మళ్ళీ ఒక్కటైన థాకరే సోదరులు.. శివసేన (UBT), MNS పొత్తు ఖరారు

ముంబై మున్సిపల్ ఎన్నికల (BMC) నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. 20 ఏళ్ల విభేదాలను పక్కనపెట్టి ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరేలు చేతులు కలిపారు. జనవరి 15న జరగనున్న ఎన్నికల్లో వీరిద్దరూ కలిసి పోటీ చేయనున్నారు.

Published on: Dec 24, 2025, 14:29:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. గత రెండు దశాబ్దాలుగా ఉప్పు-నిప్పులా ఉన్న థాకరే సోదరులు, ముంబై మున్సిపల్ ఎన్నికల సాక్షిగా మళ్ళీ ఒక్కటయ్యారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (UBT), రాజ్ థాకరేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించాయి.

శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాకరే (Photo by Raju Shinde/HT)
శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాకరే (Photo by Raju Shinde/HT)

చారిత్రాత్మక నిర్ణయం: 'మరాఠీ అస్తిత్వం' కోసం ఏకం

ముంబైలో బుధవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఇద్దరు నేతలు వేదికను పంచుకున్నారు. "మహారాష్ట్ర ప్రజలు ఈ రోజు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. శివసేన, MNS లు ఇకపై కలిసి పనిచేస్తాయని నేను ప్రకటిస్తున్నాను" అని రాజ్ థాకరే మరాఠీలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మహారాష్ట్ర ప్రయోజనాలే తనకు అత్యంత ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. ముంబై మేయర్ పీఠంపై కచ్చితంగా ఒక మరాఠీ వ్యక్తిని, అది కూడా తమ రెండు పార్టీలలో ఒకరిని కూర్చోబెడతామని ఆయన శపథం చేశారు.

అనంతరం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ.. "మరాఠీ ప్రజలు సాధారణంగా ఎవరినీ ఇబ్బంది పెట్టరు, కానీ ఎవరైనా తమ దారికి అడ్డువస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు" అంటూ ప్రత్యర్థులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.

ఎన్నికల బరిలో ఉమ్మడి పోరు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)తో పాటు థానే, కళ్యాణ్-డోంబివిలి, నాసిక్ వంటి కీలక నగరాల మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ పొత్తు కొనసాగనుంది. జనవరి 15న పోలింగ్ జరగనుండగా, జనవరి 16న ఫలితాలు వెలువడనున్నాయి. సీట్ల పంపకాలపై ఇంకా పూర్తి స్పష్టత రానప్పటికీ, ముంబైలో శివసేన (UBT) సుమారు 145-150 స్థానాల్లో, MNS 65-70 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

విభేదాల నుంచి పొత్తు దాకా..

2006లో శివసేన నుంచి బయటకు వచ్చి MNS స్థాపించిన రాజ్ థాకరే, అప్పటి నుండి ఉద్ధవ్‌కు రాజకీయ ప్రత్యర్థిగా ఉండేవారు. అయితే, జూలైలో హిందీ భాషా రుద్దుడుకు వ్యతిరేకంగా జరిగిన ఒక కార్యక్రమంలో వీరిద్దరూ తొలిసారి వేదిక పంచుకున్నారు. అప్పుడే ఈ పొత్తుకు బీజం పడింది. తాజాగా ముంబైపై పట్టు సాధించే లక్ష్యంతో ఈ ఇద్దరు నేతలు 'బ్రాండ్ థాకరే'ని మళ్ళీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

మరోవైపు, ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. NCP (శరద్ పవార్) వర్గంతో థాకరే సోదరులు చర్చలు జరుపుతున్నారు. ఈ కొత్త కూటమి రాబోయే ఎన్నికల్లో అధికార మహాయుతి (BJP-ఏకనాథ్ షిండే-అజిత్ పవార్) కూటమికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More