భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి విన్‌ఫాస్ట్- ప్రత్యేక మోడల్స్‌తో ఎంట్రీ..
వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్, 2026 ద్వితీయార్థంలో ప్రత్యేకంగా భారతీయ అవసరాల కోసం రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్లతో మన దేశ టూ-వీలర్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఏడాదికి 10 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యమే లక్ష్యంగా భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు విన్‌ఫాస్ట్ సంస్థ క్రేజీ ప్రణాళికలను రచిస్తోంది. ఇప్పటికో 4 వీలర్ ఈవీ సెగ్మెంట్లో దూసుకెళుతున్న ఈ వియత్నాం సంస్థ.. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఈ 2026 రెండో అర్థభాగంలో ఇండియాలోకి ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన ‘ఇండియా-స్పెసిఫిక్’ ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకురానున్నట్లు కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక టూ-వీలర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ లైన్‌ను నిర్మించాలని, దీర్ఘకాలంలో ఏడాదికి పది లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ పేర్కొంది.
భారత్‌లో విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల లాంచ్ వివరాలు..
కంపెనీ వ్యూహాల గురించి విన్‌ఫాస్ట్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ మా మాట్లాడుతూ.. భారత దేశ మార్కెట్ కోసం విన్‌ఫాస్ట్ సిద్ధం చేసిన కొన్ని కీలక ప్రణాళికలను వెల్లడించారు.
"మా టూ-వీలర్ ప్రోగ్రామ్ మొత్తం తమిళనాడులో ఉన్న విన్‌ఫాస్ట్ ప్లాంట్‌లోనే కేంద్రీకృతమై ఉంటుంది. ఎలక్ట్రిక్ టూ-వీలర్ల కోసం ప్రత్యేకంగా ఒక ప్రొడక్షన్ లైన్‌ను సపోర్ట్ చేసే విధంగా మేము అక్కడ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నాము. ఈ స్కూటర్లు గ్లోబల్ మార్కెట్ నుంచి తెచ్చినవి కావు, వీటిని ప్రత్యేకంగా భారతీయ మార్కెట్ కోసమే అభివృద్ధి చేస్తున్నాము," అని ఆయన స్పష్టం చేశారు.
భారీ ఉత్పత్తి సామర్థ్యం - దీర్ఘకాలిక లక్ష్యం..
ప్రస్తుతం విన్‌ఫాస్ట్ ఫోర్-వీలర్ (కార్ల) ప్లాంట్‌ను ఏడాదికి 1,50,000 యూనిట్ల సామర్థ్యంతో నిర్మిస్తుండగా, టూ-వీలర్ వ్యాపారాన్ని మాత్రం అంతకంటే భారీ స్థాయిలో ప్లాన్ చేస్తోంది. పది లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్నది కంపెనీ దీర్ఘకాలిక విజన్. అయితే, ఈ స్థాయిని ఎప్పటిలోగా అందుకుంటారు లేదా దీనికోసం ఎంత పెట్టుబడి పెడుతున్నారు అనే వివరాలను మాత్రం కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు.
ధరలను తగ్గించే దిశగా అడుగులు..
భారత ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో ఇప్పటికే విపరీతమైన పోటీ ఉంది. దానిని తట్టుకునేందుకు స్కూటర్ల ధరలను తగ్గించేందుకు, సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చూసేందుకు సంస్థ తన భారతీయ సరఫరాదారులతో చర్చలు జరుపుతోంది. బ్యాటరీలతో పాటు విడిభాగాలను స్థానికంగానే తయారు చేయడం ద్వారా ఖర్చులను తగ్గించాలని భావిస్తోంది. అలాగే, కొత్త పెట్టుబడుల పరిమాణం, సమయాన్ని బట్టి భారత ప్రభుత్వ రాయితీ పథకాలైన పీఎల్ఐ, పీఎం ఈ-డ్రైవ్ వంటి వాటికి అర్హత పొందే అంశాలను కూడా పరిశీలిస్తోంది.
విస్తృతమైన మార్కెట్ పరిశోధన..
గత ఏడాది కాలంగా నిర్వహించిన విస్తృతమైన మార్కెట్ రీసెర్చ్ ఆధారంగానే ఈ స్కూటర్లను అభివృద్ధి చేస్తున్నట్లు విన్‌ఫాస్ట్ తెలిపింది. స్థానిక వినియోగదారుల అలవాట్లు, మౌలిక సదుపాయాలు, ప్రయాణించే సగటు దూరం, ధరల పట్ల భారతీయ వినియోగదారులకు ఉండే సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని డిజైన్ చేస్తున్నట్టు వివరించింది.
దీనిని బట్టి చూస్తే, రాబోయే స్కూటర్లు అధిక అమ్మకాలే లక్ష్యంగా, సరసమైన ధరల్లో వచ్చే ‘వాల్యూమ్-ఫోకస్డ్’ ఉత్పత్తులుగా ఉండే అవకాశం ఉంది.
ఈ విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల లాంచ్, ఫీచర్స్, రేంజ్, ధర వంటి అంశాలపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
2025 డిసెంబర్ ఈవీ (4 వీలర్) సేల్స్‌లో హ్యుందాయ్, కియా వంటి దిగ్గజ సంస్థలను వెనక్కి నెట్టి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది విన్‌ఫాస్ట్ సంస్థ. అతి తక్కువ సమయంలోనే ఇది సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


