ఉన్నత చదువులకు యూకేకి వెళ్లాలనేది ఇప్పుడు సగటు భారతీయ విద్యార్థి కల! అయితే, బ్రిటన్ వంటి దేశాల్లో చదువుకోవాలంటే అయ్యే ఖర్చు చూసి చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అటువంటి వారి కలలను నిజం చేసేందుకు బ్రిటిష్ కౌన్సిల్ 2026 స్కాలర్షిప్ నోటిఫికేషన్ ద్వారా అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. దక్షిణ ఆసియా దేశాల నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) రంగాల్లో ప్రతిభ ఉన్న మహిళల కోసం 25 పూర్తి స్థాయి ఉచిత స్కాలర్షిప్లను ప్రకటించింది. వీటితో పాటు ప్రభుత్వం అందించే 'గ్రేట్' స్కాలర్షిప్లు, ఇతర యూనివర్సిటీల రాయితీలు కూడా అందుబాటులో ఉన్నాయి.
యూకే స్కాలర్షిప్- ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది!

బ్రిటన్ అందించే ఆర్థిక సాయం విద్యార్థులపై పైసా భారం పడకుండా చూస్తుంది. ముఖ్యంగా 'ఉమెన్ ఇన్ స్టెమ్' స్కాలర్షిప్ కింద ఎంపికైన ఒక్కో విద్యార్థికి సుమారు 40,000 పౌండ్లు (సుమారు రూ. 44 లక్షలు) వరకు లభిస్తుంది. ఇందులో ట్యూషన్ ఫీజుతో పాటు విమాన ప్రయాణ ఖర్చులు, వసతి, రోజువారీ ఖర్చులు కూడా కలిసి ఉంటాయి.
"ప్రతిభ ఎక్కడ ఉన్నా దానికి గుర్తింపు లభిస్తుంది. దేశాల వారీగా ఎలాంటి కోటాలు లేవు, అర్హత ఉన్న వారు ఎవరైనా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు," అని బ్రిటిష్ కౌన్సిల్ ప్రతినిధి ఆత్రేయి గుహ ఠాకుర్తా వివరించారు. మరోవైపు, 'గ్రేట్' స్కాలర్షిప్ కింద ఏడాది పీజీ కోర్సుల కోసం కనీసం 10,000 పౌండ్ల వరకు ట్యూషన్ ఫీజు రాయితీ లభిస్తుంది.
మార్కులు మాత్రమే సరిపోవు.. ఇంకేం కావాలి?
అత్యధిక మార్కులు వస్తేనే బ్రిటన్ యూనివర్సిటీల్లో సీటు వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ, అకాడమిక్ రికార్డుతో పాటు మీ వ్యక్తిత్వం, సామాజిక బాధ్యత కూడా ఇక్కడ ముఖ్యం.
{{/usCountry}}అత్యధిక మార్కులు వస్తేనే బ్రిటన్ యూనివర్సిటీల్లో సీటు వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ, అకాడమిక్ రికార్డుతో పాటు మీ వ్యక్తిత్వం, సామాజిక బాధ్యత కూడా ఇక్కడ ముఖ్యం.
{{/usCountry}}గ్లాస్గో యూనివర్సిటీ ప్రతినిధి లూయిసా ఫ్రీమాన్ మాటల్లో చెప్పాలంటే.. "మాకు కేవలం 100 శాతం మార్కులు తెచ్చే విద్యార్థులు మాత్రమే కాదు, సమాజంపై అవగాహన ఉండి కొత్తగా ఏదైనా చేయాలనే తపన ఉన్న వారు కావాలి."
మీ అప్లికేషన్తో పాటు సమర్పించే 'స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్' (ఎస్ఓపీ) మీ భవిష్యత్ లక్ష్యాలను స్పష్టంగా చెప్పాలి. మీరు సమాజానికి ఏం తిరిగి ఇవ్వగలరు? ప్రపంచ సమస్యలపై మీ అవగాహన ఏంటి? అనే అంశాలను బట్టి ఎంపిక ఉంటుంది. గతంలో టాపర్లు కాకపోయినా.. స్థానికంగా కోడింగ్ క్లబ్లు నడిపిన వారు, పర్యావరణ హిత కార్యక్రమాలు చేసిన వారికి కూడా ఈ స్కాలర్షిప్లు దక్కడం గమనార్హం.
యూకే స్కాలర్షిప్- దరఖాస్తు విధానం ఇలా..
ఇది కేవలం ఒక ఫారమ్ నింపే ప్రక్రియ కాదు, దీనికి పక్కా ప్రణాళిక అవసరం.
ముందుగా యూనివర్సిటీ సీటు: ముందుగా మీరు కోరుకున్న యూకే యూనివర్సిటీలో సీటు (కండిషనల్ లేదా అన్ కండిషనల్ ఆఫర్) సంపాదించాలి. ఆ తర్వాతే వారి పోర్టల్ ద్వారా స్కాలర్షిప్కు దరఖాస్తు చేయాలి.
స్పష్టత ముఖ్యం: అప్లికేషన్లో అడిగే ప్రశ్నలకు అత్యంత క్లుప్తంగా, సూటిగా సమాధానాలు రాయాలి. 20-30 పదాల్లోనే మీ విజన్ను వివరించాల్సి ఉంటుంది.
సమయం కీలకం: సెప్టెంబర్ సీజన్లో చేరాలనుకుంటే, కనీసం ఏడాది ముందే పరిశోధన ప్రారంభించాలి. ఫైనల్ మార్క్స్ మెమో వచ్చే వరకు ఆగకుండా, ప్రిడిక్టెడ్ గ్రేడ్స్తో దరఖాస్తు చేసుకోవచ్చు.
యూకే స్కాలర్షిప్- జీవితాన్ని మార్చే నిర్ణయం..
బ్రిటన్లో చదువు కేవలం డిగ్రీ మాత్రమే కాదు, అది ప్రపంచవ్యాప్తంగా నెట్వర్కింగ్ను పెంచుతుంది. ఉన్నత చదువుల తర్వాత అక్కడ ఉండి ఉద్యోగం చేసుకునేందుకు 'గ్రాడ్యుయేట్ రూట్' ద్వారా అనుమతి లభిస్తుంది. "యూకేలో చదువు మీ ఆలోచనా విధానాన్ని మారుస్తుంది. అది మీ జీవితాన్ని రాత్రికి రాత్రే కొత్త మలుపు తిప్పే నిర్ణయం అవుతుంది," అని నిపుణులు సూచిస్తున్నారు.
గ్రేట్ స్కాలర్షిప్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు https://www.britishcouncil.in/study-uk/scholarships/great-scholarships అనే వెబ్సైట్కి వెళ్లండి.