...
...
Next Story

Assam floods : ప్రతి వర్షాకాలంలోనూ మునిగిపోతున్న అసోం! వరదలకు కారణం ఏంటి? ప్రజలను, ప్రాణులను కాపాడేది ఎలా?

Assam floods live updates : ప్రతియేటా వర్షాకాలంలో భారతీయులు సహజంగా వినే మాట.. ‘అసోం వరదలు’! ఇటీవలి కాలంలో ఆ రాష్ట్రంలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇందుకు కారణాలు ఏంటి? అసోం ప్రజలను, ప్రాణులను కాపాడేది ఎలా? నిపుణుల మాటల్లో..

Published on: Jul 28, 2026, 06:46:07 IST
Advertisement

అసోంను మళ్లీ వరద ముంచెత్తింది. శివసాగర్ నుంచి తిన్‌సుకియా వరకు 15 జిల్లాల్లో ప్రళయం సృష్టించిన ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 68 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 5.25 లక్షల మంది ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది. బ్రహ్మపుత్రతో పాటు దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో పాటు భారత సైన్యం కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నాయి.

అసోం వరదల్లో ప్రజల పరిస్థితి ఇలా.. (PTI)
అసోం వరదల్లో ప్రజల పరిస్థితి ఇలా.. (PTI)

వరదల దాటికి 6 జిల్లాలు అత్యంత ఘోరంగా దెబ్బతింది. ఈ జిల్లాల్లోనే దాదాపు 4.45 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రైల్వే ట్రాక్లు నీట మునిగిపోవడంతో పలు రైళ్లను రద్దు చేయడం లేదా మళ్లించడం చేశారు. తేయాకు తోటలు, పంట పొలాలు జలమయమయ్యాయి. గౌహతి సమీపంలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

అయితే దాదాపు ప్రతి వర్షాకాలంలోనూ అసోం మునిగిపోతూ ఉంటుంది! గడిచిన కొన్నేళ్లల్లో ఇది మరింత తీవ్రంగా మారింది. ఇందుకు కారణాలేంటి? దీనిని ఎలా అడ్డుకోవచ్చు?

ఇది కొత్త సమస్య కాదు!

రాష్ట్రీయ బార్ ఆయోగ్ (జాతీయ వరద కమిషన్) గణాంకాల ప్రకారం అసోం భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 40 శాతం ప్రాంతం వరద ముప్పులో ఉన్నదే. దశాబ్దాలుగా రాష్ట్రం ఈ సమస్యను ఎదుర్కొంటోంది. 2018, 2020, 2021, 2022, 2024 సంవత్సరాల్లో అసోం భారీ వరదలతో చిగురుటాకులా వణికిపోయింది. అయితే, ప్రతి సంవత్సరం ఇక్కడ వరదలు ఎందుకు వస్తున్నాయి? దీనికి కేవలం కురిసే వర్షాలే కారణమా? అంటే కాదు, నది స్వభావం, రాష్ట్ర భౌగోళిక అమరికలో కూడా కీలక సమాధానాలు ఉన్నాయి.

వేగం తగ్గడం.. పూడిక పెరగడం!

అసోం ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం బ్రహ్మపుత్ర నది సగటు వార్షిక్ డిశ్చార్జ్ సుమారు 20,000 క్యూమెక్కులు (ఒక క్యూమెక్ అంటే సెకనుకు 1,000 లీటర్ల నీటి ప్రవాహం).

ప్రవాహ వేగం, ప్రవాహంలో కొట్టుకొచ్చే పూడికే అసలు సమస్య అని గౌహతి యూనివర్సిటీ ప్రొఫెసర్, నదీ మైదానాల పరిశోధకుడు ధృవజ్యోతి సహారియా వివరించారు. పాసిఘాట్ దాటిన తర్వాత ధుబ్రీ వరకు నది ప్రవాహ వాలు తగ్గుతుంది. నీటి వేగం తగ్గడంతో, కొండల నుంచి తనతో పాటు మోసుకొచ్చిన ఇసుక, మట్టిని మోసే శక్తి నదికి తగ్గుతుంది.

దీనివల్ల ప్రతి ఏటా భారీ పరిమాణంలో ఇసుక, మేటలు మైదాన ప్రాంతాల్లో పేరుకుపోతాయి. కొండల నుంచి వచ్చే పూడిక ప్రమాణం ఏటికేటికీ పెరుగుతోందని, ఇది కేవలం ప్రకృతిసిద్ధంగా జరుగుతున్న మార్పు మాత్రమే కాదని ఆయన హెచ్చరించారు.

విచక్షణారహితంగా చెట్ల నరికివేత!

వరదలు, కొండచరియలు విరిగిపడటానికి ఎగువ ప్రాంతాల్లో విచక్షణారహితంగా చెట్లను నరకడమే ప్రధాన కారణమని ప్రొఫెసర్ సహారియా తెలిపారు. లఖింపూర్, బిశ్వనాథ్, ధేమాజీ వంటి జిల్లాలు ఈ ముప్పునకు ఎక్కువగా గురవుతున్నాయి. ఇక్కడి సియాంగ్, జియాధాల్, సుబన్‌సిరి, రంగనాడి, దిస్రంగ్ వంటి ఉపనదులు కొండ ప్రాంతాల నుంచి వస్తాయిని తెలిపారు. ఆ కొండల్లోని ఇసుక నేలలు సులభంగా కోతకు గురవుతాయని వివరించారు.

చెట్ల నరికివేత వల్ల కొద్దిపాటి వర్షానికే కొండచరియలు విరిగిపడటం, మట్టి కొట్టుకుపోవడం ఎక్కువైందని ఆయన విశ్లేషించారు. మన అధికారులు నది దిగువ ప్రాంతాల్లో గట్లు నిర్మించడంపైనే దృష్టి పెట్టారని, అంతకంటే ఎగువ ప్రాంతాల్లో మట్టి కోతను అరికట్టే చర్యలు చేపట్టడం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

వర్షపాతం ఎంత అంటే..

భారతదేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో అసోం ఒకటి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం రాష్ట్రంలో సగటున ఏడాదికి 2,800 నుంచి 3,000 ఎంఎం వర్షపాతం నమోదువుతుంది. ఇందులో 70 శాతానికి పైగా వర్షపాతం నైరుతి రుతుపవనాల (జూన్ - సెప్టెంబర్) సమయంలోనే కురుస్తుంది.

బంగాళాఖాతం నుంచి దిగువ వాతావరణంలోకి వీచే నైరుతి గాలుల వల్ల తేమ రావడం, అసోం భౌగోళిక నిర్మాణం, ఈశాన్య ప్రాంతంలో రుతుపవన ద్రోణి నిలకడగా ఉండటం వల్ల ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త సునీత్ దాస్ వివరించారు.

దీనికి తోడు వాతావరణ మార్పుల వల్ల వర్షాల తీవ్రత గణనీయంగా పెరిగిందని, ఫలితంగా వరదల ఉధృతి కూడా మునుపెన్నడూ లేనంతగా పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాలం చెల్లిన గట్లే శాపమా?

వరదలను నిరోధించడానికి అసోం ప్రభుత్వం దశాబ్దాలుగా గట్ల నిర్మాణంపైన ఆధారపడింది. 1950ల నుంచి ఇప్పటివరకు బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల పొడవునా 423 గట్లను నిర్మించారు. అయితే, ఇందులో దాదాపు 295 గట్లకు కాలం చెల్లిపోయింది. దీనితో వరద నీటి ఒత్తిడికి ఇవి గండిపడి ఊళ్లకు ఊళ్లే మునిగిపోతున్నాయి.

బ్రహ్మపుత్ర తన ప్రవాహ మార్గాన్ని నిరంతరం మార్చుకునే స్వభావం కలిగినది! నది తన దిశను మార్చుకున్నప్పుడు కేవలం కృత్రిమ గట్లు దానిని ఆపలేవని సహారియా వివరించారు.

గణాంకాల ప్రకారం 2013 నుంచి 2022 మధ్య అసోం వరదల్లో 838 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క 2022లోనే 181 మంది మరణించారు. 1950లలో ఏటా సగటున 8.6 లక్షల మంది వరదల బారిన పడగా, 2000ల నాటికి ఆ సంఖ్య 45 లక్షలకు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

శాశ్వత పరిస్కారం ఏంటి?

కేవలం తాత్కాలిక ఉపశమన చర్యలు సరిపోవని, బ్రహ్మపుత్ర నది వ్యవస్థ మొత్తాన్ని ఒకే యూనిట్‌గా తీసుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని నిపుణులు కోరుతున్నారు. వరదలతో కలిసి జీవించడం ప్రజలకు అలవాటు కావాలని ప్రొఫెసర్ సహారియా అభిప్రాయపడ్డారు. అసోంలోని ‘మిసింగ్’ గిరిజన తెగ ప్రజలు సాంప్రదాయబద్ధంగా వరదలు తట్టుకునేలా ఎత్తైన వెదురు వేదికలపై ఇళ్లను నిర్మించుకుంటారు. అయితే ఆధునిక నిర్మాణాలు పెరగడం, వరద మైదానాల్లో విచక్షణారహితంగా ఇళ్లు కట్టుకోవడంతో నష్టం తీవ్ర స్థాయికి చేరుతోంది.

ప్రస్తుతం అసోం ప్రభుత్వం తక్షణ ఉపశమన చర్యలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి సారించింది. జోర్‌బాట్ ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్స్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ. 150 కోట్ల ప్రాజెక్టును కూడా ప్రకటించింది.

ఏదేమైనా, ప్రకృతి కోపానికి మానవ తప్పిదాలు తోడైతే ఫలితాలు ఎంత తీవ్రంగా ఉంటాయనడానికి అసోం వరదలు ఒక స్పష్టమైన ఉదాహరణ.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe