Investment tips : మీ పోర్ట్​ఫోలియో ఇలా ఉంటే.. ఏ యుద్ధం వచ్చినా, ఏం జరిగినా లాభాలు ఆగవు!

Investment tips in Telugu : స్టాక్ మార్కెట్ ఊగిసలాటలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇది మీకోసమే! ఈక్విటీ, డెట్, బంగారం కాంబినేషన్‌తో సరైన అసెట్ అలోకేషన్ పాటించి, ఏ వయసు వారు ఎలా పెట్టుబడులు మళ్లించాలో నిపుణుల సలహాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 26, 2026, 10:00:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత కొంతకాలంగా నిఫ్టీ50 ఇండెక్స్‌తో పాటు విస్తృత షేర్ మార్కెట్ తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురికావడం మీ పోర్ట్‌ఫోలియోను కూడా ప్రభావితం చేసిందా? మార్కెట్‌లో తలెత్తే ఇటువంటి అనిశ్చిత పరిస్థితులను తట్టుకోవడానికి భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి? మన పెట్టుబడులపై వచ్చే రాబడి ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంతో పాటు రిస్క్, నష్టభయాలను నియంత్రణలో ఉంచుకోవడానికి ఏమైనా ప్రత్యేక మార్గాలు ఉన్నాయా?

బలమైన పోర్ట్​ఫోలియో అంటే ఇలా ఉండాలి..
బలమైన పోర్ట్​ఫోలియో అంటే ఇలా ఉండాలి..

ఇక్కడే సరైన 'అసెట్ అలోకేషన్' ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కేవలం ఒకే ఒక్క సెగ్మెంట్​పై మన ఇన్వెస్ట్‌మెంట్ ఆధారపడకుండా, నిధులను వేర్వేరు రకాల పెట్టుబడుల్లోకి మళ్లించడమే దీని ముఖ్య ఉద్దేశం. మార్కెట్ తీవ్రమైన ఒడుదొడుకుల్లో ఉన్నప్పుడు వివిధ రకాల ఇన్వెస్ట్‌మెంట్లు వేర్వేరు రీతిలో స్పందిస్తాయి. అందుకే సమతుల్యమైన 'డైవర్సిఫికేషన్' పాటించాలని ఆర్థిక నిపుణులు నిరంతరం సూచిస్తుంటారు.

ఇందుకోసం మీ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలు (షేర్లు/మ్యూచువల్ ఫండ్స్), డెట్ ఇన్​స్ట్రుమెంట్లు (బాండ్లు/ఫిక్స్డ్ డిపాజిట్లు), బంగారం (గోల్డ్) సరైన నిష్పత్తిలో ఉండాలి. ఇది మీ సుదీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చడానికి దోహదపడటమే కాకుండా, మార్కెట్ కుదేలైన సమయాల్లో మీ పెట్టుబడులకు బలమైన రక్షణ కవచంలా నిలుస్తుంది.

వేర్వేరు విభాగాల ప్రాముఖ్యత ఏంటి?

ప్రతి ఇన్వెస్ట్‌మెంట్ విభాగానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఉదాహరణకు, దీర్ఘకాలంలో సంపదను వేగంగా సృష్టించడానికి, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి ఈక్విటీలు ప్రధాన సాధనంగా పనిచేస్తాయి. మరోవైపు, డెట్ సాధనాలు మీ పోర్ట్‌ఫోలియోకు అవసరమైన లిక్విడిటీని (నగదు లభ్యత), స్థిరత్వాన్ని, ఊహించదగిన ఆదాయాన్ని అందిస్తాయి. ఇక బంగారం విషయానికి వస్తే, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ క్షీణత. అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నుంచి మన ఇన్వెస్ట్‌మెంట్‌ను కాపాడే సురక్షితమైన రక్షణ సాధనంగా పనిచేస్తుంది.

ఈ విధానంపై 'అవిసా వెల్త్ క్రియేటర్స్' చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (సీఎఫ్​ఏ) ఆదిత్య అగర్వాల్ కీలక విషయాలను వివరించారు.

"సుదీర్ఘకాలంలో మనం పొందే ఇన్వెస్ట్‌మెంట్ ఫలితాలను నిర్దేశించే అత్యంత కీలకమైన అంశం అసెట్ అలోకేషన్. మనం ఎంచుకునే వ్యక్తిగత షేర్లు లేదా ఫండ్ల కంటే కూడా ఈ కేటాయింపే అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈక్విటీలు సుదీర్ఘకాలంలో సంపదను సృష్టిస్తూ ద్రవ్యోల్బణాన్ని దాటి రాబడులు అందిస్తే.. డెట్ సాధనాలు మార్కెట్ పతన సమయాల్లో పోర్ట్‌ఫోలియోను కాపాడతాయి. ఇక బంగారం ద్రవ్యోల్బణం, కరెన్సీ బలహీనత నుంచి రక్షణ కల్పిస్తుంది. విభిన్న మార్కెట్ సైకిళ్లలో ఇవి వేర్వేరుగా పనిచేస్తాయి కాబట్టి, మూడింటినీ తగిన నిష్పత్తిలో కలిపి ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గి స్థిరమైన రాబడులు వస్తాయి," అని ఆదిత్య అగర్వాల్ వివరించారు.

వయస్సును బట్టి పోర్ట్‌ఫోలియో మార్చుకోవడం ఎందుకు అవసరం?

ఒకే రకమైన అసెట్ అలోకేషన్ ప్రణాళిక జీవితాంతం పనిచేయదు. మనుషుల వయస్సు పెరుగుతున్న కొద్దీ, వారి జీవితంలో బాధ్యతలు, ఆర్థిక ప్రాధాన్యతలు మారుతుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు మీ పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకుని, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేస్తుండాలి.

ఈ అంశంపై ఆదిత్య మరింత సమాచారం ఇస్తూ:

"అందరికీ ఒకే రకమైన ఇన్వెస్ట్‌మెంట్ సూత్రం వర్తించదు. ఇన్వెస్టర్ వారి ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి సమయం, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఈ కేటాయింపులు చేసుకోవాలి. వయస్సు పెరుగుతున్న కొద్దీ పెట్టుబడులలో రిస్క్ తగ్గించుకుంటూ సురక్షితమైన మార్గాల వైపు మళ్లాలి. ఉదాహరణకు, సుదీర్ఘ సమయం ఉండే 25 ఏళ్ల యువ ఇన్వెస్టర్.. 80% ఈక్విటీ, 10% డెట్, 10% బంగారంలో కేటాయించుకోవచ్చు. ఇది వారి సంపదను గరిష్టంగా పెంచడానికి సహకరిస్తుంది. ఇక ఆదాయం సంపాదించే కీలక దశలో ఉన్న 45 ఏళ్ల వ్యక్తి.. 60% ఈక్విటీ, 30% డెట్, 10% గోల్డ్ ఎంచుకోవడం ద్వారా గ్రోత్, రక్షణ రెండింటినీ బ్యాలెన్స్ చేయవచ్చు," అని తెలిపారు.

"అలాగే రిటైర్మెంట్ దశకు చేరుకున్న 65 ఏళ్ల వృద్ధులకు ప్రతినెల స్థిరమైన ఆదాయం, అసలు పెట్టుబడికి రక్షణ చాలా అవసరం. కాబట్టి వారు 20-25% ఈక్విటీ, 60-70% డెట్, 5-10% బంగారం కేటాయించుకోవడం సురక్షితమైన నిర్ణయం. వయస్సుతో సంబంధం లేకుండా, ప్రతి ఇన్వెస్టర్ ఏడాదికి ఒకసారి తమ పోర్ట్‌ఫోలియోను పునఃసమీక్షించుకుని సరిచూసుకోవాలి" అని ఆయన సూచించారు.

సారాంశం ఏంటంటే.. అసెట్ అలోకేషన్ అనేది మార్కెట్ హెచ్చుతగ్గులను ముందే ఊహించడం కోసం కాదు, భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి మన పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేయడం! గ్రోత్, స్థిరత్వం, రక్షణ మూడింటి మధ్య సరైన సమతుల్యత పాటించడం ద్వారా మార్కెట్ కుదుపులను తట్టుకుని అద్భుతమైన రాబడులు సాధించవచ్చు.

(గమనిక- మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మెరుగైన ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలు తీసుకోవడానికి నిపుణులైన సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More