Vivo T5x 5G : 7200 ఎంఏహెచ్​ బ్యాటరీతో వివో కొత్త స్మార్ట్​ఫోన్- టీ5ఎక్స్​ 5జీ లాంచ్​ ఎప్పుడంటే..

Vivo T5x India launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన 'టీ-సిరీస్'లో సరికొత్త మోడల్ వివో టీ5ఎక్స్​ 5జీ లాంచ్ డేట్​ని ఖరారు చేసింది. 7,200 ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ, శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో మార్చ్​ 17న ఇది భారత మార్కెట్​లోకి అడుగుపెట్టనుంది. వివరాల్లోకి వెళితే..

Published on: Mar 11, 2026, 06:00:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం వివో మరో పవర్‌ఫుల్ మొబైల్‌ను సిద్ధం చేస్తోంది. గతేడాది విడుదలైన వివో టీ4ఎక్స్​ 5జీకి సక్సెసర్​గా.. మరింత అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో వివో టీ5ఎక్స్​ 5జీ అనే స్మార్ట్​ఫోన్​ని ఇండియాలో లాంచ్​ చేయనుంది. ఈ గ్యాడ్జెట్​ని ఈ మార్చ్​ 17న విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. రూ. 23,000 లోపు ధరలో ఇది అత్యంత వేగవంతమైన ఫోన్‌ అని వివో చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో టీ5ఎక్స్​ 5జీ..
వివో టీ5ఎక్స్​ 5జీ..

వివో టీ5ఎక్స్​ 5జీ- పెర్ఫార్మెన్స్ అదిరిపోద్ది..

ఈ వివో కొత్త స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ సామర్థ్యం ఏ స్థాయిలో ఉందంటే.. అంటుటు బెంచ్‌మార్క్ టెస్టులో ఏకంగా 10 లక్షలకు పైగా పాయింట్లను సాధించిందని కంపెనీ వెల్లడించింది. అలాగే, ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్​ఓఎస్​ 6తో రానున్న మొదటి ఫోన్లలో ఒకటి కావడం విశేషం.

వివో టీ5ఎక్స్​ 5జీ- సెగ్మెంట్లోనే బిగ్గెస్ట్ బ్యాటరీ..

ఈ వివో టీ5ఎక్స్​ 5జీలో ప్రధాన ఆకర్షణ దీని 7,200 ఎంఏహెచ్​ బ్యాటరీ అని చెప్పుకోవాలి. ఈ విభాగంలో (సబ్​-23కే) ఇంతటి భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్ మరొకటి లేదని వివో ధీమా వ్యక్తం చేస్తోంది.

నిరంతరంగా గేమింగ్ ఆడినా, గంటల తరబడి సినిమాలు చూసినా ఛార్జింగ్ సమస్య ఉండదని సంస్థ పేర్కొంది.

దీనికి తోడు 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని సమాచారం.

మరోవైపు వినియోగదారులు ఫోన్‌ను రఫ్ అండ్ టఫ్‍‌గా వాడుకునేలా ఈ వివో కొత్త స్మార్ట్​ఫోన్​కి ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఇచ్చారు. అంటే నీటిలో పడినా లేదా ధూళి చేరినా ఫోన్‌కు ఏమీ కాదు. సాధారణంగా ప్రీమియం ఫోన్లలో ఉండే ఈ ఫీచర్లను బడ్జెట్ ధరలోనే వివో అందిస్తోంది.

మునుపటి మోడల్ (వివో టీ4ఎక్స్​)తో పోలిస్తే మార్పులేంటి?

గతేడాది వచ్చిన వివో టీ4ఎక్స్​ 5జీతో పోలిస్తే టీ5ఎక్స్​లో భారీ మార్పులే కనిపిస్తున్నాయి.

బ్యాటరీ: టీ4ఎక్స్​లో 6,500 ఎంఏహెచ్​ ఉంటే, వివో టీ5ఎక్స్​ 5జీలో అది 7,200 ఎంఏహెచ్​కి పెరిగింది.

ప్రాసెసర్: డైమెన్సిటీ 7300 నుంచి డైమెన్సిటీ 7400 టర్బోకు అప్‌గ్రేడ్ అయ్యింది.

సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 15 నుంచి లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16కు మారింది.

వివో టీ5ఎక్స్​ 5జీ- ధర..

ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉండనుంది. పూర్తి ధర వివరాలు మార్చ్​ 17న అధికారికంగా వెల్లడవుతాయి. కానీ ఇది రూ. 23వేల లోపే ఉంటుందని తెలుస్తోంది.

వివో వీ70 ఎఫ్​ఈ లాంచ్​..

మరోవైపు వివో సంస్థ తన వీ70 సిరీస్​ని ఎక్స్​ప్యాండ్​ చేస్తూ ఇండోనేషియాలో ఇటీవలే “వీ70 ఎఫ్​ఈ” స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసింది. అద్భుతమైన డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ త్వరలోనే కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అందుబాటులోకి రానుంది.

వివో వీ70 ఎఫ్​ఈ- ధర, లభ్యత..

ఇండోనేషియా మార్కెట్లో వివో వీ70 ఎఫ్​ఈ మూడు వేరియంట్లలో లభిస్తుంది:

8 GB ర్యామ్​ + 256 GB స్టోరేజ్: దీని ధర ఐడీఆర్​ 64,99,000 (మన దేశీ కరెన్సీలో సుమారు రూ. 35,000).

12 GB ర్యామ్ + 256GB స్టోరేజ్: దీని ధర ఐడీఆర్​ 71,99,000 (సుమారు 39,000).

8 GB ర్యామ్ + 512 GB స్టోరేజ్: దీని ధర ఐడీఆర్​ 73,99,900 (సుమారు రూ. 40,000).

ఈ ఫోన్ బ్లూ, లైట్ పర్పుల్, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. వివో సంస్థ ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది?

వివోని 2009లో చైనాలోని డాంగువాన్ నగరంలో స్థాపించారు. దీని వ్యవస్థాపకుడి పేరు షెన్ వీ. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 'Vivo' అనే పదం ఎస్పెరాంటో భాషలోని "లైఫ్​" (జీవితం) అనే పదం నుంచి వచ్చింది.

2. మొబైల్ టెక్నాలజీలో వివో సృష్టించిన ప్రపంచ రికార్డులు ఏంటి?

వివో తన ప్రయాణంలో అనేక "ప్రపంచంలోనే మొదటివి" అనే ఘనతలను సాధించింది:

ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోన్: 2014లో విడుదలైన వివో ఎక్స్​5 మ్యాక్స్​ అప్పట్లో 4.75 ఎంఎం మందంతో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా రికార్డు సృష్టించింది.

మొదటి ఇన్-డిస్​ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్: 2018లో వివో ఎక్స్​20 ప్లస్​ యూడీ ద్వారా స్క్రీన్‌పైనే వేలిముద్ర సెన్సార్‌ను పరిచయం చేసిన మొదటి కంపెనీగా నిలిచింది.

పాప్-అప్ సెల్ఫీ కెమెరా: వివో ఎన్​ఈఎక్స్​ సిరీస్‌తో మోటరైజ్డ్ పాప్-అప్ కెమెరాను ప్రపంచానికి పరిచయం చేసింది.

3. భారత్‌లో వివో ఎప్పుడు అడుగుపెట్టింది?

వివో 2014లో భారత మార్కెట్​లోకి ప్రవేశించింది. భారతీయ వినియోగదారులకు దగ్గరయ్యేందుకు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ నోయిడాలో భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక మార్కెట్ వాటా కలిగిన టాప్ 5 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో వివో ఒకటి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More