Stock market : మదుపర్లకు పీడకల! 5ఏళ్లల్లో సంపదను సర్వ నాశనం చేసిన స్టాక్స్​ ఇవి..

"యాన్యువల్​ వెల్త్​ క్రియేషన్​ స్టడీ"లో భాగంగా.. గత 5ఏళ్లల్లో సంపదను ఆవిరి చేసిన టాప్​-10 స్టాక్స్​ లిస్ట్​ని మోతీలాల్​ ఓస్వాల్​ వెల్లడించింది. ఇందులో వొడాఫోన్​ ఐడియా వంటి ప్రముఖ సంస్థలు కూడా ఉన్నాయి.

Published on: Dec 13, 2025 3:01 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

"యాన్యువల్​ వెల్త్​ క్రియేషన్​ స్టడీ"ని మోతీలాల్ ఓస్వాల్ ఇటీవలే విడుదల చేసింది. ఈ అధ్యయనం ప్రకారం.. 2020 నుంచి 2025 వరకు, అంటే ఐదేళ్ల కాలం.. గత మూడు దశాబ్దాల చరిత్రలోనే అత్యధిక సంపదను సృష్టించింది!

సంపదను ధ్వంసం చేసిన టాప్​ 10 స్టాక్స్​ ఇవి.. (AI-generated image)
సంపదను ధ్వంసం చేసిన టాప్​ 10 స్టాక్స్​ ఇవి.. (AI-generated image)

ఈ సంవత్సరం నివేదిక థీమ్.. ‘ఇండియా – ది మల్టీ-ట్రిలియన్ డాలర్ ఆపర్చునిటీ - కాంపౌండింగ్ ఎకానమీ, కాంపౌండింగ్ స్టాక్స్’. భారతదేశ ఆర్థిక పురోగతి పెట్టుబడిదారులు, వ్యాపారాలు, మూలధన కేటాయింపుదారులకు ఎలా అపారమైన అవకాశాలను సృష్టించబోతోందో ఈ నివేదిక విశ్లేషిస్తుంది. మోతీలాల్ ఓస్వాల్ గ్రూప్ ఛైర్మన్ రామ్దేవ్ అగర్వాల్ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనం.. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న సంపద సృష్టిని సరికొత్తగా ఆవిష్కరించింది.

అయితే, ఇదే నివేదిక స్టాక్​ మార్కెట్​లోని మరో కోణాన్ని కూడా హైలైట్​ చేసింది. ఈ 5ఏళ్ల కాలంలో సంపదను ధ్వంసం చేసిన (వెల్త్​ డిస్ట్రాయర్స్​) అనేక స్టాక్స్​ (ముఖ్యంగా వినియోగదారుల-సంబంధిత రంగాల నుంచి వచ్చినవి) లిస్ట్​ని సైతం రూపొందించింది.

కానీ ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే.. గత 17 ఏళ్లలో సంపద ధ్వంసం అయిన మొత్తం రూ. 66,600 కోట్లుగా ఉంది. ఇది టాప్ 100 కంపెనీలు సృష్టించిన మొత్తం సంపదలో కేవలం 0.4% మాత్రమే! టాప్ 500 కంపెనీల్లో కేవలం 24 కంపెనీలు మాత్రమే సంపదను ధ్వంసం చేశాయని మోతీలాల్ ఓస్వాల్ అధ్యయనం పేర్కొంది.

సంపదను ధ్వంసం చేసిన టాప్ 10 స్టాక్స్​ మొత్తం నాశమైన సంపదలో ఏకంగా 82% వాటాను కలిగి ఉన్నాయి! ఈ పది కంపెనీలు అన్నీ వినియోగదారుల-సంబంధిత వ్యాపారాలకు చెందినవే కావడం గమనార్హం.

సంపదను ధ్వంసం చేసిన టాప్ 10 స్టాక్‌లు..

ఈ జాబితాలో బంధన్ బ్యాంక్, వొడాఫోన్ ఐడియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్, పీవీఆర్ ఐనాక్స్, ఫ్యూచర్ కన్స్యూమర్ వంటి సుపరిచితమైన స్టాక్స్​ ఉన్నాయి.

రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, విర్ల్‌పూల్ ఇండియా అనే రెండు స్టాక్స్​ అత్యధిక సంపద ధ్వంసం చేసిన సంస్థలుగా నిలిచాయి. ఇవి ఐదేళ్లలో రూ. 10,000 కోట్లకు పైగా పెట్టుబడిదారుల సంపదను తుడిచిపెట్టేశాయి!

రాజేష్ ఎక్స్‌పోర్ట్స్: బంగారం శుద్ధి చేసి, తయారీ- ఎగుమతి చేసే ఈ సంస్థ స్టాక్ గత ఐదేళ్లలో 60% తగ్గింది. సీఏజీఆర్​ ప్రాతిపదికన ఇది 19% నష్టపోయింది.

విర్ల్‌పూల్ ఇండియా: ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీదారు అయిన ఈ కంపెనీ స్టాక్ ఐదేళ్లలో నికరంగా 56% పడిపోయింది. సీఏజీఆర్​ -11%గా ఉంది.

బంధన్ బ్యాంక్ కూడా ఈ జాబితాలో ఉంది. దీని షేర్లు మొత్తం సీఏజీఆర్​ -6%కి పడిపోయింది. పెట్టుబడిదారుల సంపదలో రూ. 8400 కోట్లు ఆవిరైపోయాయి.

మరోవైపు, సంక్షోభంలో ఉన్న టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా రూ. 7100 కోట్ల సంపద క్షీణతను చూసింది. కేవలం గత ఆరు నెలల్లో 50% పైగా ర్యాలీ ఉన్నప్పటికీ ఈ నష్టం నమోదైంది. ఈ జాబితాలో పాజిటివ్ సీఏజీఆర్​ (17%) కలిగిన ఏకైక స్టాక్ ఇదే కావడం గమనార్హం.

ఈ జాబితాలో ధాని సర్వీసెస్ ఐదొవ స్థానంగా నిలిచింది. ఈ కాలంలో రూ. 4400 కోట్లను ఆవిరి చేసింది. దీని సీఏజీఆర్​ -12% వద్ద ఉంది.

మోతీలాల్​ ఓస్వాల్​ వెల్త్​ స్టడీ (Motilal Oswal Wealth Study)
మోతీలాల్​ ఓస్వాల్​ వెల్త్​ స్టడీ (Motilal Oswal Wealth Study)

కాగా, జాబితాలో చివరి ఐదు స్థానాల్లో రిలాక్సో ఫుట్‌వేర్, పీవీఆర్ ఐనాక్స్, స్పందన స్ఫూర్తి, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యూచర్ కన్స్యూమర్ ఉన్నాయి. ఇవి కలిపి మొత్తం రూ. 14,100 కోట్లను కోల్పోయాయి.

రంగాల పరంగా చూస్తే, కన్జ్యూమర్​- రిటైల్ రంగం రూ. 29600 కోట్లతో 'సంపదను ధ్వంసం చేయడం'లో అగ్రస్థానంలో నిలిచింది. దీని మొత్తం వాటాలో 44%గా ఉంది. దీని తర్వాత ఫైనాన్షియల్స్, టెలికాం రంగాలు ఉన్నాయి. ఐటీ, రియల్టీ, మీడియా, క్యాపిటల్ గూడ్స్ వంటి ఇతర రంగాలు కూడా పేలవమైన పనితీరును కనబరిచాయి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)