'సెక్టోరల్- థీమాటిక్' మ్యూచువల్ ఫండ్స్​ అంటే ఏంటి? లాభాలేంటి? రిస్క్​లు ఏంటి?

మ్యూచువల్ ఫండ్లలో 'సెక్టోరల్, థీమాటిక్' ఫండ్‌లు అంటే ఏమిటి? వీటిల్లో ఇన్వెస్ట్​ చేస్తే వచ్చే లాభాలేంటి? కలిగే నష్టాలేంటి? అధిక రిస్క్ ఉన్నా, రాబడికి అవకాశం ఉన్న ఈ తరహా మ్యూచువల్​ ఫండ్స్​కి చెందిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 30, 2025 7:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు, మనం ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి.. ఎంత పెట్టుబడి పెట్టాలి? ఏ ఏఎంసీ (అసెట్​ మేనేజ్​మెంట్​ కంపెనీ)ని ఎంచుకోవాలి? అన్నిటికంటే ముఖ్యంగా, ఏ కేటగిరీ (ఉదాహరణకు, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్) ఫండ్‌ను ఎంపిక చేసుకోవాలి?

సెక్టోరల్​- థీమాటిక్​ మ్యూచువల్​ ఫండ్స్​..
సెక్టోరల్​- థీమాటిక్​ మ్యూచువల్​ ఫండ్స్​..

వివిధ రకాల ఫండ్ల కేటగిరీల్లో, పెట్టుబడిదారులు ఒక నిర్దిష్ట రంగానికి (సెక్టార్​) లేదా అంశానికి (కాన్సెప్ట్​) ఎక్స్‌పోజర్ పొందడానికి తరచుగా సెక్టోరల్ (రంగాల ఆధారిత)/థీమాటిక్ (అంశాల ఆధారిత) మ్యూచువల్ ఫండ్‌ల్లో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతుంటారు.

సెక్టోరల్, థీమాటిక్ ఫండ్‌లంటే ఏంటి?

సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్స్: ఈ తరహా మ్యూచువల్​ ఫండ్‌లు ఒకే ఒక రంగానికి చెందిన కంపెనీల్లో మాత్రమే పెట్టుబడి పెడతాయి. ఉదాహరణకు, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, బ్యాంకింగ్ లేదా ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలు. ఇవి కేవలం ఒకే రంగంపై దృష్టి పెట్టడం వల్ల, డైవర్సిఫికేషన్​ పరిమితంగా ఉంటుంది. దీని కారణంగా, వీటిలో సహజంగానే ఎక్కువ రిస్క్ ఉంటుంది.

థీమాటిక్ ఫండ్స్: ఇవి సెక్టోరల్ ఫండ్‌ల కంటే విస్తృతమైనవి! ఇవి ఒక నిర్దిష్ట థీమ్ (కాన్సెప్ట్​) ఆధారంగా స్టాక్‌లను ఎంచుకుంటాయి. ఉదాహరణకు మౌలిక సదుపాయాలు, సేవా పరిశ్రమలు, పీఎస్‌యూలు (ప్రభుత్వ రంగ సంస్థలు) లేదా ఎంఎన్‌సీలు (బహుళజాతి కంపెనీలు) వంటి అంశాలను ఎంచుకుంటాయి. ఇవి సెక్టోరల్ ఫండ్‌ల కంటే ఎక్కువ వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకే వీటిలో రిస్క్ కొంత తక్కువగా ఉంటుంది.

ఈ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనాలు ఏంటి?

గ్రోత్​ పొటెెన్షియల్​: చాలా సెక్టోరల్ ఫండ్‌లు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్‌లుగా ఉంటాయి. అంటే, ఫండ్ మేనేజర్‌లకు ఏ స్టాక్స్‌ను ఎంచుకోవాలి? దేనిని వదులుకోవాలి? అనే విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్న పెట్టుబడిదారులకు ఇది ఒక మంచి అవకాశం.

ట్రెండ్‌ను ఉపయోగించుకోవడం: ప్రస్తుతం మార్కెట్‌లో నడుస్తున్న ఒక ట్రెండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని పెట్టుబడిదారులు కోరుకుంటారు. ఉదాహరణకు, ఒక రంగంపై ఎక్కువ దృష్టి పెట్టినప్పుడు, మౌలిక సదుపాయాల రంగంలో ఉన్న ట్రెండ్‌ను ఉపయోగించుకోవాలని భావించవచ్చు.

సెక్టార్​పై నిబద్ధత: మీరు బలంగా నమ్మే ఒక అంశంలో (థీమ్​) పెట్టుబడి కొనసాగించడానికి ఈ ఫండ్‌లు వీలు కల్పిస్తాయి. ఉదాహరణకు, పర్యావరణం, సుస్థిరత కోసం కృషి చేసే ఒక వ్యక్తి తమ పోర్ట్‌ఫోలియోలో ఆ కాన్సెప్ట్​కి ఎక్కువ భాగం కేటాయించాలని అనుకోవచ్చు.

పోర్ట్‌ఫోలియోలో డైవర్సిఫికేషన్​: చాలా ఇతర మ్యూచువల్ ఫండ్‌లు వివిధ ఫండ్ హౌస్‌లలో ఒకే విధమైన రాబడిని ఇస్తాయి. ఉదాహరణకు, మీరు నిఫ్టీ100 ఫండ్‌ను ఎంచుకుంటే, చాలా ఫండ్‌లలో దాదాపు ఒకే రాబడిని ఆశించవచ్చు. అయితే, సెక్టోరల్ లేదా థీమాటిక్ ఫండ్‌లు మీ పోర్ట్‌ఫోలియోకు కొంత డైవర్సిటీని, ఉత్తేజాన్ని జోడిస్తాయి. ఫండ్ మేనేజర్ ఎంచుకున్న స్టాక్స్‌, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, మొత్తం ఆర్థిక వృద్ధి ఆధారంగా ఈ ఫండ్‌లు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

ఎంపికల విస్తృతి: సెక్టోరల్/థీమాటిక్ ఫండ్‌లను ఎంచుకోవడానికి మరొక కారణం, వీటిలో నూతన ఆవిష్కరణలు, అనేక కలయికలకు అవకాశం ఉండటం. ఒక ఫండ్ హౌస్ ఒక కేటగిరీలో ఒకే పథకాన్ని ప్రారంభించగలిగినప్పటికీ, ఒక ఏఎంసీ ఎన్ని వినూత్న కలయికలతోనైనా పథకాలను తీసుకురావడానికి పరిమితి లేదు.

ఏఎంఎఫ్ఐ (AMFI) డేటా ప్రకారం, అక్టోబర్ 31, 2025 నాటికి, సెక్టోరల్/థీమాటిక్ ఫండ్‌లు 231 పథకాలతో, రూ. 5.33 లక్షల కోట్ల ఏయూఎంను కలిగి ఉన్నాయి. వీటి ప్రజాదరణ ఎంత ఉందో దీని ద్వారా తెలుస్తోంది.

ఈ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు ఏంటి?

పెట్టుబడి రిస్క్: ఈ ఫండ్‌లు ఒక నిర్దిష్ట రంగం లేదా థీమ్‌లో మాత్రమే పూర్తిగా కేంద్రీకృతమై ఉంటాయి. అందువల్ల ఆ రంగంలో ఏదైనా సమస్య తలెత్తితే.. మొత్తం పోర్ట్‌ఫోలియో నష్టపోతుంది. అందుకే వీటిలో పెట్టుబడి పెట్టడం చాలా రిస్క్‌తో కూడుకున్నది.

కొన్నిసార్లు పరిమిత ఎంపికలు: కొన్ని రంగాలు కేవలం కొన్ని ముఖ్యమైన స్టాక్‌లకే పరిమితమై ఉంటాయి! మీరు ఒక రంగంలో పెట్టుబడి పెట్టానని భావించినప్పటికీ, అది కేవలం కొన్ని స్టాక్‌లలో పెట్టుబడి పెట్టినట్లే అవుతుంది. కొన్ని సెక్టోరల్ ఫండ్‌లు, ఉదాహరణకు ఐటీ సెక్టోరల్ ఫండ్‌లు, నేరుగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ను అనుసరిస్తాయి.

అదనపు పెట్టుబడి: చురుకైన పెట్టుబడిదారులుగా, మీరు ఇప్పటికే ఇతర ఫండ్‌లలో ఈ స్టాక్‌లను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు లార్జ్ క్యాప్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టి ఉంటే, మీరు ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ వంటి అగ్ర బ్యాంకుల స్టాక్‌లలో పెట్టుబడి పెట్టినట్లే. అటువంటప్పుడు, మళ్లీ బ్యాంకింగ్ సెక్టోరల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల ఈ స్టాక్‌లలో మీ ఎక్స్‌పోజర్ మరింత పెరుగుతుంది. అంటే, సెక్టోరల్/థీమాటిక్ ఫండ్‌లతో పాటు వివిధ కేటగిరీల ఫండ్‌ల మధ్య కొంత ఓవర్‌ల్యాప్ ఉండే అవకాశం ఉంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు మీరు మీ సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించాల్సి ఉంటుంది.)

News/News/'సెక్టోరల్- థీమాటిక్' మ్యూచువల్ ఫండ్స్​ అంటే ఏంటి? లాభాలేంటి? రిస్క్​లు ఏంటి?
News/News/'సెక్టోరల్- థీమాటిక్' మ్యూచువల్ ఫండ్స్​ అంటే ఏంటి? లాభాలేంటి? రిస్క్​లు ఏంటి?