గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవడం ఎలా? బఫెట్ 20-స్లాట్ పంచ్ కార్డ్ సక్సెస్ మంత్రం

పెట్టుబడి రంగ దిగ్గజం వారెన్ బఫెట్ విజయానికి ఒక అద్భుతమైన సూత్రాన్ని వివరించారు. జీవితంలో వచ్చే అవకాశాలను '20-స్లాట్ పంచ్ కార్డ్'తో పోలుస్తూ, అనవసర నిర్ణయాలు తీసుకోకుండా సరైన అవకాశం కోసం వేచి చూడటమే సంపద సృష్టికి రహస్యమని ఆయన పేర్కొన్నారు.

Published on: Dec 22, 2025, 15:16:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, బిలియనీర్ వారెన్ బఫెట్ పెట్టుబడుల విషయంలోనే కాదు, జీవిత పాఠాల విషయంలోనూ ఎందరికో స్ఫూర్తిప్రదాత. తాజాగా ఆయనకు సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2001లో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం, ఇప్పటికీ నేటి తరం ఇన్వెస్టర్లకు ఒక మార్గదర్శిలా నిలుస్తోంది.

వారెన్​ బఫెట్
వారెన్​ బఫెట్

'20-స్లాట్ పంచ్ కార్డ్' అంటే ఏమిటి?

పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు '20-స్లాట్ పంచ్ కార్డ్' విధానాన్ని అనుసరించాలని బఫెట్ సూచించారు.

"మీ జీవితకాలం మొత్తానికి మీకు కేవలం 20 అవకాశాలు మాత్రమే ఉన్నాయని ఊహించుకోండి. మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయం మీ దగ్గరున్న కార్డ్‌లో ఒక 'పంచ్' (రంధ్రం) చేసినట్లు భావించండి. ఆ 20 స్లాట్లు అయిపోతే, మీకు ఇక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు" అని ఆయన వివరించారు.

ఈ పద్ధతి వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే.. మన దగ్గర పరిమితమైన అవకాశాలే ఉన్నాయని తెలిసినప్పుడు, మనం ప్రతి నిర్ణయాన్ని ఆషామాషీగా తీసుకోము. దాని లాభనష్టాలను క్షుణ్ణంగా బేరీజు వేస్తాం. ఇలా అత్యంత జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయడం వల్లే ఎవరైనా భారీగా సంపదను సృష్టించగలరని బఫెట్ నమ్ముతారు.

తొందరపాటు నిర్ణయాలు.. వనరుల వృథా!

ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్ ట్రేడింగ్ పుణ్యమా అని షేర్లను కొనడం, అమ్మడం ఒక క్లిక్‌తో అయిపోతోంది. ముఖ్యంగా బుల్ మార్కెట్ (మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పుడు) నడుస్తున్నప్పుడు ఏదో ఒకటి కొనేయాలనే ఆరాటం ఇన్వెస్టర్లలో పెరుగుతుంది. దీనిపై బఫెట్ హెచ్చరిస్తూ.. "మార్కెట్‌లో హడావుడి చూసి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాలక్రమేణా నష్టాలే మిగులుతాయి. తొందరపాటుతో చేసే పనుల వల్ల ఎవరూ డబ్బు సంపాదించలేరు" అని పేర్కొన్నారు.

జీవితంలో 500 గొప్ప అవకాశాలు రావు. వచ్చే ఆ కొన్నింటిని పట్టుకోవడంలోనే అసలైన ప్రతిభ ఉందని ఆయన వివరించారు. సరిగ్గా ఆలోచించి పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ 20 పంచ్‌లు కూడా వాడాల్సిన అవసరం రాకపోవచ్చని ఆయన చమత్కరించారు.

వారెన్ బఫెట్ సంపద సూత్రాలు - ముఖ్యాంశాలు:

  1. సొంతంగా రీసెర్చ్ చేయండి: మార్కెట్ వార్తలను నమ్మడం కంటే, కంపెనీల ఆర్థిక నివేదికలను (Financial Statements) చదవడం అలవాటు చేసుకోవాలి.
  2. ఎకనామిక్ మోట్ (Economic Moat): బలమైన పోటీని తట్టుకుని నిలబడగలిగే, భవిష్యత్తులో ఎదిగే అవకాశం ఉన్న కంపెనీల్లోనే పెట్టుబడి పెట్టాలి.
  3. సరళతకు ప్రాధాన్యం: "ఒక మూర్ఖుడు కూడా నడపగలిగే వ్యాపార సంస్థలను ఎంచుకోండి. ఎందుకంటే ఏదో ఒక రోజు ఒక మూర్ఖుడు దానిని నడిపించే అవకాశం ఉంటుంది." అని బఫెట్ గట్టిగా నమ్ముతారు. అంటే వ్యాపార నమూనా అంత సరళంగా ఉండాలని అర్థం.
  4. గోల (Noise) పట్టించుకోకండి: మార్కెట్‌లో వినిపించే అనవసరపు ఊహాగానాలను వదిలేయండి. మీ విశ్లేషణపై నమ్మకంతో దీర్ఘకాలిక లక్ష్యాలతో అడుగులు వేయండి.

బఫెట్ చెప్పినట్లుగా, పెట్టుబడి అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ కాదు. ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉండటం, భావోద్వేగాలకు లోనుకాకుండా హేతుబద్ధంగా ఆలోచించడం మాత్రమే మనల్ని విజేతలుగా నిలబెడుతుంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More