...
...
Next Story

కర్ణాటక పోలీస్ శాఖలో కలకలం- అసభ్యకర వీడియో కేసులో డీజీపీ సస్పెండ్​

కర్ణాటక డీజీపీ కెే రామచంద్రరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఓ మహిళతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఓ వీడియో బయటకు రావడం ఇందుకు కారణం. తప్పు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే, ఆ వీడియో ఏఐ అని రామచంద్రరావు చెబుతున్నారు.

Published on: Jan 20, 2026, 10:30:15 IST
Advertisement

కర్ణాటక పోలీస్ విభాగంలో ప్రకంపనలు రేగుతున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) కే రామచంద్రరావుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఒక మహిళతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టు ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మహిళలతో రామచంద్రరావు మాట్లాడుతున్నట్టుగా ఉన్న అనేక ఆడియో క్లిప్పులు కూడా వెలుగులోకి వచ్చాయి.

కర్ణాటక డీజీపీ కెే రామచంద్రరావు (PTI)
కర్ణాటక డీజీపీ కెే రామచంద్రరావు (PTI)

ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణకు ఆదేశించిన మరుసటి రోజే రామచంద్రరావుపై వేటు పడింది.

సీఎం సిద్ధరామయ్య సీరియస్..

బెళగావిలో విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఈ ఘటనపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "సోమవారం నాడే ఈ వీడియో క్లిప్పులు నా దృష్టికి వచ్చాయి. మూడు వేర్వేరు క్లిప్పులను కలిపి ఈ వీడియో రూపొందించినట్లు తెలుస్తోంది. అధికారి ఎంతటి వారైనా, హోదా ఎంత పెద్దదైనా.. తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు. చట్టానికి ఎవరూ అతీతులు కారు," అని సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు.

నకిలీ వీడియో.. కుట్ర అంటున్న రామచంద్రరావు

ఈ ఆరోపణలను రామచంద్రరావు పూర్తిగా తోసిపుచ్చారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న కుట్రగా ఆయన దీన్ని అభివర్ణించారు.

"నేను కూడా ఆ వీడియో చూశాను. అది పూర్తిగా ఏఐ టెక్నాలజీతో సృష్టించిన మేనిపులేటెడ్ వీడియో. ఎనిమిదేళ్ల క్రితం నేను బెళగావిలో ఉన్నప్పటి పాత దృశ్యాలను వక్రీకరించి ఇలా తయారు చేశారు. నాకు దీనితో ఎలాంటి సంబంధం లేదు," అని ఆయన అన్నారు.

వివాదాల రామచంద్రరావు..

నగదు సీజ్ వివాదం (2014): మైసూర్ ఐజీపీగా ఉన్న సమయంలో కేరళ వ్యాపారుల నుంచి పోలీసులు రూ. 2.27 కోట్లు స్వాధీనం చేసుకుని, రికార్డుల్లో మాత్రం కేవలం రూ. 20 లక్షలే చూపించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దోపిడీలో రామచంద్రరావు ప్రమేయం ఉందని సీఐడీ విచారణలో వెల్లడైంది.

కుటుంబ వివాదాలు: ఆయన కుమార్తె (స్టెప్ డాటర్), నటి రన్యా రావుపై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

రాజకీయ దుమారం..

ఈ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. "కాంగ్రెస్ పాలనలో కర్ణాటకలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం. డీజీపీ స్థాయి అధికారి కార్యాలయంలోనే ఇలాంటి పనులు చేస్తుంటే మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుంది?" అని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు.

ప్రస్తుతానికి ఈ వీడియోలో ఉన్నది ఒక మహిళా లేక అంతకంటే ఎక్కువ మందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫేక్ వీడియో అని రామచంద్రరావు వాదిస్తున్న నేపథ్యంలో, ఫోరెన్సిక్ రిపోర్టు ఈ కేసులో అత్యంత కీలకం కానుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks