VinFast VF5 : ఇండియాలోకి కొత్త ఎలక్ట్రిక్ కారు! విన్​ఫాస్ట్​ వీఎఫ్​5 ఫేస్​లిఫ్ట్ డిజైన్ పేటెంట్ హైలైట్స్..

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘విన్‌ఫాస్ట్’ తమ ఎంట్రీ-లెవెల్ ఎస్‌యూవీ 'వీఎఫ్5' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ డిజైన్ పేటెంట్‌ను భారతదేశంలో దాఖలు చేసింది. రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల శ్రేణిలో రానున్న ఈ కారు టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీలకు సవాలు విసిరేందుకు సిద్ధమవుతోంది.

Published on: Oct 29, 2026, 07:30:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ విపణిలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణను సొమ్ము చేసుకునేందుకు విదేశీ ఈవీ దిగ్గజాలు క్యూ కడుతున్నాయి. తమిళనాడులోని తూత్తుకుడిలో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి భారత మార్కెట్లోకి ఇప్పటికే అడుగుపెట్టిన వియత్నామీస్ ఆటోమొబైల్ సంస్థ ‘విన్‌ఫాస్ట్’.. తాజాగా దేశీయ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్‌తో ముందుకొచ్చింది. కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘విన్‌ఫాస్ట్ వీఎఫ్5’కి చెందిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ డిజైన్ పేటెంట్‌ను భారతదేశంలో అధికారికంగా ఫైల్ చేసింది.

విన్​ఫాస్ట్​ వీఎఫ్​5 ఫేస్​లిఫ్ట్
విన్​ఫాస్ట్​ వీఎఫ్​5 ఫేస్​లిఫ్ట్

ఇప్పటికే భారతీయ రహదారులపై రహస్యంగా టెస్టింగ్ జరుపుకుంటూ కంటపడిన ఈ ఎలక్ట్రిక్ కారు.. త్వరలోనే భారత మార్కెట్లో అధికారికంగా విడుదల కానుందనే వార్తలకు తాజా పేటెంట్ లీకులు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. విశేషమేమిటంటే, అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం అమ్ముడవుతున్న మోడల్ కంటే అనేక డిజైన్ మార్పులతో, సరికొత్త అప్‌డేటెడ్ లుక్‌తో ఈ కారు భారత్‌లోకి అడుగుపెట్టబోతోంది.

విన్​ఫాస్ట్​కు ప్రస్తుతం వీఎఫ్​6, వీఎఫ్​7 మోడల్స్​ మాత్రమే ఇండియాలో ఉన్నాయి.

అంతర్జాతీయ మోడల్‌కు.. భారత్‌లో రానున్న ఫేస్‌లిఫ్ట్‌కు తేడా ఏంటి?

భారత మార్కెట్ కోసం దాఖలు చేసిన డిజైన్ పేటెంట్ పత్రాల ప్రకారం.. విన్‌ఫాస్ట్ వీఎఫ్5 ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌టీరియర్ రూపురేఖలను కస్టమర్లను ఆకట్టుకునేలా రీడిజైన్ చేశారు:

ముందు భాగం : పాత అంతర్జాతీయ మోడల్‌తో పోలిస్తే విన్​ఫాస్ట్ వీఎఫ్​5 ఫేస్​లిఫ్ట్ మోడల్‌లో హెడ్‌లాంప్‌లు మరింత స్లిమ్‌గా, కాస్త కిందికి అమర్చి కనిపిస్తాయి. హెడ్‌లైట్ల కింద ఉన్న నల్లటి డిజైన్ ఎలిమెంట్ పరిమాణాన్ని తగ్గించి, బంపర్ కింది భాగంలోకి కలిసిపోయేలా రీడిజైన్ చేశారు. పదునైన బోనెట్ కారుకు స్పోర్టీ లుక్‌ను ఇస్తుంది.

సైడ్ ప్రొఫైల్: పక్కవైపు నుంచి చూస్తే కారు కొలతల్లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, రీడిజైన్ చేసిన కొత్త 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను ఇందులో అందించనున్నారు.

వెనుక భాగం : కారు వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లను మరింత లావుగా డిజైన్ చేశారు. గతంలో బంపర్‌పై ఉండే రివర్స్ లైట్లు, టర్న్ ఇండికేటర్లను ఇప్పుడు నేరుగా ప్రధాన టెయిల్ లాంప్ యూనిట్‌లోనే విలీనం చేశారు. టెయిల్‌గేట్ మధ్యలో పెద్ద అక్షరాలతో 'VinFast' బ్రాండింగ్, కుడివైపు చివర 'VF5' బ్యాడ్జ్ ఉంటుంది.

విన్​ఫాస్ట్ వీఎఫ్​5 ఫేస్​లిఫ్ట్- రేంజ్, బ్యాటరీ సామర్థ్యం..

అంతర్జాతీయ మార్కెట్లలో వీఎఫ్5 కారు రెండు రకాల బ్యాటరీ కాన్ఫిగరేషన్లతో లభ్యమవుతోంది.

29.6 kWh బ్యాటరీ ప్యాక్: ఇండోనేషియా వంటి మార్కెట్లలో వాడే ఈ మోడల్ 90 హెచ్​పీ పవర్, 135 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై ఇది 268 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

37.23 kWh బ్యాటరీ ప్యాక్: ఇతర ప్రపంచ మార్కెట్లలో లభించే ఈ పవర్‌ఫుల్ వెర్షన్ 136 హెచ్​పీ పవర్, 135 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 326 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

అయితే, భారతీయ రోడ్లు, ఉష్ణోగ్రతలకు అనుగుణంగా విన్‌ఫాస్ట్ ఏ బ్యాటరీ ప్యాక్‌ను పరిచయం చేస్తుందనేది కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

విన్​ఫాస్ట్ వీఎఫ్​5 ఫేస్​లిఫ్ట్- ధర, పోటీ..

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఈవీ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, మధ్యతరగతి కస్టమర్ల జేబుకు అందుబాటులో ఉండేలా విన్‌ఫాస్ట్ ఈ కారును రూపుదిద్దుతోంది.

భారత్‌లో విడుదలయితే విన్​ఫాస్ట్ వీఎఫ్​5 ఫేస్​లిఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల శ్రేణిలో ఉండే అవకాశముంది. ఈ బడ్జెట్‌లో కారు మార్కెట్లోకి వస్తే.. ప్రస్తుతం దేశీయ ఈవీ మార్కెట్‌ను శాసిస్తున్న టాటా పంచ్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఈవీలకు ఇది గట్టి సవాలుగా మారడం ఖాయం.

తమిళనాడులోని తమ ప్లాంట్‌ ద్వారా స్థానికంగానే ఈ వాహనాలను అసెంబుల్ చేసే యోచనలో విన్‌ఫాస్ట్ ఉన్నట్లు సమాచారం. దీనివల్ల కారు ధర మరింత అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More