...
...
Next Story

హైదరాబాద్ వేదికగా భారత్-అమెరికా కీలక ముందడుగు: ఏఐ, సైబర్ సెక్యూరిటీపై ‘ట్రస్ట్’

అమెరికా-భారత్ 'ట్రస్ట్' (TRUST - Transforming the Relationship Utilizing Strategic Technology) ఇనీషియేటివ్ తదుపరి దశకు చేరుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ భద్రత వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారం అందించుకోవడమే లక్ష్యంగా సమావేశం జరిగింది.

Published on: Jan 29, 2026 04:57 PM IST
Advertisement

హైదరాబాద్: సాంకేతిక రంగంలో ప్రపంచదేశాలకు దీటుగా ఎదుగుతున్న భారత్.. అమెరికాతో తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకుంది. గురువారం హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వేదికగా జరిగిన ఒక కీలక సమావేశంలో అమెరికా-భారత్ 'ట్రస్ట్' (TRUST - Transforming the Relationship Utilizing Strategic Technology) ఇనీషియేటివ్ తదుపరి దశకు చేరుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ భద్రత వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారం అందించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.

హైదరాబాద్ వేదికగా భారత్-అమెరికా కీలక ముందడుగు: ఏఐ, సైబర్ సెక్యూరిటీపై ‘ట్రస్ట్’
హైదరాబాద్ వేదికగా భారత్-అమెరికా కీలక ముందడుగు: ఏఐ, సైబర్ సెక్యూరిటీపై ‘ట్రస్ట్’

యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ (శంషాబాద్ & విశాఖపట్నం) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఫిబ్రవరి 2025లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ 'ట్రస్ట్' ఇనీషియేటివ్‌ను ఆచరణలో పెట్టడంలో ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలిచింది.

మాటల నుంచి చేతల వైపు..

కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, ఎనర్జీ, స్పేస్ వంటి రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ మరియు విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంచడంపై చర్చించారు. ముఖ్యంగా సరఫరా గొలుసులను (Supply Chains) బలోపేతం చేయడం, ఇరు దేశాల ఆర్థిక పోటీతత్వాన్ని పెంచడం, జాతీయ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ ఇనీషియేటివ్ సారాంశం.

అమెరికా కాన్సుల్ జనరల్ ఏమన్నారంటే?

ఈ సందర్భంగా యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ మాట్లాడుతూ.. "వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా మా జాతీయ భద్రత, ఆర్థిక ప్రయోజనాలను ఎలా కాపాడుకోవచ్చో చెప్పడానికి 'ట్రస్ట్' ఒక నిదర్శనం. భారత్‌తో కలిసి పనిచేయడం ద్వారా అమెరికా ఆవిష్కరణలను రక్షించే సురక్షితమైన టెక్నాలజీ వ్యవస్థలను మేము నిర్మిస్తున్నాం. గతేడాది సెప్టెంబర్‌లో సెక్రటరీ రూబియో చెప్పినట్లుగా, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాల్లో మా సహకారం కొనసాగుతుంది" అని స్పష్టం చేశారు.

పర్డ్యూ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జేమ్స్ లెరమ్స్ తన కీనోట్ ప్రసంగంలో పరిశోధన, నైపున్యాభివృద్ధిలో విశ్వవిద్యాలయాల పాత్రను వివరించారు. ఈ సదస్సులో నాలుగు ప్రధాన అంశాలపై చర్చ జరిగింది:

విధానం నుంచి ఆచరణకు: ఏఐ వృద్ధికి, డేటా రక్షణకు రెండు దేశాల విధానాలు ఎలా ఉండాలి?

ఏఐ & సైబర్ సెక్యూరిటీ: సైబర్ దాడులను గుర్తించడంలో, తిప్పికొట్టడంలో ఏఐ పాత్ర.

విజయవంతమైన నమూనాలు: పరిశోధన, శిక్షణలో ఇప్పటికే విజయవంతమైన అమెరికా-భారత్ విద్యా భాగస్వామ్యాలు.

భవిష్యత్ కార్యాచరణ: సురక్షితమైన ఏఐ వినియోగం కోసం ఉమ్మడి ప్రమాణాలను (Standards) రూపొందించడం.

హైదరాబాద్.. ఇన్నోవేషన్ హబ్

స్టార్టప్ ఎకోసిస్టమ్, బలమైన విద్యాసంస్థలతో హైదరాబాద్ ఏఐ ఇన్నోవేషన్‌కు కేంద్రంగా మారుతున్న విషయాన్ని ఈ సమావేశం ఎత్తిచూపింది. సున్నితమైన డేటాను రక్షించడం, మేధో సంపత్తి హక్కులను (IP Rights) కాపాడటం వంటి అంశాల్లో కఠినమైన సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలు ఉండాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.

సురక్షితమైన డిజిటల్ భవిష్యత్తు కోసం పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని, అదే 'ట్రస్ట్' ఇనీషియేటివ్ యొక్క నిజమైన బలమని సమావేశం తీర్మానించింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe