Mutual Fund SIP : రిటర్నులు రావట్లేదని మ్యూచువల్ ఫండ్ ఎస్​ఐపీ ఆపేస్తున్నారా? పెద్ద తప్పు చేసినట్టే!

Mutual fund tips in Telugu : స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలను మధ్యలోనే నిలిపివేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులతోనే మెరుగైన లాభాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Published on: Aug 10, 2026, 16:20:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మ్యూచువల్ ఫండ్లలో సిస్టెమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్​ఐపీ) ద్వారా క్రమంగా పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ.. వాటిని మధ్యలోనే ఆపేస్తున్న వారి రేషియో కూడా క్రమంగా పెరుగుతోంది! స్టాక్ మార్కెట్లో నెలకొన్న హెచ్చుతగ్గుల కారణంగానే చాలామంది ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మ్యూచువల్​ ఫండ్ ఎస్​ఐపీ ఆపేస్తున్నారా? (AI-generated image)
మ్యూచువల్​ ఫండ్ ఎస్​ఐపీ ఆపేస్తున్నారా? (AI-generated image)

మదుపర్లు తొందరపడి తగినంత సమయం ఇవ్వకుండానే ఎస్ఐపీలను రద్దు చేసుకుంటున్నట్లు డేటా స్పష్టం చేస్తోంది. తక్కువ ఖర్చుతో కూడిన డైరెక్ట్ ప్లాన్లలో ఐదేళ్లకు పైగా కొనసాగే ఎస్ఐపీలు ఎఫ్​వై26 నాటికి సుమారు 35 శాతం వరకు తగ్గాయి. అలాగే 4 నుంచి 5 సంవత్సరాల కాలం గల ఎస్ఐపీలు 23 శాతం పడిపోగా, 3 నుంచి 4 సంవత్సరాల కాలం నాటివి ఏకంగా 56 శాతం తగ్గాయి. అయితే రెండేళ్లలోపు నడుస్తున్న ఎస్ఐపీలు మాత్రం సుమారు 19 శాతం మేర పెరగడం గమనార్హం.

ఈ పరిస్థితిపై మాట్లాడుతూ.. "గత 12 నుంచి 24 నెలల్లో మార్కెట్లోకి వచ్చిన మదుపర్లు అంతకుముందు ఉన్న రెండు మూడేళ్ల రిటర్న్‌లను చూసి వస్తున్నారు. కానీ ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు గత కాలంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి," అని నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ప్రెసిడెంట్, డిప్యూటీ సీఈఓ సౌగత ఛటర్జీ తెలిపారు.

గత కొద్ది కాలంగా మార్కెట్లు ఒకే శ్రేణిలో కదలాడుతుండటంతో ఎస్ఐపీల ద్వారా వచ్చే లాభాలు మందగించాయి. నిఫ్టీ 50 సూచీ సెప్టెంబర్ 2024 గరిష్ట స్థాయి నుంచి 6 శాతానికి పైగా పడిపోయింది. నితో ఎస్ఐపీలను నిలిపివేసే వారి సంఖ్య పెరిగింది. ఎఫ్​నై27 మొదటి త్రైమాసికంలో సిప్ క్లోజర్ రేషియో సగటున 96 శాతానికి చేరింది. అయితే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలు అనేవి కేవలం దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం రూపొందించినవని, స్వల్పకాలిక నష్టాలను చూసి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కాలం గడిచే కొద్దీ నష్టాల ముప్పు తగ్గుదల..

పెట్టుబడి కాలం పెరిగే కొద్దీ మ్యూచువల్​ ఫండ్ ఎస్ఐపీలలో నష్టపోయే అవకాశం చాలావరకు తగ్గుతుందని గణాంకాలు చెబుతున్నాయి. నిఫ్టీ 50 సూచీని పరిశీలిస్తే, రెండేళ్ల ఎస్ఐపీలలో 14.2 శాతం నెగెటివ్ రిటర్న్‌లను ఇచ్చాయి. అదే మూడేళ్లకు వచ్చేసరికి అది 5.9 శాతానికి, ఐదేళ్లకు 0.5 శాతానికి పడిపోయింది. ఇక ఏడేళ్ల కాలం పాటు కొనసాగించిన ఎస్ఐపీల్లో నష్టపోయిన దాఖలాలు లేవు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాలలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. దీర్ఘకాలంలో పెట్టుబడి ఉంటే సగటు రిటర్నులు స్థిరంగా వస్తాయని నిపుణులు భరోసా ఇస్తున్నారు.

మధ్యలో ఆపేస్తే జరిగే నష్టమేంటి?

కొన్ని నెలల పాటు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీని నిలిపివేసి తిరిగి ప్రారంభిస్తే ఆ టార్గెట్ గడువు కొంత ఆలస్యం అవుతుంది. అయితే అప్పటివరకు ఇన్వెస్ట్ చేసిన మొత్తం కాంపౌండింగ్ ద్వారా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి, ఆగిపోయిన కాలానికి తగినట్లుగా లక్ష్యసాధనలో కొద్దిపాటి జాప్యం జరుగుతుంది.

ఈ ప్రవర్తనపై విశ్లేషిస్తూ.. "యువ మదుపర్లు తరచూ యాప్‌లలో గత ఏడాది రిటర్న్‌లను చూసి అవే వస్తాయని ఆశపడుతున్నారు. వాటిని దీర్ఘకాలిక లక్ష్యాలతో అనుసంధానించకపోవడం వల్లే స్వల్పకాలిక నష్టాలు రాగానే తక్షణమే ఆపేస్తున్నారు," అని గెయినింగ్ గ్రౌండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకుడు రవి కుమార్ టీవీ పేర్కొన్నారు.

అయితే ఒక చోట ఆపేస్తే, ఆ డబ్బును వేరే పథకాల్లో మళ్లీ ప్రారంభిస్తున్న వారు కూడా ఉన్నారని ఛటర్జీ తెలిపారు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో యాప్‌ల ద్వారా కేవలం ఒక్క క్లిక్‌తో మ్యూచువల్ ఫండ్లను కొనుగోలు చేయడం, విక్రయించడం సులభమైందని, సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో కొంతమంది భయాందోళనలతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ వివేక్ రేగే పేర్కొన్నారు.

మదుపర్లు చేయవలసిందేమిటంటే..

మార్కెట్ పడిపోయిన సమయంలో ఎస్ఐపీని ఆపేస్తే, తక్కువ ధరల వద్ద యూనిట్లను కొనుగోలు చేసే సువర్ణావకాశాన్ని కోల్పోతారు! మార్కెట్లు పుంజుకున్నప్పుడు ఆ యూనిట్లే మంచి లాభాలను అందిస్తాయని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ఎస్ఐపీలను నిరంతరం కొనసాగించాలని, ఆదాయం పెరిగినప్పుడు క్రమంగా పెట్టుబడి మొత్తాన్ని పెంచుకుంటూ (టాప్-అప్) వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More