...
...
Next Story

సంక్షేమ పథకాలకు ఆధార్ బదులు ఓటర్ ఐడీ? కేంద్రం ప్రతిపాదనపై విపక్షాల ఆగ్రహం

సంక్షేమ పథకాల లబ్ధికి ఆధార్ స్థానంలో ఓటర్ ఐడీ, బయోమెట్రిక్ వివరాలను ప్రామాణికంగా తీసుకుంటామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేసిన ప్రకటనపై విపక్షాలు మండిపడ్డాయి. ఎస్‌ఐఆర్‌ పేరుతో కోట్ల మంది ఓట్లను తొలగించి, ఇప్పుడు సంక్షేమానికి దూరం చేసే కుట్ర చేస్తోంది అని కాంగ్రెస్, సీపీఐ(ఎం) ఆరోపించాయి.

Published on: Nov 5, 2026, 14:10:26 IST
Advertisement

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల నగదు బదిలీ, ఇతర ప్రయోజనాలకు ఇకపై ఆధార్ కార్డే ప్రామాణికం కాదనే చర్చ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆధార్‌కు బదులుగా బయోమెట్రిక్ వివరాలు, ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) సంఖ్య ప్రాతిపదికగా చెల్లింపులు జరుపుతామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ‘పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ 2026-27’ జాతీయ వర్క్‌షాప్‌లో మాట్లాడిన ఆయన, ఆధార్ నమోదు కేంద్రాలు ప్రతి వీధిలోనూ అందుబాటులోకి వచ్చాయని, ఐదు నిమిషాల్లో ఎవరికైనా ఆధార్ జారీ చేసే అవకాశం ఉందన్నారు. అందుకే ఇకపై సంక్షేమ ఫలాల అందజేతకు ఓటరు ఐడీ, బయోమెట్రిక్ నిర్ధారణనే ప్రామాణికంగా తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం తీసుకువస్తున్న ఈ నూతన విధానంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.

రాజకీయ హక్కులతో పాటు సంక్షేమానికీ కోత: కాంగ్రెస్

సంక్షేమ పథకాలకు ఆధార్ బదులు ఓటర్ ఐడీ? కేంద్రం ప్రతిపాదనపై విపక్షాల ఆగ్రహం
సంక్షేమ పథకాలకు ఆధార్ బదులు ఓటర్ ఐడీ? కేంద్రం ప్రతిపాదనపై విపక్షాల ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వం ముందస్తు వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ పవన్ ఖేరా ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ వల్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 13.3 కోట్ల మంది భారతీయులు ఓటర్ల జాబితా నుంచి పేర్లు కోల్పోయారని ఆయన గుర్తుచేశారు. ఓటరు ఐడీ లేదనే నెపంతో పేదలకు రేషన్, ఇళ్లు, ఆరోగ్య బీమా, ఉపాధి హామీ పథకాలను తిరస్కరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. మొదట ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించి రాజకీయ గొంతు నొక్కడం, ఆ తర్వాత ఓటరు ఐడీ లేదనే కారణంతో సంక్షేమ హక్కులను లాక్కోవడమే ఈ పెద్ద కుట్రలోని అసలు రూపమని ఆయన దుయ్యబట్టారు.

ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి: సీపీఐ(ఎం)

ఓటరు ఐడీ, బయోమెట్రిక్స్ నిర్బంధం చేసే ప్రతిపాదనను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ పేదలు తీవ్రంగా నష్టపోతారని, ఎస్‌ఐఆర్ ప్రక్రియ వల్ల ఓట్లు కోల్పోయిన వారిపై ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. వేలిముద్రలు అరిగిపోవడం వల్ల ఉపాధి హామీ కూలీలకు, కంటిపాప (ఐరిస్) స్కాన్ కాకపోవడం వల్ల వయోవృద్ధులైన మహిళా వ్యవసాయ కార్మికులకు లబ్ధి నిరాకరిస్తున్న ఉదంతాలను ఎత్తిచూపింది. స్మార్ట్‌ఫోన్లు లేని గ్రామీణ కుటుంబాలకు ఎలక్ట్రానిక్ కేవైసీ (ఈ-కేవైసీ) ప్రక్రియ పెద్ద అవరోధంగా మారిందని పేర్కొంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks