ట్రెంట్ షేర్లు 8% పతనం: టాటా గ్రూప్ ఫ్యాషన్ దిగ్గజాన్ని దెబ్బతీస్తున్న కారణాలు?

Trent shares: క్యూ3 ఫలితాల అప్‌డేట్ తర్వాత టాటా గ్రూప్ రిటైల్ సంస్థ 'ట్రెంట్' షేర్లు 8% మేర పడిపోయాయి. ఆదాయ వృద్ధి వేగం తగ్గడం, ఇన్వెస్టర్ల అంచనాలను అందుకోలేకపోవడంతో ఈ ఫ్యాషన్ దిగ్గజం స్టాక్ మార్కెట్‌లో ఒత్తిడికి లోనవుతోంది.

Published on: Jan 6, 2026, 10:40:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల ఫేవరెట్ స్టాక్‌గా పేరున్న టాటా గ్రూప్ సంస్థ ట్రెంట్ (Trent) కు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక (Q3FY26) గణాంకాలు విడుదలైన వెంటనే, మంగళవారం ట్రేడింగ్‌లో ఈ షేరు ఏకంగా 8 శాతం మేర పతనమైంది. బీఎస్‌ఈలో ఈ షేరు ధర రూ. 4060.65 వద్దకు పడిపోయింది. ఇది ఏప్రిల్ 2024 తర్వాత నమోదైన అత్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం.

ట్రెంట్ షేర్లు 8% పతనం: టాటా గ్రూప్ ఫ్యాషన్ దిగ్గజాన్ని దెబ్బతీస్తున్న కారణాలు?
ట్రెంట్ షేర్లు 8% పతనం: టాటా గ్రూప్ ఫ్యాషన్ దిగ్గజాన్ని దెబ్బతీస్తున్న కారణాలు?

గత కొన్నేళ్లుగా మల్టీబ్యాగర్‌గా నిలిచిన ఈ స్టాక్, గత ఏడాది నిఫ్టీ 50లో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచిన షేర్లలో ఒకటిగా నిలిచింది. ఆదాయం తగ్గడం, అధిక వాల్యుయేషన్ ఆందోళనల మధ్య ఈ ఏడాది కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది.

వృద్ధి రేటు నెమ్మదించడమే ప్రధాన కారణమా?

ట్రెంట్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం (GST మినహాయించి) ఏడాది ప్రాతిపదికన 17% పెరిగి రూ. 5,220 కోట్లకు చేరింది. అయితే, ఇది పైకి చూడటానికి బాగానే ఉన్నా, గత ఏడాది ఇదే సమయంలో సంస్థ నమోదు చేసిన 40-50% అద్భుతమైన వృద్ధి రేటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

వరుసగా రెండు త్రైమాసికాలుగా ఆదాయ వృద్ధి 18-20% మధ్యనే ఉండటం, సంస్థ వృద్ధి వేగం మందగించిందనే సంకేతాలను మార్కెట్‌కు పంపుతోంది.

విస్తరణ పెరిగినా.. డిమాండ్ ఏది?

ఈ క్యూ3లో ట్రెంట్ దూకుడుగా స్టోర్లను విస్తరించింది. 17 వెస్ట్‌సైడ్ (Westside), 48 జుడియో (Zudio) స్టోర్లను ప్రారంభించింది. అయితే, కొత్త స్టోర్ల ఏర్పాటు పెరిగినప్పటికీ, పాత స్టోర్ల నుంచి వచ్చే ఆదాయం (Like-for-like sales) మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితమైందని విశ్లేషకులు చెబుతున్నారు.

"ట్రెంట్ వృద్ధి పూర్తిగా పడిపోయిందని చెప్పలేం కానీ, దాని నాణ్యత తగ్గింది. కొత్త స్టోర్ల ద్వారా ఆదాయం వస్తోంది తప్ప, పాత స్టోర్లలో డిమాండ్ అంతగా లేదు. పైగా ఒకే చోట ఎక్కువ స్టోర్లు ఉండటం వల్ల ఒక స్టోర్ అమ్మకాలను మరొకటి ప్రభావితం చేసే (Cannibalisation) పరిస్థితి కనిపిస్తోంది." అని ఏంజెల్ వన్ సీనియర్ అనలిస్ట్ వకార్జావేద్ ఖాన్ వివరించారు.

మార్కెట్ ఎందుకు ఆందోళన చెందుతోంది?

ట్రెంట్ షేర్ ధర పతనానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి:

అధిక వాల్యుయేషన్: గత ఏడాది భారీగా పతనమైనప్పటికీ, ట్రెంట్ షేరు ఇప్పటికీ 91 రెట్లు అధిక పీఈ (P/E) మల్టిపుల్‌తో ట్రేడవుతోంది. అంటే, సంస్థ సంపాదన కంటే ఇన్వెస్టర్లు దానిపై చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు.

అంచనాల సవరణ: "గతంలో ట్రెంట్ అద్భుతమైన పనితీరు కనబరుస్తుందని భావించి ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు డిమాండ్ సాధారణ స్థాయికి చేరుకోవడంతో, మార్కెట్ తన అంచనాలను మార్చుకుంటోంది. ఇలాంటి సందర్భాల్లో షేర్ ధరలో భారీ సర్దుబాటు (Correction) సహజం." అని ఐఎన్‌వీ అసెట్ పీఎంఎస్ బిజినెస్ హెడ్ హర్షల్ దసాని పేర్కొన్నారు.

పెట్టుబడిదారుల గమనికకు..

ట్రెంట్ గత ఐదేళ్ల కాలంలో 510% లాభాలను అందించిన మల్టీబ్యాగర్ అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ మందగించడం సంస్థకు సవాలుగా మారింది. మంగళవారం ఉదయం 10:37 గంటల సమయానికి ఈ షేరు రూ. 4107.30 వద్ద ట్రేడవుతోంది.

(గమనిక: పైన తెలిపిన అభిప్రాయాలు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకరేజ్ కంపెనీ సంస్థల ప్రతినిధులవి. మార్కెట్ పరిస్థితులు చాలా వేగంగా మారుతుంటాయి. పెట్టుబడులు పెట్టేముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులను సంప్రదించడం, మీరు స్వతహాగా అవగాహన కలిగి ఉండడం శ్రేయస్కరం.)

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More