...
...
Next Story

Vaibhav Sooryavanshi: ఏడిపించేసిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల పిల్లాడికి క్రికెట్ సలామ్

Vaibhav Sooryavanshi: ఇంకా పిల్లాడని అంటారా? కాదు.. క్రికెట్ ప్రపంచమే ప్రశంసలు కురిపిస్తున్న చిచ్చర పిడుగు అతడు. 15 ఏళ్ల వయసులోనే ప్రకంపనలు సృష్టిస్తున్న‌ వీరుడు అతడు. అతని పేరే.. వైభవ్ సూర్యవంశీ. క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ఓటమితో ఏడ్చేసిన వైభవ్.. అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాడు.

Published on: May 30, 2026, 16:10:39 IST
Advertisement

Vaibhav Sooryavanshi: చేతిలో తాడు పట్టుకుని బొంగరాలను గింగిరాలు తిప్పుతూ ఆడుకునే వయసులో.. బ్యాట్ ను గింగిరాలు తిప్పుతూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. భుజాలకు బ్యాగ్ వేసుకుని బడికి వెళ్లే ఏజ్ లో.. జట్టు భారాన్ని భుజాలకెత్తుకున్నాడు. అల్లరి వేషాలు వేసే రోజుల్లోనే.. అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలతో క్రికెట్ ప్రపంచాన్నే తన వైపు తిప్పుకొన్నాడు. ఆ సంచలనమే.. వైభవ్ సూర్యవంశీ.

వైభవ్ సూర్యవంశీ ఎమోషనల్

రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో ఎమోషనల్ అయిన వైభవ్ సూర్యవంశీ (PTI)
రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో ఎమోషనల్ అయిన వైభవ్ సూర్యవంశీ (PTI)

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం నుంచి క్వాలిఫయర్ 2 మ్యాచ్ ముగిసేంతవరకూ ఎక్కువగా వినిపించిన పేరు, హాట్ టాపిక్ గా మారిన ఆటగాడు ఎవరంటే.. కచ్చితంగా వైభవ్ సూర్యవంశీనే. 15 ఏళ్లకే అద్భుతానికి మించి అనేలా అతను బ్యాటింగ్ చేశాడు. కానీ రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్ 2లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాడు.

ఎంతైనా పిల్లాడు కదా

క్రికెట్లో ఎన్నో ఒడుదొడుకులు చూసిన దిగ్గజాలే ఓ సమయంలో ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేరు. మరి ఇంకా పసితనమే పోని వైభవ్ సూర్యవంశీ కన్నీళ్లు పెట్టుకోవడంలో తప్పు లేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. వైభవ్ సూర్యవంశీ బాధ చూసి క్రికెట్ ఫ్యాన్స్ కూడా బాధపడ్డారు. అరే.. ఈ పిల్లాడి టీమ్ గెలవాల్సిందే అని ఫీల్ అయ్యారు. 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది.

ఫోకస్ తనపైనే

ఐపీఎల్ వచ్చిందంటే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి టాప్ స్టార్ల ఆట చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడతారు. పెద్ద జట్ల మ్యాచ్ ల కోసం క్రికెట్ లవర్స్ షెడ్యూల్ సెట్ చేసుకుంటారు. కానీ ఈ సీజన్ లో మాత్రం అందరూ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ను చూడాలనుకున్నారు. 15 ఏళ్ల పిల్లాడి బ్యాటింగ్ అద్భుతాలను వీక్షించాలనుకున్నారు. అందుకే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లను చూశారు. వైభవ్ బాదుతుంటే తెగ ఎంజాయ్ చేశారు. ఔటైపోతే అయ్యో అని ఫీల్ అయ్యారు.

ఒంటరి పోరాటం

ఎలిమినేటర్ లో 97 రన్స్, క్వాలిఫయర్ లో 96 రన్స్ కొట్టాడు వైభవ్ సూర్యవంశీ. ఈ రెండు ఇన్నింగ్స్ లు ఎంతో హై ప్రెషర్ గేమ్స్ లో వచ్చినవే. రెండూ నాకౌట్ మ్యాచ్ లే. అయినా ఈ మ్యాచ్ ల్లో, ముఖ్యంగా క్వాలిఫయర్ 2లో వైభవ్ చూపించిన తెగువ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే.

టాప్ బౌలర్లపై

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ విధ్వంసం మామూలుగా సాగలేదు. 16 ఇన్నింగ్స్ లో 776 రన్స్ కొట్టాడు. ఓ సెంచరీ బాదాడు. 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఇక స్ట్రైక్ రేట్ (237.30)లో, సిక్సర్ల (72)లో వైభవ్ సూర్యవంశీ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. అలా అని వైభవ్ కొట్టింది మామూలు బౌలర్లను కాదు. బుమ్రా, భువనేశ్వర్, హేజిల్ వుడ్, రబాడ లాంటి టాప్ క్లాస్ పేసర్లను దంచాడు. కేజీఎఫ్ సినిమాలో ‘నేను కొట్టినవాళ్లందరూ గ్యాంగ్ స్టర్లే’ అని హీరో డైలాగ్ చెప్తాడు. అలాగే ఐపీఎల్ లో వైభవ్ బాదినవాళ్లందరూ టాప్ క్లాస్ బౌలర్లే. అందుకే క్రికెట్ ప్రపంచం అతనికి సలామ్ కొడుతోంది.

వండర్ కిడ్

15 ఏళ్లకే ఇంతటి మెచ్యూరిటీ, గేమ్ అవేర్ నెస్, బ్యాటింగ్ స్టెబిలిటీ ఉండటం సాధారణ విషయం ఏ మాత్రం కాదు. ఇక అతని షాట్లు వేరే లెవల్. అడ్డదిడ్డంగా ఊపడం కాదు, క్రీజులో నిలబడి మరీ ఊచకోత కోస్తాడు. బ్యాక్ ఫుట్ పై బలంగా నిలబడి వైభవ్ ఆడే లాఫ్టెడ్ షాట్లు, ఆన్ సైడ్ డ్రైవ్ లు అదుర్స్ అంతే.

క్రికెట్లో ఒక్కో తరానికి ఒక్కో లెజెండ్ వస్తాడు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ధోని, కోహ్లి, రోహిత్ అలాంటి దిగ్గజాలే. ఇప్పుడు జెన్ జీ తరానికి లెజెండ్ గా మారేలా కనిపిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఫిట్ నెస్ కాపాడుకుంటూ, ఫామ్ కొనసాగిస్తే ఈ కుర్రాడికి తిరుగుండదు. భారత క్రికెట్ కు మరో వజ్రం దొరికినట్లే!

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks