...
...
Next Story

Trump : డొనాల్డ్ ట్రంప్ పని అయిపోయిందా? అమెరికా అధ్యక్షుడిగా దారుణమైన రేటింగ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రికార్డు స్థాయిలో 33 శాతానికి పడిపోయింది! వాషింగ్టన్ పోస్ట్-ఏబీసీ న్యూస్-ఇప్సోస్ సర్వేలో వెల్లడైన ఈ వివరాలు, నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల వేళ రిపబ్లికన్ పార్టీకి పెద్ద సవాలుగా మారాయి.

Published on: Oct 19, 2026, 05:25:37 IST
Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ గ్రాఫ్ అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది! వాషింగ్టన్ పోస్ట్-ఏబీసీ న్యూస్-ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. ట్రంప్ పాలనా తీరుపై ఏకంగా 66 శాతం మంది అమెరికన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆమోదయోగ్యత (అప్రూవల్ రేటింగ్) కేవలం 33 శాతానికి పడిపోయింది. గత ఏప్రిల్, జులై నెలల్లో జరిగిన సర్వేల్లో ఇది 37 శాతంగా ఉండగా, ఇప్పుడు మరింత క్షీణించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 52 శాతం మంది ట్రంప్ పాలనపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 3న జరిగే అత్యంత కీలకమైన మధ్యంతర ఎన్నికలకు కొన్ని రోజులే సమయం ఉన్న తరుణంలో ఈ ఫలితాలు వెలువడటం రిపబ్లికన్ పార్టీ నేతల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

రికార్డు కనిష్టానికి ట్రంప్ అప్రూవల్ రేటింగ్!
రికార్డు కనిష్టానికి ట్రంప్ అప్రూవల్ రేటింగ్!

మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల విజయావకాశాలను దెబ్బతీసే మూడు ప్రధాన అంశాలను ఈ సర్వే బయటపెట్టింది. అవి..

ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు.. పెట్రోల్ బాదుడు!

రిపబ్లికన్లకు మొదటి గండం.. పెరిగిన జీవన వ్యయం రూపంలో ఎదురవుతోంది! దేశంలో ద్రవ్యోల్బణాన్ని, పెరిగిన ధరలను ట్రంప్ సర్కారు నిర్వహించిన తీరుపై ప్రతి నలుగురిలో ముగ్గురు అమెరికన్లు ఆగ్రహంతో ఉన్నారు. 2025లో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని 48 శాతం మంది స్పష్టం చేశారు.

పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇంధన ధరల మార్పే నిదర్శనం. ఇరాన్‌పై సైనిక చర్యకు దిగకముందు, ఫిబ్రవరి నెలలో 71 శాతం మంది అమెరికన్లు గ్యాసోలిన్ ధరలు అందుబాటులోనే ఉన్నాయని చెప్పారు. అయితే ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతిని, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఇప్పుడు ఏకంగా 71 శాతం మంది ఇంధన ధరలు భరించలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా మందగించడం, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వాణిజ్యాలపై ప్రభావం చూపడం అమెరికా ప్రజల దైనందిన జీవితాన్ని దెబ్బతీసింది. కేవలం ఇంధనమే కాకుండా, రెస్టారెంట్లలో భోజనం చేయడం కూడా భరించలేని స్థాయిలో ఉందంటూ దాదాపు 60 శాతానికి పైగా ప్రజలు వాపోతున్నారు.

ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల హవా!

ట్రంప్ విదేశాంగ విధానంపై అమెరికా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇరాన్‌పై సైనిక దాడి చేయడాన్ని 65 శాతం మంది ప్రజలు చారిత్రక పొరపాటుగా అభివర్ణించారు. మిత్రదేశాలతో నడుచుకునే తీరుపై 68 శాతం మంది అసంతృప్తి చెందారు. యుద్ధ మేఘాలు అలముకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి ఏర్పడటం స్థానిక ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది.

మితిమీరిన తీరు.. సొంత ఓటర్లలోనూ అసంతృప్తి!

ట్రంప్ విధానాలు, రిపబ్లికన్ పార్టీ తీరుపై ఓటర్లలో తీవ్రమైన ప్రతికూల భావన ఏర్పడింది:

  • దేశం తప్పుడు దిశలో పయనిస్తోందని 72 శాతం మంది అభిప్రాయపడ్డారు.
  • అధ్యక్ష పదవిని ఉపయోగించుకుని ట్రంప్ సొంత లాభం పొందుతున్నారని 66 శాతం మంది విమర్శించారు.
  • ట్రంప్ తీరు చాలా ఎక్స్​ట్రీమ్ ధోరణితో ఉందంటూ 66 శాతం మంది పేర్కొన్నారు.
  • రిపబ్లికన్ పార్టీ ఎక్స్​ట్రీమిస్ట్ ధోరణితో ఉందేమోనని 55 శాతం మంది వ్యాఖ్యానించగా, డెమోక్రాట్ల విషయంలో ఈ సంఖ్య 36 శాతంగానే ఉంది.
  • 2024 ఎన్నికల్లో ట్రంప్‌నకు ఓటేసిన వారిలో కూడా 23 శాతం మంది ఇప్పుడు ఆయన పనితీరుపై, 38 శాతం మంది ద్రవ్యోల్బణ నివారణపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

అక్టోబర్ 9 నుంచి 13 మధ్య 2,545 మంది ప్రాతినిధ్యం వహించిన ఈ సర్వే ఫలితాలు, రాబోయే మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లకు స్పష్టమైన అవకాశాలను చూపుతున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks