UP murder case : నిద్రపోతున్న భర్తపైకి విష సర్పం వదిలి చంపేసిన భార్య.. ప్రియుడితో కలిసి స్కెచ్!

Meerut Snake Bite Murder case : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక షాకింగ్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. రూ. 20 లక్షల బీమా డబ్బులతోపాటు తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను పాముతో కరిపించి దారుణంగా హత్య చేసింది!

Published on: Jul 19, 2026, 05:46:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు, క్షణిక సుఖాలు, డబ్బుపై వ్యామోహం మనుషులను మృగాలుగా మారుస్తున్నాయి! కట్టుకున్న భర్త ప్రాణాలను తీసేందుకు కూడా భార్యలు వెనుకాడటం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఇలాంటి ఘోర ఘటనే జరిగింది. తన వివాహేతర బంధాన్ని కొనసాగించడంతో పాటు భర్త పేరిట ఉన్న రూ. 20 లక్షల ఇన్సూరెన్స్ డబ్బును క్లెయిమ్ చేయడం కోసం ఓ భార్య తన ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. భర్త మరణాన్ని సహజమైన పాము కాటుగా చిత్రీకరించేందుకు పక్కా ప్లాన్ వేసి, నిద్రపోతున్న అతడిపైకి విష సర్పాన్ని వదిలి హతమార్చింది. కానీ ఈ కేసును ఛేదించిన పోలీసులు సదరు మహిళను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.

యూపీలో దారుణం! భర్తను చంపిన భార్య..
యూపీలో దారుణం! భర్తను చంపిన భార్య..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హస్తినాపూర్‌కు చెందిన అతుల్ పన్వార్, దామిని అనే దంపతులకు 2019లో వివాహమైంది. వీరిద్దరూ కలిసి స్థానికంగా 'కృష్ణ కిడ్స్ ప్లే స్కూల్' అనే పాఠశాలను నడుపుతున్నారు. అయితే, కొంతకాలంగా భర్తకు తెలియకుండా దామిని అదే స్కూల్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న తుషార్ అలియాస్ నిక్కీతో వివాహేతర సంబంధం పెట్టుకుంది!

కాగా ఇటీవలే అతుల్ పన్వార్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో శవమై కనిపించాడు. అప్పటి నుంచి ఈ కేసుపై మిస్టరీ నెలకొంది.

పక్కా స్కెచ్‌తో హతమార్చారు!

మీరట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం.. దామిని తన భర్తను వదిలించుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మొదట అతుల్‌ను రోడ్డు ప్రమాదంలో చంపేందుకు దామిని, తుషార్ ప్లాన్ చేశారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. దానితో ఈసారి ఎలాగైనా పోలీసులకు దొరకకుండా క్రూరమైన ప్లాన్ వేశారు. ఇందుకోసం తుషార్ మరో ఇద్దరి సహాయం కూడా తీసుకున్నాడు.

గురువారం రాత్రి దామిని తన భర్త అతుల్‌కు ఇచ్చే పాలలో నిద్రమాత్రలు కలిపింది. పాలు తాగిన అతుల్ స్పృహ కోల్పోయి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అతుల్ పూర్తిగా స్పృహలో లేడని నిర్ధారించుకున్న తర్వాత, దామిని కరడుగట్టిన విష సర్పం ఒకదానిని బెడ్‌పైకి వదిలింది. ఆ పాము అతుల్‌ను తీవ్రంగా కరిచింది. శుక్రవారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న అతుల్‌ను హుటాహుటిన సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.

"ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే అతుల్ పన్వార్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు," అని రూరల్ ఎస్పీ అభిజిత్ కుమార్ తెలిపారు.

గుట్టు రట్టు చేసిన పోలీసులు..

ప్రారంభంలో ఇది సాధారణ పాము కాటు మరణంలాగే కనిపించినప్పటికీ, అతుల్ కుటుంబ సభ్యుల అనుమానాలతో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.

కాల్ డేటా రికార్డులను, మొబైల్ ఫోన్ లొకేషన్లను నిశితంగా పరిశీలించిన ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు దామిని, తుషార్ల మధ్య ఉన్న సంబంధంపై పక్కా ఆధారాలు దొరికాయి. దానితో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నారు.

నిందితుడు తుషార్‌కు కూడా ఇదివరకే పెళ్లయిందని, ఈ హత్య ప్లాన్​కి ముందే అతడు తన భార్యకు విడాకులు ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

అసలు మోటివ్ ఏంటి?

పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ హత్య వెనుక రెండు బలమైన కారణాలు ఉన్నట్లు తేలింది. మొదటిది, అతుల్ పేరు మీద ఉన్న రూ. 20 లక్షల భారీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సొమ్మును సొంతం చేసుకోవడం. రెండోది, అతుల్ అడ్డు తొలగించుకుని దామిని, తుషార్ తమ బంధాన్ని స్వేచ్ఛగా కొనసాగించడం. పాము కాటు వల్ల చనిపోతే ఎవరికీ ఎలాంటి అనుమానం రాదని, ప్రకృతి సిద్ధంగా జరిగిన ప్రమాదంగా నమ్ముతారని నిందితులు భావించారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More