...
...
Next Story

Adani US case : అదానీపై ఫ్రాడ్ కేసులు.. శాశ్వతంగా మూసేసిన అమెరికా! ఎందుకంటే..

Adani US case news : భారతీయ కుబేరుడు, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి అమెరికాలో చాలా పెద్ద ఊరట లభించింది. న్యూయార్క్ కోర్టులో ఆయనపై నమోదైన హైప్రొఫైల్ సెక్యూరిటీస్, వైర్ ఫ్రాడ్ క్రిమినల్ కేసులను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ శాశ్వతంగా ఉపసంహరించుకుంది.

Published on: May 19, 2026, 05:23:50 IST
Advertisement

Adani US case updates : అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలను నెలల తరబడి వేధించిన అమెరికా లీగల్ వివాదాలు ఒక్కసారిగా ముగిసిపోయాయి! న్యూయార్క్‌లోని ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టులో వీరిపై నమోదైన అన్ని రకాల క్రిమినల్ కేసులను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) శాశ్వతంగా ఉపసంహరించుకుంది. వారిపై చేసిన ఆరోపణలను రుజువు చేయడానికి తగిన ఆధారాలు లేవని, అలాగే వాటికి అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవని తేలడంతో ప్రాసిక్యూటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అదానీపై కేసులు ఉపసంహరించుకున్న అమెరికా.. (Reuters)
అదానీపై కేసులు ఉపసంహరించుకున్న అమెరికా.. (Reuters)

ఈ మేరకు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, అదానీపై ఉన్న ఇండైట్‌మెంట్ (దోషారోపణ పత్రం) ను 'విత్ ప్రిజుడీస్' అంటే.. భవిష్యత్తులో ఈ కేసును మళ్లీ రీఓపెన్ చేయడానికి వీలు లేని విధంగా పూర్తిగా కొట్టివేయాలని జస్టిస్ డిపార్ట్‌మెంట్ కోరింది.

"డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ కేసును సమగ్రంగా సమీక్షించింది. ఈ క్రిమినల్ ఆరోపణలపై మరిన్ని వనరులను, సమయాన్ని కేటాయించకూడదని తన ప్రాసిక్యూటోరియల్ విచక్షణ అధికారంతో నిర్ణయించుకుంది," అని అధికారులు కోర్టుకు తెలిపారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం కేసును శాశ్వతంగా కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అమెరికా ఆంక్షలు, సివిల్ కేసుల సెటిల్‌మెంట్..

క్రిమినల్ కేసులు కొట్టివేయడానికి ముందే, గత కొన్ని రోజులుగా అదానీ గ్రూప్‌నకు సంబంధించిన మిగిలిన యూఎస్ విచారణలు కూడా సెటిల్‌మెంట్ల ద్వారా ముగిశాయి.

ఎస్​ఈసీ సివిల్ కేసు: భారతదేశంలో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల పెట్టుబడులకు సంబంధించి 'యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్​ఛేంజ్ కమిషన్' (ఎస్​ఈసీ) దాఖలు చేసిన సివిల్ కేసులో.. గౌతమ్ అదానీ 6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 50 కోట్లు), సాగర్ అదానీ 12 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 100 కోట్లు) జరిమానా చెల్లించేందుకు అంగీకరించారు. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం వివాదానికి ముగింపు పలికేందుకే ఈ సెటిల్‌మెంట్‌ చేసుకున్నట్లు వారు స్పష్టం చేశారు.

2024 చివరిలో నమోదైన ఈ కేసు అదానీ గ్రూప్ అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలను తీవ్రంగా దెబ్బతీసింది. భారతదేశంలో సోలార్ కాంట్రాక్టుల కోసం అదానీ గ్రూప్ భారత అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చిందని, ఆ విషయాన్ని అమెరికా ఇన్వెస్టర్ల దాచిపెట్టి నిధులు సేకరించిందని అమెరికా గతంలో ఆరోపించింది.

అయితే, అదానీ తరఫున రంగంలోకి దిగిన సలివన్ అండ్ క్రామ్‌వెల్, నిక్సన్ పీబాడీ వంటి 5 ప్రఖ్యాత అమెరికన్ లీగల్ సంస్థలు యూఎస్ అధికారుల ముందు బలమైన వాదనలు వినిపించాయి. ఈ కేసులో ఉన్న నిందితులు భారతీయులు, కంపెనీ భారతీయ సంస్థ, ఆ బాండ్లు అమెరికా స్టాక్ ఎక్స్​ఛేంజీల్లో ట్రేడ్ అవ్వడం లేదు, పైగా ఈ వ్యవహారమంతా కేవలం భారతదేశంలోనే జరిగింది. కాబట్టి దీనిపై అమెరికా చట్టాలు వర్తించవని లాయర్లు గట్టిగా వాదించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఏ అమెరికా ఇన్వెస్టర్‌కూ నష్టం జరగలేదని, బాండ్ల చెల్లింపులన్నీ సకాలంలో జరిగాయని నిరూపించారు.

దీనితో లంచం ఆరోపణలను సెక్యూరిటీస్ ఫ్రాడ్‌గా మార్చడం కుదరదని అమెరికా న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడటంతో డీఓజే వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ నిర్ణయంతో అదానీ గ్రూప్‌పై ఉన్న అతిపెద్ద అంతర్జాతీయ చట్టపరమైన ముప్పు తొలగిపోయింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks