ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రికార్డు లాభాలు.. క్యూ1లో ₹317 కోట్లు

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. నికర లాభం ఏకంగా 200 శాతానికి పైగా పెరిగి రూ. 317 కోట్లకు చేరడంతో పాటు, నికర వడ్డీ ఆదాయం ఆల్-టైమ్ గరిష్ట స్థాయిని తాకింది.

Published on: Jul 23, 2026, 14:38:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1) ఫలితాల్లో దుమ్మురేపింది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి గురువారం నాడు బలమైన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. బ్యాంక్ నికర లాభం (PAT) గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 206.7 శాతం భారీ వృద్ధితో రూ. 317 కోట్లకు చేరింది.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రికార్డు లాభాలు.. క్యూ1లో  ₹317 కోట్లు
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రికార్డు లాభాలు.. క్యూ1లో ₹317 కోట్లు

ఈ ఆకట్టుకునే ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభంలో దాదాపు 4 శాతం వరకు నష్టపోయిన ఉజ్జీవన్ బ్యాంక్ షేరు ధర, ఆర్థిక ఫలితాల ప్రకటన వెలువడగానే వేగంగా కోలుకుంది. 1.63 శాతం లాభపడి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో రూ. 66.10 వద్దకు చేరింది.

ఆల్-టైమ్ హై వడ్డీ ఆదాయం, మెరుగైన నిష్పత్తులు

ఈ త్రైమాసికంలో బ్యాంక్ తన చరిత్రలోనే అత్యధిక నికర వడ్డీ ఆదాయాన్ని (NII) నమోదు చేసింది. గతేడాయితో పోలిస్తే NII 38.6 శాతం పెరిగి రూ. 1,186 కోట్లకు చేరింది. బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ (NIM) 8.5 శాతంగా నమోదై, ప్రైమరీ లెండింగ్ బిజినెస్‌లో బలాన్ని చాటుకుంది.

మరోవైపు బ్యాంకు నిర్వహణ సామర్థ్యం కూడా గణనీయంగా మెరుగైంది. వ్యయాల నిష్పత్తి (Cost-to-income ratio) గతేడాది ఉన్న 67.0 శాతం నుంచి 62.0 శాతానికి తగ్గి, 497 బేసిస్ పాయింట్ల పురోగతిని నమోదు చేసింది. ఇక ప్రొవిజన్లకు ముందు వచ్చే నిర్వహణ లాభం (PPOP) 52.0 శాతం పెరిగి రూ. 548 కోట్ల రికార్డు స్థాయికి చేరింది. బ్యాంకు ఆస్తులపై రాబడి (RoA) 2.2 శాతానికి పెరగ్గా, ఈక్విటీపై రాబడి (RoE) 18.2 శాతంగా నమోదైంది.

డిపాజిట్లు, రుణ వితరణలో జోరు

ఈ జూన్ త్రైమాసికంలో బ్యాంక్ వ్యాపార పరిమాణం గణనీయంగా విస్తరించింది. మొత్తం డిపాజిట్లు 24.6 శాతం పెరిగి రూ. 48,129 కోట్లకు చేరాయి. తక్కువ వ్యయంతో కూడిన కాసా (CASA) డిపాజిట్లు 37.8 శాతం వృద్ధితో రూ. 12,930 కోట్లను తాకాయి. దీంతో మొత్తం డిపాజిట్లలో కాసా వాటా 26.9 శాతానికి చేరింది.

బ్యాంక్ మొత్తం రుణ పుస్తకం (Gross loan book) 28.9 శాతం పెరిగి రూ. 42,903 కోట్లకు చేరింది. ముఖ్యంగా సురక్షిత రుణాలు (Secured loans) గతేడాదితో పోలిస్తే 42.7 శాతం వృద్ధితో రూ. 21,638 కోట్లను తాకాయి. మొత్తం అడ్వాన్సులలో సురక్షిత రుణాల వాటా 50.4 శాతానికి చేరడం గమనార్హం.

తగ్గిన మొండి బాకీలు.. ఆస్తి నాణ్యత భేష్

అప్పుల వసూళ్ల విషయంలో బ్యాంక్ క్రమశిక్షణ పాటించడంతో ఆస్తి నాణ్యత (Asset Quality) మెరుగైంది. స్థూల నిరర్థక ఆస్తులు (GNPA) మార్చి 2026 నాటి 2.27 శాతం నుంచి జూన్ నాటికి 2.17 శాతానికి తగ్గాయి. అదే సమయంలో నికర నిరర్థక ఆస్తులు (NNPA) 0.43 శాతం నుంచి 0.34 శాతానికి పరిమితమయ్యాయి.

"ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పటికీ, దేశీయ ఆర్థిక సూచీలు స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఆర్‌బీఐ తన రెపో రేటును 5.25 శాతంగా కొనసాగిస్తూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (FY27) జీడీపీ వృద్ధిని 6.6 శాతంగా అంచనా వేసింది. ద్రవ్యోల్బణం 5.1 శాతం వద్ద నియంత్రణలోనే ఉంది. క్రెడిట్ డిమాండ్, డిపాజిట్లు స్థిరంగా ఉండటంతో బ్యాంకింగ్ రంగం బలంగా ఉంది" అని ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరోల్ ఫుర్టాడో పేర్కొన్నారు.

అన్ని విభాగాలోనూ సాధిస్తున్న పురోగతి ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరానికి (FY27) నిర్దేశించుకున్న 25 శాతం రుణ వృద్ధి లక్ష్యాన్ని సులువుగా చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంక్ విస్తరణ, సాంకేతికత పెంపుపై పెట్టుబడులు కొనసాగుతాయని, క్రెడిట్ కాస్ట్ 0.9% నుంచి 1.0% మధ్యలో ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే, పూర్తి ఏడాదికి గానూ RoA అంచనాను 1.8% – 2.0% కి పెంచుతున్నట్లు బ్యాంక్ యాజమాన్యం వెల్లడించింది.

(గమనిక: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే. ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.)

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More