H-1B visa : హెచ్-1బీ వీసాలపై మూడేళ్ల నిషేధం? భారతీయులకు శాపంగా.. అమెరికాలో కొత్త బిల్లు!

H-1B visa news : అమెరికాలో ఉంటున్న లేదా అగ్రరాజ్యానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్న భారతీయులకు షాక్! హెచ్​-1బీ వీసాను సమూలంగా మార్చివేసేందుకు ఉద్దేశించిన బిల్లు ఆ దేశ కాంగ్రెస్​ ముందుకు వచ్చింది. వీసా జారీపై 3ఏళ్ల నిషేధం విధించాలని ఈ బిల్లు సూచిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Apr 25, 2026, 12:19:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

H-1B Visa scrap : అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలనుకునే భారతీయులకు, ముఖ్యంగా తెలుగు ఐటీ నిపుణులకు భారీ షాక్ తగిలేలా ఉంది! వర్క్​ పర్మిట్​ కోసం ఇచ్చే హెచ్-1బీ వీసా వ్యవస్థను సమూలంగా మార్చేస్తూ, ఏకంగా మూడేళ్ల పాటు కొత్త వీసాల జారీని నిలిపివేయాలని కోరుతూ రిపబ్లికన్ ఎంపీలు అమెరికా కాంగ్రెస్‌లో ఒక కీలక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే.. లక్షలాది మంది భారతీయుల పరిస్థితి గందరగోళంగా మారే ప్రమాదం లేకపోలేదు!

హెచ్​-1బీ వీసా రూల్స్​ మార్పునకు అమెరికాలో బిల్లు.. (REUTERS)
హెచ్​-1బీ వీసా రూల్స్​ మార్పునకు అమెరికాలో బిల్లు.. (REUTERS)

'ఎండ్ హెచ్-1బీ వీసా అబ్యూస్ యాక్ట్ 2026'

రిపబ్లికన్ ఎంపీ ఎలీ క్రేన్ నేతృత్వంలోని బృందం ఈ ప్రతిపాదిత బిల్లును తీసుకొచ్చింది. దీని ప్రధాన ఉద్దేశం.. అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడటమని వారు చెబుతున్నారు.

"అమెరికా ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల లాభాల కోసం కాదు, ఇక్కడి పౌరుల కోసం పనిచేయాలి. అర్హులైన అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను హెచ్-1బీ వ్యవస్థ దూరం చేస్తోంది," అని ఎలీ క్రేన్ పేర్కొన్నారు.

ప్రతిపాదిత మార్పులు ఇవే.. (భారతీయులపై ప్రభావం)

ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే, భారత ఐటీ రంగానికి, అక్కడి భారతీయ ఉద్యోగులకు తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

ఈ బిల్లులోని ప్రధానాంశాలు:

మూడేళ్ల విరామం: కొత్త హెచ్-1బీ వీసాల జారీని మూడేళ్ల పాటు పూర్తిగా నిలిపివేయాలి.

కోటా తగ్గింపు: ప్రస్తుతం ఏడాదికి ఇస్తున్న 65,000 వీసాల పరిమితిని ఏకంగా 25,000 కు తగ్గించాలి.

కనీస వేతనం రూ. 1.6 కోట్లు: హెచ్-1బీ ఉద్యోగికి కనీసం ఏడాదికి 200,000 డాలర్లు (సుమారు రూ. 1.67 కోట్లు) వేతనం చెల్లించాలి. దీనివల్ల కంపెనీలు తక్కువ జీతానికి విదేశీయులను తీసుకోవడం ఆగిపోతుంది.

డిపెండెంట్లకు నో ఎంట్రీ: వీసా పొందిన వారు తమ జీవిత భాగస్వాములను లేదా పిల్లలను అమెరికాకు తీసుకెళ్లడంపై నిషేధం.

గ్రీన్ కార్డ్ కలపై నీళ్లు: హెచ్-1బీ నుంచి పర్మనెంట్ రెసిడెన్సీ (గ్రీన్ కార్డ్) కి మారే ప్రక్రియను రద్దు చేయడం.

ఓటీపీ రద్దు: విద్యార్థులు చదువు పూర్తయ్యాక చేసే 'ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్' (ఓటీపీ) ప్రోగ్రామ్‌ను కూడా అంతం చేయాలని ప్రతిపాదించారు.

హెచ్-1బీ వీసాలపై మూడేళ్ల నిషేధం?
హెచ్-1బీ వీసాలపై మూడేళ్ల నిషేధం?

'స్కామ్' అని అభివర్ణించిన ఎంపీలు..

ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్న ఆండీ ఓగ్లెస్ వంటి ఎంపీలు హెచ్​-1బీ వీసా వ్యవస్థపై మరింత ఘాటుగా స్పందించారు.

"హెచ్-1బీ అనేది ఒక పెద్ద స్కామ్. చౌకగా దొరికే విదేశీ శ్రమ కోసం అమెరికన్లను బలి చేస్తున్నారు. మా దేశంలో అమెరికన్లే అపరిచితులుగా మారడాన్ని మేము అంగీకరించము," అని ఆయన వ్యాఖ్యానించారు. థర్డ్ పార్టీ స్టాఫింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగులను తీసుకోవడాన్ని కూడా ఈ బిల్లు పూర్తిగా నిషేధించాలని కోరుతోంది.

భారతీయుల పరిస్థితి ఏంటి?

హెచ్-1బీ వీసాల ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో అత్యధిక శాతం భారతీయులే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో యువత ప్రతి ఏటా అమెరికా వెళ్తుంటారు. ఈ బిల్లు గనుక అమల్లోకి వస్తే అమెరికా వెళ్లాలనే కల, గ్రీన్ కార్డ్ ఆశలు గగనమవుతాయి.

అయితే, అమెరికాలోని టెక్ కంపెనీలు మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. విదేశీ నిపుణులు లేకపోతే అమెరికాలో ఆవిష్కరణలు కుంటుపడతాయని అవి వాదిస్తున్నాయి.

మరి ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More