Ola Strike : ఓలా నుంచి రాపిడో వరకు.. ఈ రోజు డ్రైవర్ల స్ట్రైక్- ప్రజలకు తీవ్ర ఇబ్బందులు!
శనివారం (ఫిబ్రవరి 7) దేశవ్యాప్తంగా ఓలా, ఉబెర్, రాపిడో వంటి యాప్ ఆధారిత వాహన డ్రైవర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. 'ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్' పేరుతో జరుగుతున్న ఈ నిరసన కారణంగా దేశవ్యాప్తంగా క్యాబ్, ఆటో సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
భారతదేశవ్యాప్తంగా శనివారం, ఫిబ్రవరి 7వ తేదీన ప్రజలు తమ ప్రయాణ ప్రణాళికల్లో అంతరాయాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. రోడ్డు రవాణాకు అత్యంత కీలకంగా మారిన ఓలా, ఉబెర్, రాపిడో వంటి యాప్ ఆధారిత రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో సంబంధం ఉన్న డ్రైవర్లు నేడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం ఇందుకు కారణం. ఈ నిరసనను ‘ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్’ అని పిలుస్తున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లందరూ తమ రైడ్-హెయిలింగ్ యాప్‌లను ఏకకాలంలో స్విచ్ ఆఫ్ చేయాలని భావిస్తున్నారు.

తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) తో పాటు ఇతర జాతీయ కార్మిక సంఘాలు ఈ సమ్మెను నిర్వహించాయి. శనివారం నాటి నిరసనను ప్రకటిస్తూ టీజీపీడబ్ల్యూయూ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది.
"భారతదేశవ్యాప్తంగా యాప్ ఆధారిత రవాణా కార్మికులు ఫిబ్రవరి 7, 2026న ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్ పాటిస్తారు. కనీస ఛార్జీలు లేవు. నియంత్రణ లేదు. అంతులేని దోపిడీ సాగుతోంది," అని పేర్కొంది.
ఓలా, ఉబెర్ డ్రైవర్లు ఎందుకు సమ్మెకు పిలుపునిచ్చారు?
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి పంపిన లేఖలో, యాప్ ఆధారిత రవాణా కార్మికులు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న "చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న, పరిష్కరించని సమస్యలను" యూనియన్ హైలైట్ చేసింది. ఓలా, ఉబెర్, రాపిడో, పోర్టర్, ఆటోలు, క్యాబ్‌లు, బైక్ టాక్సీలను నడుపుతున్న ఇతర అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం పనిచేసే రైడర్‌లకు ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీల వ్యవస్థ లేనందున, కంపెనీలు తమకు నచ్చినట్లు ఛార్జీలను వసూలు చేస్తున్నాయని యూనియన్ ఆరోపించింది.
దీనివల్ల లక్షలాది మంది రవాణా కార్మికులకు తీవ్రమైన ఆదాయ అభద్రత, దోపిడీ, అస్థిరమైన పని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అగ్రిగేటర్ కంపెనీలు లాభాలను ఆర్జిస్తూనే ఉంటే, లక్షలాది మంది యాప్ ఆధారిత డ్రైవర్లు పేదరికంలోకి కూరుకుపోతున్నారని, ప్రభుత్వం "వెంటనే స్పందించాలని" యూనియన్ కోరింది.
డ్రైవర్ల డిమాండ్ల జాబితా..
డ్రైవర్లు ప్రభుత్వం ముందు తమ డిమాండ్ల జాబితాను ఉంచారు. కేంద్ర మంత్రికి పంపిన లేఖలో, మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025 గురించి ప్రస్తావిస్తూ.. వాటిల్లో నియంత్రణ పర్యవేక్షణ, స్పష్టమైన ఛార్జీల వ్యవస్థ, డ్రైవర్ల జీవనోపాధికి రక్షణ కల్పించాలని కోరారు.
యూనియన్ ఈ కింది డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది:
ఆటోలు, క్యాబ్‌లు, బైక్ టాక్సీలు, ఇతర అగ్రిగేటర్ ఆధారిత సేవలతో పాటు యాప్ ఆధారిత రవాణా సేవల కోసం కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే 'కనీస బేస్ ఛార్జీలను' నోటిఫై చేయాలి. మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025 ప్రకారం, గుర్తింపు పొందిన డ్రైవర్, కార్మిక సంఘాలతో సంప్రదించిన తర్వాత ఈ ఛార్జీలను ఖరారు చేయాలి.
వాణిజ్య ప్రయాణికుల, వస్తువుల రవాణా కోసం ప్రైవేట్, నాన్-కమర్షియల్ వాహనాల వాడకాన్ని కఠినంగా నిషేధించాలి. లేదా అటువంటి వాహనాలను మోటారు వాహనాల చట్టం, అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025 మరియు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా తప్పనిసరిగా వాణిజ్య వర్గంలోకి మార్చాలి.
ఈ రోజు సమ్మెతో ప్రజల పరిస్థితేంటి?
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డ్రైవర్లు ఈ సమ్మెను పాటిస్తున్నందున ప్రయాణ ఇబ్బందులు ఎదురవ్వొచ్చు! అంతరాయం తీవ్రత ఆయా ప్రాంతాలను బట్టి మారుతూ ఉండొచ్చు. యాప్ ఆధారిత క్యాబ్‌లు, ఆటోలు, బైక్ టాక్సీలపై ఆధారపడే ప్రయాణికులు ఫిబ్రవరి 7న, ముఖ్యంగా ఉదయం- సాయంత్రం వేళల్లో ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలను చూసుకోవడం ఉత్తమం.

E-Paper












