అమెరికా సెంట్రల్ బ్యాంక్ 'ఫెడరల్ రిజర్వ్' గ్లోబల్ మార్కెట్లకు షాక్ ఇచ్చింది! పెరిగిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుతో ఫెడరల్ ఫండ్స్ రేటు 3.75 శాతం నుంచి 4 శాతానికి చేరింది. మూడేళ్లకు పైగా వ్యవధి తర్వాత ఫెడ్ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. ప్రతీకూల పరిస్థితులు కొనసాగితే ఈ ఏడాది చివర్లో మరొక విడత రేట్ల పెంపు తప్పకపోవచ్చని విధానకర్తలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ భయాలు, స్థిరమైన ఉపాధి మార్కెట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. "ద్రవ్యోల్బణం వేగంగా తగ్గకపోవడం కలవరపెడుతోంది," అని ఫెడ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. టారిఫ్‌ల ఒత్తిడి, ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు ధరలు పెరగడం ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతోంది.
మరోవైపు ఫెడ్ చర్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. "అమెరికాలో రుణ వ్యయాలు ప్రపంచంలోనే అతి తక్కువగా ఉండాలి," అని ట్రంప్ డిమాండ్ చేశారు. వడ్డీ రేట్లను తగ్గించకపోతే వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేస్తానని బెదిరించినప్పటికీ, ఫెడరల్ రిజర్వ్ మాత్రం ద్రవ్యోల్బణ కట్టడికే ప్రాధాన్యం ఇచ్చింది.
రూపాయిపై డాలర్ దెబ్బ..!
అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే దాని ప్రత్యక్ష ప్రభావం భారత రూపాయిపై పడుతుంది. డాలర్ సూచీ బలపడటంతో రూపాయి విలువ తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది.
2026 ప్రారంభం నుంచి రూపాయి విలువ నిరంతరం పడిపోతూ సరికొత్త చారిత్రాత్మక కనిష్ట స్థాయిలను తాకుతున్న విషయం తెలిసిందే.
డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణించడం వల్ల మన దిగుమతుల వ్యయం భారీగా పెరుగుతుంది. భారత్ తన ముడిచమురు అవసరాల్లో 80 శాతానికి పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. డాలర్ రేటు పెరిగితే చమురు దిగుమతుల బిల్లు పెరిగి, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతాయి. ఇది కరెంట్ అకౌంట్ లోటును పెంచడంతో పాటు నిత్యావసరాల ధరలకు రెక్కలు ఇస్తుంది.
ఆర్బీఐ దారి ఎటు? పెరగనున్న ఈఎంఐ భారం?
అమెరికా ఫెడ్ నిర్ణయం భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానంపై తీవ్ర ప్రభావం చూపనుంది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడం, విదేశీ నిధుల తరలింపును నియంత్రించడం ఆర్బీఐకి సవాలుగా మారింది. దేశీయంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతుండటంతో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచాల్సి రావచ్చు.
{{/usCountry}}అమెరికా ఫెడ్ నిర్ణయం భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానంపై తీవ్ర ప్రభావం చూపనుంది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడం, విదేశీ నిధుల తరలింపును నియంత్రించడం ఆర్బీఐకి సవాలుగా మారింది. దేశీయంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతుండటంతో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచాల్సి రావచ్చు.
{{/usCountry}}ఒకవేళ ఆర్బీఐ రెపో రేటును పెంచితే, వాణిజ్య బ్యాంకులు డిపాజిట్లు, రుణాలపై ఇచ్చే వడ్డీ రేట్లను పెంచుతాయి. "ఫెడ్ నిర్ణయాల ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై పడుతున్నందున ఆర్బీఐ జాగ్రత్తగా అడుగులు వేయక తప్పదు," అని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ఆర్బీఐ రేట్లు పెంచితే గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐలు పెరిగి సామాన్యులపై తీవ్ర భారం పడుతుంది.
ఇప్పటికే అంచనా వేసిన మార్కెట్!
అమెరికా సెంట్రల్ బ్యాంక్ 'ఫెడరల్ రిజర్వ్' కీలక వడ్డీ రేట్లను పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంచడం భారత స్టాక్ మార్కెట్‌కు ప్రతికూల అంశమే! అయినప్పటికీ, రాత్రికి రాత్రే మార్కెట్లు భారీగా కుప్పకూలే అవకాశాలు తక్కువని విపణి విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలో పీసీఈ ద్రవ్యోల్బణం గత 65 నెలలుగా నిరంతరం 2 శాతం లక్ష్యం కంటే పైనే కొనసాగుతోంది. దీనికి తోడు ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వల్ల ముడిచమురు ధరలు మండుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లు ఈ వడ్డీ రేట్ల పెంపును ముందే ఊహించి, తమ గణాంకాలకు సర్దుబాటు చేసుకున్నాయి.
"పావు శాతం రేట్ల పెంపును విపణి ఇప్పటికే జీర్ణించుకుంది. కాబట్టి మార్కెట్లో తక్షణమే తీవ్ర ప్రతికూల స్పందన ఉండకపోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఫెడ్ తీసుకుంటున్న కఠిన చర్యలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచే అవకాశం ఉంది," అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ విశ్లేషించారు.
డాలర్ బలం.. విదేశీ నిధుల తరలింపు భయాలు
విటి మార్కెట్స్ గ్లోబల్ స్ట్రాటజీ లీడ్ రాస్ మాక్స్‌వెల్ ప్రకారం, యూఎస్ వడ్డీ రేట్లు పెరగడం వల్ల స్వల్పకాలంలో భారత ఈక్విటీలపై ఒత్తిడి ఉంటుంది. వడ్డీ రేట్లు పెరిగితే అమెరికా డాలర్ మరింత బలపడుతుంది. ఫలితంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత్ లాంటి వర్ధమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని, సురక్షితమైన యూఎస్ బాండ్ల వైపు మళ్లే ప్రమాదం ఉంది.
ఈ అంశంపై సామ్‌కో సెక్యూరిటీస్ ప్రతినిధి అపూర్వ షేత్ స్పందిస్తూ, "అమెరికా 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్స్ 5 శాతం దాటి, 2007 నాటి గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. ఆగస్టు 2026 నుంచి మన మార్కెట్లు ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో సాగుతున్నాయి. కాబట్టి ఫెడ్ నిర్ణయంతో కొత్తగా ప్రతికూల షాక్‌లు ఇచ్చే పరిణామాలు తక్కువే," అని చెప్పారు.
డాలర్ బలోపేతంతో రూపాయి క్షీణత, బాండ్ ఈల్డ్స్ పెరుగుదల, స్టాక్ మార్కెట్లో అస్థిరత నమోదవుతాయని ఇన్వెస్ట్‌వాల్యూ క్యాపిటల్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ సన్నీ త్రిసాల్ పేర్కొన్నారు. ఫెడ్ తీసుకునే నిర్ణయంతో పాటు భవిష్యత్తు విధానాలపై ఇచ్చే మార్గదర్శకాలే మార్కెట్ దిశను నిర్ణయిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
గురువారం ట్రేడింగ్‌లో సూచీల గమనం ఎటు?
బుధవారం సెషన్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 0.45 శాతం పెరిగి 74,336.45 వద్ద, నిఫ్టీ-50 0.43 శాతం లాభపడి 23,217.60 వద్ద స్థిరపడ్డాయి. గురువారం ట్రేడింగ్‌లో ప్రధాన సూచీల స్థాయిలపై విశ్లేషకుల అంచనాలు ఇవీ:
సెన్సెక్స్ : ఛాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ నిపుణుడు సచిన్ గుప్తా ప్రకారం.. సెన్సెక్స్ ప్రస్తుతం సైడ్‌వేస్ నుంచి బేరిష్ మోడ్‌లో ఉంది. 73,500–74,000 పరిధి కీలక సపోర్ట్ జోన్‌గా నిలుస్తుంది. సెన్సెక్స్ 74,500 పాయింట్ల పైన స్థిరపడితే మళ్లీ కొనుగోళ్ల మద్దతుతో 74,800–75,000 స్థాయిలకు చేరవచ్చు. ఒకవేళ 74,000 స్థాయి కంటే దిగువకు పడిపోతే అమ్మకాల ఒత్తిడి పెరుగుతుంది.
నిఫ్టీ 50 : రేలిగేర్ బ్రోకింగ్ ప్రతినిధి అజిత్ మిశ్రా ప్రకారం.. నిఫ్టీ 23,200 పాయింట్ల స్థాయిని అధిగమించడం ఒకింత ఉపశమనం కలిగించినా, మొత్తంగా మార్కెట్ ట్రెండ్ బలహీనంగానే ఉంది. నిఫ్టీకి 23,400–23,600 వద్ద ఇన్స్టెంట్ రెసిస్టెన్స్ ఎదురవుతుంది. దిగువన 23,000–23,100 పరిధి బలమైన సపోర్ట్‌గా పనిచేస్తుంది. నిఫ్టీ 23,600 దాటితేనే బుల్లిష్ ట్రెండ్ పుంజుకుంటుంది.
బ్యాంక్ నిఫ్టీ : ఎల్‌కేపీ సెక్యూరిటీస్ నిపుణుడు వాత్సల్ భువా ప్రకారం.. బ్యాంక్ నిఫ్టీకి 56,500 వద్ద రెసిస్టెన్స్ ఉంటే, దిగువన 55,500 వద్ద సపోర్ట్ లభిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ తిరిగి పుంజుకోవాలంటే 57,500 మార్కును అధిగమించాల్సి ఉంటుంది.
నిఫ్టీ ఐటీ : డాలర్ ఇండెక్స్ పెరగడం వల్ల గురువారం ఐటీ షేర్లలో కొంత సానుకూలత కనిపించవచ్చు. అయితే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సవాళ్లు, గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్ మందగమనం వల్ల ఐటీ రంగంలో వృద్ధి పరిమితంగానే ఉండే అవకాశం ఉంది.