RSS, RAW మీద పగబట్టిన అమెరికా ప్యానెల్- ఆంక్షలు విధించాలంటూ..
భారత్‌లో మత స్వేచ్ఛ హరించుకుపోతోందంటూ యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) వివాదాస్పద నివేదిక ఇచ్చింది. RSS, RAW పై ఆంక్షలు విధించాలని, భారత్‌కు ఆయుధ విక్రయాలను నిలిపివేయాలని కోరింది.
అంతర్జాతీయ వేదికపై భారత్‌ను అభాసుపాలు చేసేలా అమెరికాకు చెందిన మత స్వేచ్ఛా కమిషన్ (USCIRF) మరోసారి విచక్షణారహితమైన సిఫార్సులు చేసింది. భారత్‌లో మత స్వేచ్ఛ క్షీణించిందని ఆరోపిస్తూ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో పాటు భారత గూఢచారి సంస్థ 'రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్' (ఆర్అండ్ఏడబ్ల్యూ)పై కూడా ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వానికి సూచించింది. భారత్‌ను "ప్రత్యేక ఆందోళన కలిగించే దేశం" (కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్)గా ఈ నివేదిక పేర్కొంది.

ఆయుధ విక్రయాలూ నిలిపివేయాలంటూ..
భారత్‌తో జరిగే వాణిజ్య ఒప్పందాలను, ఆయుధ విక్రయాలను అక్కడి మత స్వేచ్ఛ పరిస్థితులతో ముడిపెట్టాలని వాషింగ్టన్ యంత్రాంగాన్ని ఈ కమిషన్ కోరింది. ముఖ్యంగా 'ఆర్మ్స్ ఎక్స్‌పోర్ట్ కంట్రోల్ యాక్ట్'లోని సెక్షన్ 6ను ప్రయోగించి, భారత్‌కు ఆయుధాల సరఫరాను ఆపాలని సిఫార్సు చేయడం గమనార్హం. మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వం వారిని లక్ష్యంగా చేసుకుంటోందని ఈ నివేదికలో ఆరోపించారు.
వక్ఫ్ సవరణ చట్టంపై విమర్శలు..
ఉత్తరాఖండ్ మైనారిటీ విద్యా చట్టంతో పాటు ఇస్లామిక్ ధార్మిక సంస్థల నియంత్రణ కోసం తెచ్చిన 'వక్ఫ్ (సవరణ) చట్టం' వంటి వాటిని కూడా ఈ నివేదిక తప్పుబట్టింది. మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన మతపరమైన ఘర్షణలకు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) వంటి సంస్థలే కారణమని ఆరోపించింది. బలవంతపు మత మార్పిడి వ్యతిరేక చట్టాలను మరింత కఠినతరం చేయడాన్ని కూడా నివేదికలో విమర్శించారు.
భారత్ ఘాటు స్పందన: "USCIRF కే ఆందోళనకర సంస్థగా గుర్తింపు ఇవ్వాలి"!
ఈ తాజా నివేదికపై విదేశీ వ్యవహారాల శాఖ అధికారికంగా స్పందించాల్సి ఉన్నప్పటికీ, గత ఏడాది కాలంగా ఇటువంటి నివేదికలను భారత్ "రాజకీయ ప్రేరేపితం" అని కొట్టిపారేస్తూనే ఉంది. 2025లో విడుదలైన నివేదికపై స్పందిస్తూ.. "భారత్ 140 కోట్ల మంది జనాభా కలిగిన దేశం. ఇక్కడ అన్ని మతాల వారు సామరస్యంగా జీవిస్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియని USCIRF నివేదికలు పక్షపాతంతో కూడుకున్నవి. నిజానికి ఆ కమిషన్‌నే 'ఆందోళనకర సంస్థ'గా ప్రకటించాలి" అని విదేశీ వ్యవహారాల శాఖ ఎద్దేవా చేసింది.
నేపథ్యం..
1998లో అమెరికా కాంగ్రెస్ చట్టం ద్వారా ఏర్పాటైన USCIRF, విదేశాల్లో మత స్వేచ్ఛను పర్యవేక్షించి అమెరికా అధ్యక్షుడికి, విదేశాంగ మంత్రికి సిఫార్సులు చేస్తుంది. అయితే, ఈ కమిషన్ సభ్యులను అమెరికా రాజకీయ నాయకులే నియమిస్తారు. 2019లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో కూడా ఈ కమిషన్ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందిస్తూ, ఆ కమిషన్ బృందానికి వీసాలు నిరాకరించిన సంగతి తెలిసిందే.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


