వాట్సాప్‌లో 'గ్రూప్ మెసేజ్ హిస్టరీ' ఫీచర్- కొత్తగా చేరే వారికి.. ఇక పాత ముచ్చట్లు కూడా తెలుస్తాయి!

వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇకపై వాట్సాప్ గ్రూపుల్లో కొత్తగా చేరే సభ్యులు, తాము చేరకముందు జరిగిన సంభాషణలను చూసే అవకాశం ఉంటుంది! అడ్మిన్ల నియంత్రణలో ఉండే ఈ ఫీచర్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 20, 2026, 15:30:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిజీగా ఉండే వాట్సాప్ గ్రూపుల్లో మధ్యలో చేరడం అంటే, ఎలాంటి కాంటెక్ట్స్​ తెలియకుండానే చర్చల మధ్యలో అడుగు పెట్టడమే. ఈ సమస్యను పరిష్కరించడానికి వాట్సాప్ ‘గ్రూప్ మెసేజ్ హిస్టరీ’ అనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్​ ద్వారా గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లు, కొత్తగా చేరిన సభ్యులతో ఇటీవలి మెసేజ్‌లను పంచుకోవచ్చు. దీనివల్ల పాత మెసేజ్‌లను పదేపదే పంపమని అడగాల్సిన అవసరం లేకుండానే, గ్రూపులో ప్రస్తుతం జరుగుతున్న చర్చలను కొత్తవారు సులభంగా అర్థం చేసుకోవచ్చు!

వాట్సాప్​లో గ్రూప్ మెసేజ్ హిస్టరీ ఫీచర్​..! (Meta)
వాట్సాప్​లో గ్రూప్ మెసేజ్ హిస్టరీ ఫీచర్​..! (Meta)

గతంలో, ఎవరైనా వాట్సాప్ గ్రూపులో చేరినప్పుడు, వారు చేరిన తర్వాత వచ్చిన మెసేజ్‌లను మాత్రమే చూడగలిగేవారు. దీనివల్ల ముఖ్యంగా ఆఫీస్ గ్రూపులు, కమ్యూనిటీ ఫోరమ్‌లు లేదా పాత ఫ్యామిలీ చాట్స్‌లో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడేది. ముఖ్యమైన వివరాల కోసం సభ్యులు పాత మెసేజ్‌లను మళ్లీ పంపమని లేదా స్క్రీన్ షాట్స్ తీసి పంచుకోమని అడగాల్సి వచ్చేది. ఈ కొత్త ఫీచర్ అటువంటి ఇబ్బందులను తగ్గించి, కొత్త సభ్యుల రాకను సులభతరం చేస్తుంది.

ఈ వాట్సాప్ గ్రూప్ మెసేజ్ హిస్టరీ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

గ్రూప్ మెసేజ్ హిస్టరీ ఫీచర్‌తో కొత్త సభ్యుడిని యాడ్ చేసే సమయంలో ఇటీవలి మెసేజ్‌లను షేర్ చేయాలా వద్దా అనేది అడ్మిన్లే నిర్ణయిస్తారు.

అడ్మిన్ నియంత్రణ: ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా పనిచేయదు. అడ్మిన్లు స్వయంగా మెసేజ్ హిస్టరీని పంపాలని నిర్ణయించుకోవాలి.

మెసేజ్‌ల పరిమితి: ఎన్ని మెసేజ్‌లు పంచుకోవాలో కూడా అడ్మిన్లే నిర్ణయించవచ్చు. ఇది 25 నుంచి మొదలై గరిష్టంగా 100 మెసేజ్‌ల వరకు ఉంటుంది. దీనివల్ల మొత్తం చాట్ హిస్టరీని షేర్ చేయకుండానే, కేవలం ఇటీవలి సందర్భాన్ని మాత్రమే వివరించడానికి వీలవుతుంది.

నిరంతర అధికారం: సాధారణ సభ్యులు హిస్టరీని షేర్ చేయలేకపోయినా, అడ్మిన్లకు మాత్రం ఈ ఫీచర్‌ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసే పూర్తి అధికారం ఉంటుంది.

వాట్సాప్ గ్రూప్ మెసేజ్ హిస్టరీ ఫీచర్- ప్రైవసీ, భద్రత..

ఈ కొత్త ఫీచర్ వల్ల తమ ప్రైవసీ విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని వాట్సాప్ స్పష్టం చేసింది.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్: షేర్ చేసిన పాత మెసేజ్‌లకు కూడా పూర్తిస్థాయిలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ప్రొటెక్షన్​ ఉంటుంది. అంటే గ్రూపు సభ్యులు తప్ప మరెవరూ వీటిని చదవలేరు.

క్లారిటీ, నోటిఫికేషన్లు: గ్రూపులో ఎవరితోనైనా మెసేజ్ హిస్టరీని షేర్ చేసినప్పుడు, గ్రూపు సభ్యులందరికీ వాట్సాప్ నోటిఫికేషన్ పంపుతుంది.

గుర్తింపు: హిస్టరీ ద్వారా పంచుకున్న మెసేజ్‌లు ఒరిజినల్ టైమ్‌స్టాంప్ (సమయం), పంపిన వారి వివరాలను కలిగి ఉంటాయి. అలాగే ఇవి సాధారణ మెసేజ్‌ల కంటే భిన్నంగా కనిపిస్తాయి, తద్వారా అవి హిస్టరీ ద్వారా వచ్చినవని స్పష్టంగా తెలుస్తుంది.

వాట్సాప్ గ్రూప్ మెసేజ్ హిస్టరీ ఫీచర్- ప్రపంచవ్యాప్తంగా..

వాట్సాప్ ఈ గ్రూప్ మెసేజ్ హిస్టరీ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం ప్రారంభించింది. ఇది అండ్రాయిడ్​, ఐఓఎస్​ డివైజ్‌లలో అందుబాటులో ఉంటుంది. తమ ఫోన్లలో ఈ అప్‌డేట్ కనిపించని వారు, యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, వారి ప్రాంతంలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More