...
...
Next Story

వెనెజువెలాపై అమెరికా దాడి- చమురు కోసమే ట్రంప్​ ఇలా చేశారా?

ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించింది. డ్రగ్స్ స్మగ్లింగ్, ఉగ్రవాద ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Published on: Jan 04, 2026 01:28 PM IST
Advertisement

అమెరికా-వెనెజువెలా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వైరం ఒక్కసారిగా ముదిరింది. దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాపై అమెరికా సైన్యం భారీ దాడి చేసి, ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను తమ అదుపులోకి తీసుకుంది.

ట్రంప్​- మదురో (AFP)
ట్రంప్​- మదురో (AFP)

తాజా సమాచారం ప్రకారం.. మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరస్‌ను న్యూయార్క్ ఎయిర్ బేస్‌కు తరలించి, అక్కడి నుంచి బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. వీరిద్దరిపై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా (డ్రగ్ ట్రాఫికింగ్), ఆయుధాల చట్టం కింద తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. కళ్లకు గంతలు కట్టిన మదురో ఫోటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

వెనెజువెలాపై దాడికి అసలు కారణం ఏంటి?

స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున వెనెజువెలా రాజధాని కారకాస్​లో అమెరికా దాడులు జరిపింది. పేలుడు శబ్ధాలతో ఆ నగరం ఉలిక్కిపడింది. అదే సమయంలో మదురో, ఆయన భార్య ఉన్న మిలిటరీ స్థావరంపై అమెరికా సైన్యం దాడి చేసింది. బెడ్​రూమ్​లోకి చొరబడి మదురో దంపతులను బయటకు తీసుకొచ్చి, అరెస్ట్​ చేసింది. ఆపరేషన్​ అబ్సల్యూట్​ రిజాల్వ్​ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్య కేవలం 30 నిమిషాల్లో ముగిసింది!

ఆపరేషన్​ అబ్సల్యూట్​ రిజాల్వ్​ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

కాగా మదురోపై 'నార్కో టెర్రరిజం' (మాదక ద్రవ్యాల ఉగ్రవాదం) అనే ఆరోపణలతో అమెరికా ఈ చర్యకు దిగింది.

డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు: మదురో ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ ముఠాలతో చేతులు కలిపి, వేల టన్నుల కొకైన్‌ను అమెరికాలోకి పంపించారని అభియోగాలు ఉన్నాయి.

రక్షణ కల్పించడం: సినలోవా కార్టెల్ వంటి ముఠాలకు వెనెజువెలా ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని, అందుకు ప్రతిగా భారీగా నగదు పొందుతోందని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. ఏటా దాదాపు 250 టన్నుల కొకైన్ వెనెజువెలా నుంచి విదేశాలకు చేరుతోందని చెబుతున్నారు.

"మేమే ఆ దేశాన్ని నడుపుతాము" - ట్రంప్

"వెనెజువెలాలో ప్రశాంతంగా అధికారం బదిలీ అయ్యే వరకు ఆ దేశాన్ని మేమే నడుపుతాము," అని ఆయన స్పష్టం చేశారు. అమెరికా చమురు కంపెనీలను తిరిగి వెనెజువెలాలోకి పంపి, అక్కడి చమురు నిల్వలను దారికి తెస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అవసరమైతే మరిన్ని దళాలను వెనెజువెలాలో మోహరించేందుకు వెనుకాడబోమని ట్రంప్ హెచ్చరించారు.

అయితే, ఈ చర్యను అమెరికాలోని కొందరు ప్రజాస్వామ్యవాదులు తప్పుబడుతున్నారు. సెనేటర్ బెర్నీ సాండర్స్ స్పందిస్తూ, "వేరే దేశంపై దాడి చేసే అధికారం ట్రంప్‌నకు లేదు. అమెరికాలో సామాన్యులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, ఆయన మాత్రం వెనెజువెలా చమురు కోసం అక్రమ యుద్ధాలు చేస్తున్నారు," అని విమర్శించారు.

మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు?

వెనెజువెలాపై అమెరికా దాడి వెనుక చమురు రాజకీయాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

పెట్రో డాలర్ రక్షణ: "వెనెజువెలా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ హయాం నుంచే అమెరికా 'పెట్రో డాలర్' వ్యవస్థకు సవాలు ఎదురవుతోంది. ఆ దేశ చమురు నిల్వలపై పట్టు సాధించడమే ట్రంప్ అసలు ఉద్దేశం," అని బసవ్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు సందీప్ పాండే అభిప్రాయపడ్డారు.

చమురు ధరలపై ప్రభావం: ప్రస్తుతం ప్రపంచ చమురు సరఫరాలో వెనెజువెలా వాటా కేవలం 1% మాత్రమే! కాబట్టి అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగే అవకాశం లేదని కొందరు అంటున్నారు. శనివారం వెస్ట్ టెక్సాస్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 57.32 డాలర్ల వద్ద ఉంది.

బంగారం, వెండి ధరలు: అయితే.. ఈ భౌగోళిక ఉద్రిక్తతల వల్ల సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే బంగారం, వెండి, ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని యా వెల్త్ డైరెక్టర్ అనుజ్ గుప్తా హెచ్చరించారు. బ్రెంట్ ముడిచమురు బ్యారెల్‌కు 62 నుంచి 65 డాలర్ల వరకు చేరవచ్చని ఆయన అంచనా వేశారు.

ఈ పరిణామం రాబోయే రోజుల్లో దక్షిణ అమెరికాలో భారీ రాజకీయ మార్పులకు దారితీయవచ్చు. అమెరికా తదుపరి అడుగు ఏంటనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe