...
...
Next Story

US Fed Rates : వడ్డీ రేట్ల పెంపునకు యూఎస్​ ఫెడ్​ సంకేతాలు! భారత స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి?

Federal reserve interest rates : అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా 3.50%-3.75% శ్రేణిలోనే ఉంచింది. అయితే ద్రవ్యోల్బణం పెరిగితే ఈ ఏడాది వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు.. భారత స్టాక్ మార్కెట్లను, రూపాయిని మరింత ఒత్తిడిలోకి నెట్టేలా ఉన్నాయి.

Published on: Jun 18, 2026, 05:59:18 IST
Advertisement

ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్.. తన కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. యూఎస్ ఫెడ్ తన ఫెడరల్ ఫండ్స్ రేట్లను 3.50%-3.75% శ్రేణిలోనే, యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వృద్ధిని కాపాడుకుంటూనే, మరోవైపు ద్రవ్యోల్బణాన్నిఅదుపులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఫెడ్ పాలసీ మేకర్లు ఈ నిర్ణయానికి వచ్చారు. వరుసగా నాలుగో సమీక్షా సమావేశంలోనూ ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయకపోవడం గమనార్హం.

అమెరికా ఫెడ్​ సంకేతాలు- మన స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి?
అమెరికా ఫెడ్​ సంకేతాలు- మన స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి?

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీనివల్ల ఏర్పడిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అదుపు చేయడానికి అమెరికా కేంద్ర బ్యాంక్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫెడ్ నిర్ణయం మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉంది.

అయితే ఇదే సమయంలో ఫెడ్ అధికారులు విడుదల చేసిన తాజా 'సమ్మరీ ఆఫ్ ఎకనామిక్ ప్రొజెక్షన్స్' (ఎస్​ఈపీ) నివేదిక మార్కెట్లను కాస్త కలవరపెడుతోంది! ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో ధరల ఒత్తిడి మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది చివరి నాటికి పీసీఈ ద్రవ్యోల్బణం అంచనాను గతంలో అనుకున్న 2.7% నుంచి ఏకంగా 3.6%కి పెంచారు!

అలాగే ఆహార, ఇంధన ధరలను మినహాయించి లెక్కించే కోర్ పీసీఈ ద్రవ్యోల్బణం కూడా గతంలో అంచనా వేసిన 2.7% నుంచి 3.3%కి పెరగవచ్చని ఫెడ్ పేర్కొంది. ఇరాన్ ముడిపడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇంధన ఖర్చులు పెరగడం, అమెరికాలో నిత్యావసరాల ధరలు ఇంకా గరిష్ట స్థాయిల్లోనే కొనసాగుతుండటం దీనికి ప్రధాన కారణం. ఇది ఫెడ్ నిర్దేశించుకున్న దీర్ఘకాలిక లక్ష్యం 2% కంటే చాలా ఎక్కువగా ఉంది.

ప్రస్తుతానికి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, ద్రవ్యోల్బణాన్ని 2% లక్ష్యానికి తీసుకురావడానికి ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్ల పెంపు తప్పకపోవచ్చని పలువురు ఫెడ్ పాలసీ మేకర్లు స్పష్టం చేశారు. కేవలం వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం వల్ల మాత్రమే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పూర్తిగా అణచివేయలేమని వారు భావిస్తున్నారు.

ఒకవేళ మున్ముందు యూఎస్ ఫెడ్ గనుక వడ్డీ రేట్లను పెంచితే, అది భారత స్టాక్ మార్కెట్‌కు పెద్ద ప్రతికూల అంశంగా మారుతుంది. ఇది విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్​పీఐ) సెంటిమెంట్‌ను దెబ్బతీయడమే కాకుండా, భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున వెనక్కి తరలిపోవడానికి కారణమవుతుంది.

వడ్డీ రేట్ల అంచనాలను సమర్పించిన 18 మంది ఫెడ్ అధికారుల్లో తొమ్మిది మంది.. ఈ ఏడాది వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు! ఇరాన్ వివాదం తర్వాత ముడిచమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం మరింత కాలం గరిష్ట స్థాయిలోనే కొనసాగుతుందనే ఆందోళనను వీరు వ్యక్తం చేశారు. ఆ తొమ్మిది మందిలో ఆరుగురు అధికారులు (కమిటీలో దాదాపు మూడో వంతు) ఈ ఏడాది ఒకటి కంటే ఎక్కువసార్లు పావు శాతం వడ్డీ రేట్ల పెంపు అవసరం కావచ్చని అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో, ఎనిమిది మంది అధికారులు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని అంచనా వేయగా, కేవలం ఒక్కరు మాత్రమే ఒక విడత రేట్ల కోతను సమర్థించారు. ఇక ఒక అధికారి వడ్డీ రేట్ల మార్గానికి సంబంధించిన ఎలాంటి అంచనాను సమర్పించలేదని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. కేంద్ర బ్యాంక్ ఇచ్చే ముందస్తు గైడెన్స్‌ను తగ్గించాలని భావిస్తున్న ఫెడ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్, తన సొంత వడ్డీ రేట్ల అంచనాలను వెల్లడించకుండా దాచిపెట్టారు.

రూపాయిపై ఒత్తిడి.. వెనకబడ్డ నిఫ్టీ!

అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే అక్కడ బాండ్లపై వచ్చే ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ డబ్బును భారత్ వంటి దేశాల నుంచి ఉపసంహరించుకుని, సురక్షితమైన అమెరికన్ అసెట్లలో పెట్టడానికి మొగ్గు చూపుతారు. ఇప్పటికే భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వందల కోట్ల డాలర్లను వెనక్కి తీసుకున్నారు. ఇలాంటి తరుణంలో ఫెడ్ గనుక కఠిన ద్రవ్య విధానాన్ని అవలంబిస్తే విదేశీ పెట్టుబడుల అమ్మకాల వేగం మరింత పెరుగుతుంది.

భారతీయ కంపెనీల వాల్యుయేషన్లు ఎక్కువగా ఉండటం, బలహీనమైన ఆదాయ అంచనాలు, గ్లోబల్ మార్కెట్లను ఊపేస్తున్న ఏఐ ఆధారిత పెట్టుబడుల థీమ్‌లో భారత్‌కు పెద్దగా వాటా లేకపోవడం వంటి అంశాలు ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. విదేశీ నిధులు గనుక వేగంగా వెనక్కి వెళ్తే, అది భారత రూపాయిపై అదనపు ఒత్తిడిని తెస్తుంది. మన రూపాయి విలువ ఇప్పటికే 2026లో యూఎస్ డాలర్‌తో పోలిస్తే చారిత్రాత్మక కనిష్ట స్థాయిలను తాకింది.

ఇప్పటికే.. విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరాయంగా షేర్లను విక్రయిస్తుండటంతో, మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) పరంగా ప్రపంచ దేశాల జాబితాలో భారత స్టాక్ మార్కెట్ ఏడో స్థానానికి పడిపోయింది. ఈ క్రమంలో దక్షిణ కొరియా మనల్ని దాటి ముందుకు వెళ్లింది. 2026లో ఇప్పటివరకు నిఫ్టీ దాదాపు 8% విలువను కోల్పోయింది. దీనివల్ల ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచిన మార్కెట్లలో ఒకటిగా భారత్ నిలిచింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe