...
...
Next Story

IMD Heatwave : ఐఎండీ అలర్ట్స్- భారీగా పెరగనున్న ఎండలు.. రాబోయే 5 రోజులు అత్యంత కీలకం!

IMD alerts : దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. వాయువ్య భారత్‌లో 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో పాటు పలు రాష్ట్రాల్లో హీట్ వేవ్ పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేసింది.

Published on: Apr 12, 2026, 08:15:14 IST
Advertisement

Today weather : రానున్న రోజుల్లో ఎండల తీవ్రతపై భారీ హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). తాజా వాతావరణ బులెటిన్ ప్రకారం.. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరగనున్నాయి. ముఖ్యంగా వాయువ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉండగా, తూర్పు, మధ్య భారతదేశంలో ఈ వారం 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగవచ్చని ఐఎండీ పేర్కొంది. ఏప్రిల్ 13 తర్వాత ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయంటూ హీట్​వేవ్​ హెచ్చరికలను జారీ చేసింది.

ప్రాంతాల వారీగా వాతావరణ అంచనాలు..

దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి ఇలా..
దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి ఇలా..

1. ఈశాన్య, తూర్పు భారతదేశం:

వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావంతో హిమాలయ పశ్చిమ ప్రాంతాల్లో ఏప్రిల్ 15 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఏప్రిల్ 14 వరకు ఉరుములు, మెరుపులు, గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో ఏప్రిల్ 15 వరకు మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఏప్రిల్ 12న ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.

2. దక్షిణ భారతదేశం (తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక):

దక్షిణ ద్వీపకల్పంలో కూడా వాతావరణం మారుతోంది. ఉత్తర- దక్షిణ అంతర్గత కర్ణాటకలో ఏప్రిల్ 14, 15 తేదీల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళలో ఏప్రిల్ 13 వరకు, తీరప్రాంత కర్ణాటకలో రాబోయే మూడు రోజుల పాటు మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుంది. కాగా రాయలసీమ, కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో ఏప్రిల్ 17 వరకు వాతావరణం అత్యంత వేడిగా, ఉక్కపోతతో కూడి ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది.

ఐఎండీ హీట్​వేవ్​ అలర్ట్​- ఈ ప్రాంతాల్లో వడగాల్పులు..

ఒడిశా: ఏప్రిల్ 13, 14 తేదీల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఉంటాయి.

ఛత్తీస్‌గఢ్: ఏప్రిల్ 14 నుంచి 17 వరకు వడగాల్పులు వీస్తాయి.

తూర్పు మధ్యప్రదేశ్: ఏప్రిల్ 16, 17 తేదీల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది.

ఇతర ప్రాంతాలు: గంగానది పరీవాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్, సౌరాష్ట్ర, కచ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఏప్రిల్ 14 నుంచి 17 మధ్య కాలంలో వాతావరణం అత్యంత వేడిగా ఉంటుంది.

దేశ రాజధాని దిల్లీ పరిస్థితి..

దిల్లీ ప్రజలకు రాబోయే ఐదు రోజుల పాటు ఎటువంటి వాతావరణ హెచ్చరికలు లేవు. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. పగటిపూట గంటకు 15-25 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 35°C నుంచి 37°C మధ్య, కనిష్ట ఉష్ణోగ్రతలు 18°C నుంచి 20°C మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. ఉష్ణోగ్రతలు ఎంత మేర పెరిగే అవకాశం ఉంది?

వాయువ్య భారతదేశంలో 6-8 డిగ్రీలు, తూర్పు, మధ్య భారతదేశంలో 3-5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగవచ్చని ఐఎండీ అంచనా వేసింది.

2. వడగాల్పులు ఏ ఏ రాష్ట్రాల్లో వీస్తాయి?

ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 13 నుంచి 17 మధ్య వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

3. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది?

ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో ఏప్రిల్ 17 వరకు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఉక్కపోత అధికంగా ఉంటుంది.

4. ఎక్కడైనా వర్షాలు కురిసే అవకాశం ఉందా?

అసోం, మేఘాలయ, కర్ణాటక అంతర్గత ప్రాంతాల్లో రాబోయే కొద్ది రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe