IND-A vs UAE : 28 సిక్సర్లు, 7 ఫోర్లు... వైభవ్ సూర్యవంశీ వీరవిహారం - 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ, పట్టపగలే చుక్కలు

IND-A vs UAE Cricket Match : ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ 2026లో యూఏఈపై 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ ఇదే. 

Published on: Nov 24, 2026, 18:30:30 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

IND-A vs UAE Cricket Match : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో భారత యువ సంచలనం.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్ విధ్వంసంతో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు. మంగళవారం దోహా వేదికగా యూఏఈతో జరిగిన కీలక గ్రూప్ దశ పోరులో వైభవ్ కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ కావడం విశేషం. మొత్తం 53 బంతులు ఎదుర్కొన్న ఈ బిహార్ కుర్రాడు 28 సిక్సర్లు, 7 ఫోర్లతో ఏకంగా 204 పరుగులు సాధించి మైదానంలో పరుగుల తుఫాను సృష్టించాడు.

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

దోహా మైదానంలో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ ఝుళిపించిన తీరుకు యూఏఈ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. మొత్తం 53 బంతులు ఎదుర్కొన్న వైభవ్ ఏకంగా 204 పరుగులు చేసి మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. యూఏఈ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని భారత్-ఏ జట్టు కేవలం 14.2 ఓవర్లలోనే ఛేదించి హైలైట్ రీల్‌ను తలపించింది. అంతకుముందు పాకిస్థాన్ షాహీన్స్ చేతిలో ఓటమి పాలైన భారత్-ఏకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. ఈ కీలక పోరులో వైభవ్ వీరవిహారంతో విజయం సాధించిన భారత్-ఏ, శ్రీలంక-ఏ, బంగ్లాదేశ్-ఏ, పాకిస్థాన్-ఏ జట్లతో పాటు సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.

బౌండరీలతోనే 196 పరుగులు… రికార్డుల వేట

ఈ ఏడాది వేసవిలో ఐపీఎల్ 2026 ప్రదర్శన తర్వాత భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన వైభవ్…. ఈ ఇన్నింగ్స్‌లో 384.90 స్ట్రైక్ రేట్‌తో 28 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కును అందుకుని లిస్ట్-ఏ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లిఖించాడు. 2024లో క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఒటాగోపై కాంటర్‌బరీ తరఫున చాద్ బౌస్ 103 బంతుల్లో చేసిన డబుల్ సెంచరీ రికార్డును వైభవ్ ఏకంగా 51 బంతుల తేడాతో బద్దలు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ చేసిన 204 పరుగుల్లో కేవలం బౌండరీలు, సిక్సర్ల రూపంలోనే 196 పరుగులు రావడం గమనార్హం. మిగిలిన 18 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే తీశాడు.

ఒకే ఇన్నింగ్స్‌లో 28 సిక్సర్లు బాదడం ద్వారా ప్రొఫెషనల్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా వైభవ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2024 రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ బాదిన 26 సిక్సర్ల రికార్డును వైభవ్ అధిగమించాడు. డబుల్ సెంచరీకి ముందు కేవలం 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, లిస్ట్-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కూడా తన పేరిట రాసుకున్నాడు.

2023లో అడిలైడ్‌లో టస్మానియాపై సౌత్ ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ 29 బంతుల్లో చేసిన సెంచరీ రికార్డును వైభవ్ తుడిచిపెట్టాడు. అంతేకాదు, ప్రొఫెషనల్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ వైభవ్‌కు ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. గతేడాది దోహాలోనే యూఏఈపై టీ20 మ్యాచ్‌లో భారత్-ఏ తరఫున తాను చేసిన 32 బంతుల సెంచరీ రికార్డును తానే అధిగమించాడు.

భారత్-ఏ ఛేదనలో మొత్తం 86 బంతులు మాత్రమే ఆడగా…. అందులో 53 బంతులను వైభవ్ ఒక్కడే ఎదుర్కోవడం అత్యంత ఆశ్చర్యకరమైన అంశం. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో జట్టు స్కోరు 122/2 వద్ద ఉండగానే వైభవ్ 28 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత పవర్ ప్లే చివరి బంతికి జట్టు స్కోరు 183/2 వద్దకు చేరిన సమయానికి అతను 150 పరుగుల మార్కును అందుకున్నాడు. అయితే జట్టును విజయతీరాలకు చేర్చే క్రమంలో వైభవ్ అవుటయ్యాడు. 13వ ఓవర్లో స్పిన్నర్ బాసిల్ హమీద్ వేసిన బంతిని మ్యాచ్ విన్నింగ్ సిక్సర్‌గా మలచబోయి లాంగ్-ఆఫ్‌లో ఆర్యన్ష్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం రింకూ సింగ్ భారీ సిక్సర్‌తో భారత్-ఏ విజయాన్ని ఖరారు చేశాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. గతేడాది వరకు భారత్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడిన హర్‌ప్రీత్ సింగ్ భాటియా, యూఏఈ తరఫున 144 బంతుల్లో 130 పరుగులతో భావోద్వేగభరితమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. భారత్-ఏ బౌలర్లలో అర్షద్ 10 ఓవర్లలో 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.