...
...
Next Story

రష్యా నుంచి చమురు కొనబోమని ట్రంప్​కి చెప్పిన ప్రధాని మోదీ!

రష్యా నుంచి చమురు కొనుగోలను ఆపేస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చినట్టు ట్రంప్​ చెప్పారు. ఈ విషయంపై భారత్​ లేదా అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఇంకా స్పందించలేదు.

Updated on: Oct 16, 2025, 05:56:02 IST
Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కీలక ప్రకటన చేశారు! రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఆపేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు చెప్పినట్టు ట్రంప్ తెలిపారు. రష్యాను ఆర్థికంగా ఏకాకి చేసే ప్రయత్నాల్లో ఇది "పెద్ద ముందడుగు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ (REUTERS)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ (REUTERS)

ఉక్రెయిన్​తో యుద్ధం నేపథ్యంలో రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ట్రంప్​ అనేక ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో భారత్​ను టార్గెట్​ చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంతో భారత్​పై అమెరికా 25శాతం పెనాల్టీ (మొత్తం 50శాతం సుంకాలు) విధించిన విషయం తెలిసిందే!

'మోదీ హామీ ఇచ్చారు..'

వైట్‌హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. "భారత్ చమురు కొనుగోలు చేయడం నాకు సంతోషంగా లేదు. అందుకే, వారు రష్యా నుంచి ఇకపై చమురు కొనరని ఆయన (మోదీ) ఈ రోజు నాకు హామీ ఇచ్చారు," అని ట్రంప్ అన్నారు.

"ఇది చాలా పెద్ద ముందడుగు. ఇప్పుడు చైనా కూడా చమురు కొనకుండా ఒత్తిడి చేస్తాము," అని ఆయన అన్నారు.

అయితే, ప్రధాని మోదీ నిజంగా అలాంటి హామీ ఇచ్చారా? అనే విషయంపై వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ఈమెయిల్ ద్వారా సంప్రదించగా, ఇంకా ఎటువంటి సమాధానం రాలేదు. ఇటు భారత్​ సైతం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

విలేకరులతో మాట్లాడే సమయంలో, భారత్ వెంటనే చమురు దిగుమతులు ఆపడం సాధ్యం కాదని ట్రంప్ తెలిపారు. "ఇది కొంచెం సమయం పట్టే ప్రక్రియ. కానీ ఆ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుంది," అని ఆయన జోడించారు.

కానీ భారత్​కు రష్యా చిరకాల మిత్రపక్షంగా కొనసాగుతోంది. అమెరికా ఒత్తిడితో ఇప్పుడు చమురు కొనుగోలును ఆపేస్తే, భారత్​- రష్యా బంధంలో ఎదైనా మార్పులు కనిపిస్తాయా? అన్నది కూడా ఆసక్తిగా మారింది.

ఉక్రెయిన్​- రష్యా యుద్ధం..

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశ చమురు ఆదాయాన్ని అడ్డుకోవడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో రష్యా చమురును కొనుగోలు చేయడం ఆపేస్తామని భారత్ హామీ ఇస్తే, అది ప్రపంచ ఇంధన దౌత్యంలో ఒక కీలక మలుపు అవుతుంది.

రష్యా నుంచి ఎనర్జీ వనరులు కొనుగోలు చేస్తున్న అతిపెద్ద దేశాల్లో భారత్ ఒకటి. కాబట్టి భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే, అది మాస్కోకు ఒక పెద్ద షాక్ అవుతుంది! అంతేకాక, ఇప్పటికీ రష్యా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న ఇతర దేశాల లెక్కలను కూడా ఈ పరిణామం మార్చగలదు.

ట్రంప్ ఈ విషయాన్ని బహుళపక్ష ఆంక్షలపై మాత్రమే ఆధారపడకుండా, ద్వైపాక్షిక సంబంధాలను ఉపయోగించి ఆర్థిక ఏకాకితనాన్ని అమలు చేయాలని చూస్తున్న తరుణంలో ఇది వెలువడింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks