UK scholarships for Indians : యూకేలో చదువుకోవాలనుకుంటున్న భారతీయులకు రూ. 12లక్షల స్కాలర్‌షిప్..
Scholarship For Indian Students : బ్రిటన్‌లో చదువుకు ప్లాన్ చేస్తున్న భారతీయ విద్యార్థుల కోసం బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ 'ఇండియా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఛాన్సలర్ స్కాలర్‌షిప్' ప్రకటించింది. ఎంపికైన వారికి సుమారు రూ. 12.20 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. ఆసక్తి గల వారు మే 31, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
భారతీయ విద్యార్థుల కోసం అద్భుతమైన వార్తను అందించింది బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం. అక్కడ మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే విద్యార్థుల కోసం 'ఇండియా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఛాన్సలర్ స్కాలర్‌షిప్'ను ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించింది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ స్కాలర్‌షిప్ భారీ స్థాయిలో ఆర్థిక వెసులుబాటును కల్పిస్తుంది.

ఈ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి మే 31, 2026 ఆఖరి తేదీగా నిర్ణయించారు.
ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు మొత్తం 10,000 పౌండ్ల (దాదాపు రూ. 12,20,751) ఆర్థిక సాయం అందుతుంది. బర్మింగ్‌హామ్‌లోని చారిత్రాత్మక ఎడ్జ్‌బాస్టన్ క్యాంపస్‌లో పూర్తి కాలపు పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు, వారి మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజులో ఈ మొత్తాన్ని తగ్గిస్తారు.
ఫలితంగా విద్యార్థులకు ఆర్థికంగా భారం తగ్గినట్టు అవుతుంది.
బర్మింగ్హమ్ యూనివర్సిటీ స్కాలర్‌షిప్- ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఈ స్కాలర్‌షిప్ పొందాలనుకునే అభ్యర్థులు ఈ కింది షరతులను పూర్తి చేయాల్సి ఉంటుంది:
అడ్మిషన్ ఆఫర్: సెప్టెంబర్ 2026లో ప్రారంభమయ్యే పూర్తి కాలపు మాస్టర్స్ ప్రోగ్రామ్ కోసం సదరు విద్యార్థి యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ ఆఫర్ పొంది ఉండాలి.
ప్రాధాన్యత: అభ్యర్థి తన అడ్మిషన్ ప్రక్రియలో బర్మింగ్‌హామ్ యూనివర్సిటీని 'ఫర్మ్ ఛాయిస్' (తప్పనిసరి ఎంపిక)గా ఎంచుకోవాలి, అడ్మిషన్ ఆఫర్‌లో ఉన్న అన్ని నిబంధనలను పూర్తి చేయాలి.
జాతీయత: దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశానికి చెందిన వారై ఉండాలి. ఓవర్సీస్ ఫీజు చెల్లించే విద్యార్థిగా ఉండాలి.
డిపాజిట్ చెల్లింపు: యూనివర్సిటీ అడ్మిషన్ల కార్యాలయం నిర్దేశించిన 3,000 పౌండ్ల (సుమారు రూ. 3,66,343) డిపాజిట్ మొత్తాన్ని అభ్యర్థి ముందుగానే చెల్లించి ఉండాలి.
ఆర్థిక సామర్థ్యం: స్కాలర్‌షిప్ ద్వారా లభించే రాయితీ కాకుండా, మిగిలిన ట్యూషన్ ఫీజుతో పాటు నివాస ఖర్చులు, వీసా ఖర్చులు, ప్రయాణ ఖర్చులను భరించగలమని నిరూపించుకోవాలి.
ఎంపికైన విద్యార్థులు సెప్టెంబర్‌లో చదువుల కోసం బ్రిటన్ చేరుకున్న తర్వాత, నవంబర్ 1, 2026 లోపు తమ కోర్సులో ఎన్‌రోల్ అవ్వడంతో పాటు మిగిలిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్‌ను తదుపరి సంవత్సరాలకు వాయిదా వేయడం సాధ్యపడదు. కాబట్టి ప్రణాళిక ప్రకారం నిర్ణీత సమయంలోనే కోర్సులో చేరాల్సి ఉంటుంది.
ఇండియా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఛాన్సలర్ స్కాలర్‌షిప్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బర్మింగ్హమ్ యూనివర్సిటీ స్కాలర్‌షిప్- ఎంపిక ప్రక్రియ, విధివిధానాలు..
భారతీయుల కోసం ఇస్తున్న ఈ బర్మింగ్హమ్ స్కాలర్‌షిప్ కేటాయింపు పూర్తిగా అకడమిక్ మెరిట్ (ప్రతిభ) ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థుల గత విద్యా రికార్డులు, వారు సమర్పించే 'స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్' (ఎస్ఓపీ) నాణ్యతను సెలక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఒకవేళ అకడమిక్ మెరిట్‌లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు సమానంగా ఉంటే, యూనివర్సిటీ వారికి ఆన్‌లైన్ ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంది.
ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆగస్టు 14, 2026 నాటికి ప్రకటిస్తారు. ఈ స్కాలర్‌షిప్ నగదు రూపంలో చేతికి ఇవ్వరు. నేరుగా విద్యార్థి చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజు నుంచి తగ్గిస్తారని గుర్తుపెట్టుకోవాలి.
ఆర్థిక భారంతో సతమతమయ్యే భారతీయ పీజీ విద్యార్థులకు, బ్రిటన్‌లో నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు ఈ స్కాలర్‌షిప్ ఒక గొప్ప అవకాశమని నిపుణులు పేర్కొంటున్నారు.
పూర్తి వివరాల కోసం సదరు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


