...
...
Next Story

ఎక్స్‌పైరీ అయిన ఆహార ఉత్పత్తులను రీప్యాకేజ్ చేస్తున్న ముఠా అరెస్టు

మ్యాగీ, లేస్, థమ్స్ అప్ వంటి ప్రముఖ బ్రాండ్ల కాలంచెల్లిన ఆహార ఉత్పత్తులను రీప్యాకేజ్ చేస్తున్న భారీ రాకెట్‌ను మహారాష్ట్ర ఎఫ్‌డీఏ గుట్టురట్టు చేసింది. ఈ దాడులపై సీనియర్ ఐఏఎస్ అధికారి తుకారాం ముండే స్పందిస్తూ.. వినియోగదారులను మోసం చేసే వ్యాపారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published on: Sep 3, 2026, 16:44:26 IST
Advertisement

లేస్, మ్యాగీ, థమ్స్ అప్.. మీరు రోజూ తినే ప్రముఖ బ్రాండెడ్ ఆహార పదార్థాలు ఎంతవరకు సురక్షితం? కాలంచెల్లిన ఉత్పత్తులకు నకిలీ లేబుళ్లు వేసి మార్కెట్లోకి వదులుతున్న భారీ రాకెట్‌ను మహారాష్ట్ర అన్నపానీయాల, ఔషధ పరిపాలన శాఖ (ఎఫ్‌డీఏ) బయటపెట్టింది. ఈ మెరుపు దాడులపై సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గడువు ముగిసిన సరుకుకు కొత్త లేబుళ్లు

ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే
ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే

ఆగస్టు 24 నుంచి 29 మధ్య ఠాణే, నవీ ముంబై పోలీసులతో కలిసి ఎఫ్‌డీఏ అధికారులు నవీ ముంబై, నోయిడా, ఢిల్లీ ప్రాంతాల్లో విస్తృత దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏకంగా 10 కంపెనీలు నకిలీ ఆహార పదార్థాలను విక్రయించడంతో పాటు, ఎక్స్‌పైరీ పూర్తయిన సరుకును రీప్యాకేజింగ్ చేస్తున్నట్లు తేలింది. లేస్, కుర్‌కురే, మ్యాగీ, నార్, హెల్మన్స్, థమ్స్ అప్ వంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను వీరు టార్గెట్ చేశారు. ప్యాకెట్లపై ఉన్న తయారీ, ఎక్స్‌పైరీ తేదీలను మార్చడంతో పాటు, పౌష్టికాహార వివరాల (Nutrition facts) పై కొత్త స్టిక్కర్లు అంటించి వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నట్లు ఎఫ్‌డీఏ అధికారులు గుర్తించారు.

'లేబుల్ అబద్ధం చెప్తే పౌరుడికే నష్టం'

ఈ దాడుల అనంతరం ఐఏఎస్ అధికారి తుకారాం ముండే సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో తీవ్రంగా స్పందించారు. "లేబుల్ అబద్ధం చెబితే, దాని మూల్యాన్ని వినియోగదారుడే చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్యాకెట్‌పై ఉండే ఎక్స్‌పైరీ తేదీ కేవలం సిరా చుక్క కాదు. న్యూట్రిషన్ లేబుల్ అనేది కేవలం పొడి సమాచారం కాదు. అవి వినియోగదారుడికి కంపెనీలు ఇచ్చే బాధ్యతాయుతమైన హామీలు" అని ఆయన స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో ఆహార భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న తుకారాం ముండే చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బాంబే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తుండటం విశేషం.

మరోవైపు ఆహార భద్రత, పారిశుధ్య ప్రమాణాలు పాటించని ముంబైలోని రెండు ప్రముఖ సంస్థల లైసెన్సులను ఎఫ్‌డీఏ ఇటీవల రద్దు చేసింది. ఆరే మిల్క్ కాలనీలోని 'ఈట్‌క్లబ్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్', కుర్లా వెస్ట్‌లోని 'రాణి డైట్స్ కన్సల్టెంట్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్' సంస్థలపై ఆహార భద్రత ప్రమాణాల చట్టం-2006 కింద చర్యలు తీసుకున్నారు. ముండే నాయకత్వంలోని అధికారుల తనిఖీల్లో అక్కడ ఆహారం, రసాయనాలు నిల్వ చేసేందుకు సరైన వసతులు లేకపోవడం, కార్మికులకు చేతుల శుభ్రత లేకపోవడం, ఈగలు, పురుగుల నివారణ చర్యలు తీసుకోకపోవడం, ముడిసరుకును సరిగ్గా పరిశీలించకపోవడం వంటి తీవ్ర లోపాలను గుర్తించారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks