...
...
Next Story

రష్యా ఆయిల్‌పై అమెరికా యూటర్న్.. భారత్‌కు భారీ ఊరట

రష్యా నుంచి ముడి చమురు దిగుమతులపై ఆంక్షల సడలింపును పొడిగించబోమని చెప్పిన అమెరికా, అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. భారత్ వంటి దేశాలకు మే 16 వరకు రష్యా చమురును కొనుగోలు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Published on: Apr 18, 2026, 07:48:50 IST
Advertisement

ప్రపంచ చమురు మార్కెట్‌లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల విషయంలో అమెరికా అగ్రరాజ్యం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. రష్యా ఆయిల్‌పై ఉన్న ఆంక్షల మినహాయింపును (Sanctions Waiver) పొడిగించబోమని గతంలో స్పష్టం చేసిన డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు తన మాట మార్చుకుంది. సముద్ర మార్గం ద్వారా వచ్చే రష్యా చమురును మే 16 వరకు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెద్ద ఊరటగా మారింది.

రెండు రోజుల్లోనే మారిన సీన్

చమురు రవాణా (REUTERS)
చమురు రవాణా (REUTERS)

నిజానికి, రష్యా చమురు కొనుగోళ్లపై మినహాయింపు ఇచ్చే ఆలోచన ఏదీ లేదని కేవలం రెండు రోజుల క్రితమే అమెరికా ఖజానా శాఖ (Treasury Department) కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ కుండబద్దలు కొట్టారు.

“రష్యా ముడి చమురుపై గానీ, ఇరాన్ ఆయిల్‌పై గానీ మేము జనరల్ లైసెన్స్‌ను పొడిగించడం లేదు. మార్చి 11 కంటే ముందు నీటిపై (రవాణాలో) ఉన్న చమురుకు మాత్రమే గతంలో అనుమతి ఇచ్చాం. అది ఇప్పటికే పూర్తయింది” అని బెస్సెంట్ ఒక విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

అయితే, ఆయన ప్రకటించిన రెండు రోజులకే అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో కొత్త ఉత్తర్వులు దర్శనమిచ్చాయి. ఏప్రిల్ 11తో ముగిసిన 30 రోజుల గడువును, ఇప్పుడు మే 16 వరకు పొడిగిస్తూ ట్రంప్ సర్కార్ లైసెన్స్‌ను అప్‌డేట్ చేసింది. ఈ మార్పు వెనుక ప్రపంచ చమురు ధరల స్థిరత్వం, ఇతర ఆర్థిక కారణాలు ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

భారత్‌కు కలిగే ప్రయోజనం ఏంటి?

ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి తక్కువ ధరకే ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. అమెరికా ఆంక్షల నుంచి మినహాయింపు లభించడంతో, భారతీయ చమురు కంపెనీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్‌ను సేకరించవచ్చు. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అమెరికా గట్టిగా ఆంక్షలు విధించి ఉంటే, రష్యా నుంచి కొనుగోళ్లు కష్టమయ్యేవి. అది భారత ఆర్థిక వ్యవస్థపై, రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపేది. ఈ తాజా వెసులుబాటుతో భారత్‌కు మరికొంత సమయం దొరికినట్లయింది.

ఇరాన్‌కు మాత్రం నో ఎంట్రీ

ప్ర: రష్యా చమురు కొనుగోలుకు అమెరికా ఎంతవరకు గడువు ఇచ్చింది?

జ: తాజా ఉత్తర్వుల ప్రకారం, సముద్ర మార్గం ద్వారా రవాణా అయ్యే రష్యా చమురును మే 16 వరకు కొనుగోలు చేసేందుకు అమెరికా అనుమతి ఇచ్చింది.

ప్ర: అమెరికా తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకుంది?

జ: అధికారికంగా కారణాలు వెల్లడించకపోయినా, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగకుండా చూడటం, సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండటం వంటి కారణాల వల్లే ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్ర: ఈ నిర్ణయంతో భారత్‌కు వచ్చే లాభం ఏంటి?

జ: భారత్ తన చమురు అవసరాల కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడుతోంది. అమెరికా మినహాయింపు ఇవ్వడం వల్ల తక్కువ ధరకు చమురు లభిస్తుంది, ఇది దేశీయ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

ప్ర: ఇతర దేశాలకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందా?

జ: లేదు. ఇరాన్, క్యూబా, ఉత్తర కొరియా వంటి దేశాల నుంచి చమురు కొనుగోలు చేయడానికి అమెరికా అనుమతి ఇవ్వలేదు. వారిపై ఆంక్షలు కఠినంగా కొనసాగుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe