతిపెద్ద సర్‌ప్రైజ్ ‘వెనుక సీటు వెంటిలేషన్’! ఈ సెగ్మెంట్‌లో వెనుక వరుస సీట్లకు వెంటిలేషన్ సదుపాయం ఇవ్వడం ఇదే తొలిసారి. భారతీయ వేసవి వాతావరణంలో ఇది అత్యంత ఉపయోగకరమైన ఫీచర్. దీనికి తోడు వెనుక ఏసీ వెంట్లు, టైప్-సీ ఛార్జింగ్ పోర్టులు ఉన్నాయి. కారులో ఉన్న 458 లీటర్ల బూట్ స్పేస్ వారాంతపు ప్రయాణాలకు, రోడ్డు ట్రిప్పులకు సరైన నిల్వ సామర్థ్యాన్ని అందిస్తుంది.

హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్ రివ్యూ- ఇంజిన్, డ్రైవింగ్ ఎక్స్​పీరియెన్స్..

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 121 హెచ్‌పీ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ ఆప్షన్లలో లభిస్తోంది.

ఈ ఇంజిన్ తక్షణమే రాకెట్‌లా దూసుకెళ్లే టర్బో ఇంజిన్ కాదు. కానీ రోజువారీ ప్రయాణాల్లో ఎంతో స్మూత్‌గా, నిశ్శబ్దంగా పనిచేస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో సీవీటీ గేర్‌బాక్స్ వేగంగా స్పందిస్తుంది. గట్టిగా యాక్సిలరేటర్ తొక్కినప్పుడు కొంత రబ్బర్-బ్యాండ్ ప్రభావం కనిపిస్తుంది. అంటే ఇంజిన్ శబ్దం పెరిగిన తర్వాత కారు వేగం అందుకోవడం మొదలవుతుంది. అయితే దీనిని హోండా బాగానే నియంత్రించింది.

స్టీరింగ్ రెస్పాన్స్ చాలా స్పష్టంగా ఉంది. కారు ఎత్తుగా ఉన్నప్పటికీ, మలుపుల్లో చాలా స్టాండర్డ్‌గా, బాడీ రోల్ లేకుండా వెళ్తుంది. సస్పెన్షన్ సిస్టమ్ గుంతలను, రోడ్డు ఎత్తుపల్లాలను సునాయాసంగా తట్టుకుంటుంది. బ్రేకుల పనితీరు పక్కాగా ఉంది.

హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్ రివ్యూ- హైవేపై రోడ్డు శబ్దం

ఎన్విహెచ్ (నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్) స్థాయిలను తగ్గించడానికి హోండా కృషి చేసింది. నగరంలో ఇంజిన్ శబ్దం క్యాబిన్‌లోకి అస్సలు రాదు. అయితే ముంబై-దిల్లీ ఎక్స్‌ప్రెస్‌వేపై వందకు పైగా వేగంతో వెళుతున్నప్పుడు టైర్ల నుంచి వచ్చే రోడ్డు శబ్దం క్యాబిన్‌లో స్పష్టంగా వినిపిస్తుంది. హైవేలపై లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు ఈ రోడ్డు శబ్దాన్ని మరికాస్త తగ్గించి ఉంటే ప్రయాణం మరింత ప్రశాంతంగా ఉండేది.

హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్ రివ్యూ- కొనాలా? వద్దా?

2026 హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ విప్లవాత్మక మార్పులేవీ చేయకపోయినా, ప్రాక్టికల్ ప్రాధాన్యం ఉన్న ఫీచర్లతో వచ్చింది. 360 డిగ్రీ కెమెరా, పవర్డ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వెనుక సీట్ల వెంటిలేషన్ వంటి అప్‌డేట్లు మునుపటి లోపాలను తీర్చాయి.

స్మూత్ పెట్రోల్ ఇంజిన్, విశాలమైన క్యాబిన్, డ్రైవర్‌కు పూర్తి నియంత్రణ ఇచ్చే ఛాసిస్ దీని ప్రధాన బలాలు. టర్బో పెట్రోల్ లేదా స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్లు లేకపోవడం, హైవేపై టైర్ నాయిస్ రావడం కొన్ని పరిమితులు.

కాగా ఎలాంటి హంగామా లేకుండా ప్రశాంతమైన ప్రయాణాన్ని, డ్రైవింగ్ ఆనందాన్ని, స్పేస్‌ను కోరుకునే కుటుంబాలకు హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ఒక అత్యుత్తమ ఎంపిక.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More