ఒక్క సంవత్సరంలో 2 లక్షల సేల్స్​- హ్యుందాయ్​ క్రెటాకు ఎందుకు ఇంత క్రేజ్​?

భారత రోడ్లపై రారాజుగా వెలుగొందుతున్న హ్యుందాయ్ క్రెటా, 2025లో 2 లక్షల విక్రయాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. పదేళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న ఈ ఎస్‌యూవీ సక్సెస్ వెనుక ఉన్న కీలక కారణాలు ఇవే..

Published on: Jan 02, 2026 5:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో ఏ రోడ్డు మీద చూసినా హ్యుందాయ్ క్రెటా కార్లు కచ్చితంగా దర్శనమిస్తాయి! ఇది మన భ్రమ కాదు.. గణాంకాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2025 క్యాలెండర్ ఇయర్‌లో హ్యుందాయ్ సంస్థ ఏకంగా 2 లక్షలకు పైగా క్రెటా యూనిట్లను విక్రయించి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంటే సగటున రోజుకు దాదాపు 550 క్రెటా కార్లు అమ్ముడయ్యాయన్నమాట!

హ్యుందాయ్​ క్రెటా..
హ్యుందాయ్​ క్రెటా..

భారత మార్కెట్లోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయినా, ఫ్యామిలీ ఎస్​యూవీ క్రెటా క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడమే కాకుండా రోజురోజుకూ పెరుగుతోంది. అసలు ఈ ఎస్‌యూవీకి ఇంతలా జనం ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు? ఈ అసాధారణ విజయానికి గల కారణాలను విశ్లేషిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి.

హ్యుందాయ్​ క్రెటాకు ఎందుకు ఇంత క్రేజ్​?

హ్యుందాయ్​ క్రెటా ఎస్​యూవీ భారత మార్కెట్లోకి వచ్చి పదేళ్లు పూర్తయింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కస్టమర్లలో ఈ బ్రాండ్ పట్ల బలమైన నమ్మకం ఏర్పడింది. సౌకర్యం, విశ్వసనీయత, సర్వీస్ అనుభవం విషయంలో క్రెటా ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది. గతంలో చిన్న కార్ల నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారు మాత్రమే క్రెటాను ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు నేరుగా మొదటి కారుగానే క్రెటాను కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

అందరినీ ఆకట్టుకునే డిజైన్..

క్రెటా సక్సెస్‌లో దాని డిజైన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటు మరీ అగ్రెసివ్​గా కాకుండా, అటు మరీ సాదాసీదాగా లేకుండా.. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా దీని లుక్ ఉంటుంది. సిటీ రోడ్లపై తిరిగే వారికైనా, ఫ్యామిలీతో కలిసి లాంగ్ ట్రిప్స్ వెళ్లే వారికైనా ఇది పర్ఫెక్ట్​గా సరిపోతుంది. అందుకే యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఈ కారును ఇష్టపడుతున్నారు.

ఇంజిన్ ఆప్షన్లలో వైవిధ్యం..

కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఈ హ్యుందాయ్​ క్రెటా ఎస్​యూవీలో విభిన్న ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. ఇందులో మూడు రకాల ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి:

నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్

టర్బో-పెట్రోల్

డీజిల్ పెట్రోల్.

డీజిల్ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. ఆటోమేటిక్ కావాలనుకునే వారి కోసం పెట్రోల్‌లో ఐవీటీ, డీజిల్‌లో టార్క్ కన్వర్టర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇక పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం టర్బో-పెట్రోల్‌లో డ్యుయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తోంది.

అధునాతన ఫీచర్లు..

ప్రస్తుత కాలంలో కార్ల కొనుగోలులో ఫీచర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. 2025లో అమ్ముడైన కార్లలో సన్‌రూఫ్ ఉన్న వేరియంట్ల వాటానే అత్యధికంగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో టెక్నాలజీ, కంఫర్ట్ విషయంలో బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీ క్రెటా టాప్ ఎండ్ వేరియంట్లు కస్టమర్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి.

అదే సమయంలో మైలేజీకి ప్రాధాన్యత ఇచ్చే వారు ఇప్పటికీ డీజిల్ వేరియంట్ల వైపే మొగ్గు చూపుతున్నారు.

ఎలక్ట్రిక్ వేరియంట్‌తో భవిష్యత్తు వైపు అడుగులు..

మారుతున్న కాలానికి అనుగుణంగా క్రెటా ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలోనూ అందుబాటులోకి వచ్చింది. క్రెటా ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో (42 కేడబ్ల్యూహెచ్​, 51.4 కేడబ్ల్యూహెచ్​) లభిస్తోంది. ఇవి వరుసగా 420 కి.మీ, 510 కి.మీ రేంజ్‌ను అందిస్తాయి. పర్యావరణ హితంగా ఉండాలనుకునే వారికి, అలాగే అదే క్రెటా బ్రాండ్ ఇమేజ్ కావాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా మారింది.

మొత్తానికి పదేళ్ల నమ్మకం, ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లు, విభిన్న ఇంజిన్ ఆప్షన్లు అన్నీ కలిసి క్రెటా ఎస్​యూవీని భారత ఆటోమొబైల్ రంగంలో ఎదురులేని ఎస్‌యూవీగా నిలబెట్టాయి!