...
...
Next Story

భారత ధనికుల కంటే ధనిక దేశాల పేదల ఆదాయమే ఎక్కువ- వరల్డ్ బ్యాంక్ నివేదికలో షాకింగ్ విషయాలు..

ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన 2026 పేదరికం, అసమానతల నివేదిక ప్రకారం.. భారత్‌లో అత్యంత ధనికులైన 10 శాతం మంది రోజువారీ జీవన ప్రమాణాలు, అభివృద్ధి చెందిన దేశాలdలోని పేదల కంటే చాలా తక్కువగా ఉన్నాయి!

Published on: Oct 12, 2026, 10:00:15 IST
Advertisement

భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తున్నప్పటికీ, దేశ ప్రజల సగటు ఆదాయం, జీవన ప్రమాణాల విషయంలో ఒక చేదు నిజం వెలుగులోకి వచ్చింది. ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన '2026 పావర్టీ అండ్ ఇనీక్వాలిటీ ప్లాట్‌ఫామ్' (Poverty and Inequality Platform) నివేదిక ప్రకారం.. అభివృద్ధి చెందిన కొన్ని ధనిక దేశాల్లోని అత్యంత పేద వర్గాల (దిగువ10శాతం) రోజువారీ ఆదాయం లేదా వినియోగ వ్యయం.. భారత్‌లోని అత్యంత ధనిక వర్గాల (ఎగువ 10%) కంటే కూడా ఎక్కువగా ఉంది!

అంకెల్లో ఆదాయాల వ్యత్యాసం.. లెక్కలివే!

భారత ఆర్థిక అసమానతలపై వరల్డ్ బ్యాంక్ షాకింగ్ రిపోర్టు.. (Anshuman Poyrekar/HT Photo)
భారత ఆర్థిక అసమానతలపై వరల్డ్ బ్యాంక్ షాకింగ్ రిపోర్టు.. (Anshuman Poyrekar/HT Photo)

ప్రపంచ బ్యాంకు విశ్లేషణ ప్రకారం.. భారత్‌లోని అత్యంత పేదలైన 10 శాతం మంది రోజువారీ ఆదాయ పరిమితి సగటున 3 డాలర్లు (సుమారు రూ.290) మాత్రమే. కానీ అభివృద్ధి చెందిన దేశాల్లోని పేదల పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది! అమెరికాలోని అత్యంత పేద 10 శాతం మంది రోజువారీ ఆదాయం 25 డాలర్లు కాగా, కెనడాలో 31 డాలర్లు, జర్మనీ- ఆస్ట్రేలియాల్లో 28 డాలర్లుగా నమోదైంది.

ఇక నాణేనికి రెండో వైపు చూస్తే.. భారత్‌లో అత్యంత సంపన్నులైన మొదటి 10 శాతం మంది రోజువారీ ఆదాయ పరిమితి కేవలం 10 డాలర్లు (సుమారు రూ.960) మాత్రమే. భారత ఎకనామిక్ సర్వే గణాంకాల ప్రకారం, నెలకు రూ.80,000 లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే వ్యక్తి.. దేశంలో అత్యధిక ఆదాయం పొందే టాప్ 10 శాతం మంది సరసన నిలుస్తారు.

అంటే, కెనడా లేదా అమెరికాలోని పేదలు పొందే ఆదాయం, భారత్‌లోని సంపన్న వర్గాల ఆదాయం కంటే మెరుగ్గా ఉందని నివేదిక చెబుతోంది.

అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ధనికుల రోజువారీ ఆదాయం చూస్తే కళ్లు చెదరాల్సిందే. అమెరికాలోని ధనికుల రోజువారీ ఆదాయం 173 డాలర్లు కాగా, కెనడా, ఆస్ట్రేలియాల్లో 129 డాలర్లు, జర్మనీలో 128 డాలర్లుగా ఉంది.

కేవలం పేదరిక నిర్మూలన మాత్రమే సరిపోదు!

"భారత్‌లో రోజుకు 10 డాలర్లు ఖర్చు చేసే వ్యక్తి అత్యంత సంపన్నుల జాబితాలోకి వస్తారు, కానీ అదే 10 డాలర్లు కెనడా, జపాన్ లేదా అమెరికాలో ఒక వ్యక్తిని అత్యంత పేదల సరసన నిలబెడుతుంది! మన దేశంలోని పేద ప్రజల ఆదాయాలను పెంచి వారిని ప్రస్తుతం ఉన్న ధనిక కుటుంబాల స్థాయికి తీసుకొచ్చినంత మాత్రాన దేశం సంపన్న దేశంగా మారదు. అందరి ఆదాయాల స్థాయిని పెంచినప్పుడే భారత్ నిజమైన అభివృద్ధి సాధిస్తుంది," అని అహోనా దత్తాగుప్తా పేర్కొన్నారు.

ఉత్పాదకత పెంపే ఏకైక మార్గం!

దేశంలో అన్ని వర్గాల ఆదాయాలు పెరగాలంటే వ్యాపారాలు, పరిశ్రమలలో 'ఉత్పాదకత' పెరగాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఉన్న భూమి, శ్రమ, మూలధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించి మరింత ఎక్కువ ఉత్పత్తి సాధించడమే ఉత్పాదకత. పరిశ్రమలలో ఉత్పాదకత పెరిగినప్పుడు మాత్రమే జీతాలు పెరుగుతాయి, మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఉత్పాదకత పెరగాలంటే కొత్త ఆలోచనలతో వ్యాపారాలు ప్రారంభించే వాతావరణం ఉండాలి. సులభతర వాణిజ్యం, అంచనా వేయదగిన సరళమైన పన్ను విధానాలు, నియంత్రణల భారం తగ్గించడం అత్యంత ముఖ్యం. భారత్ ఇప్పటికే కొన్ని నిబంధనలను సడలించినప్పటికీ, గ్లోబల్ మార్కెట్‌లో భారత పరిశ్రమలు పోటీపడాలంటే ఒప్పందాల వేగవంతమైన అమలు, ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటు వంటి ద్వితీయ శ్రేణి సంస్కరణలు వేగవంతం కావాల్సి ఉందని నివేదిక సూచిస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks