
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ నవంబర్ 1న తన 63వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. వయస్సు ఆరు పదులు దాటినా కూడా ఆమె ముఖంలో కనిపించే ఆకర్షణీయమైన తేజస్సు, శారీరక దారుఢ్యం అనేక మందికి స్ఫూర్తినిస్తాయి. 63 ఏళ్ల వయస్సులోనూ ఎంతో చురుగ్గా, ఆరోగ్యంగా కనిపించడానికి ఆమె పాటించే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, శారీరక వ్యాయామాలు, సమతుల్య శాకాహార ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, సరైన మానసిక పట్టుదల, నిలకడైన ఆహార నియమాలు ఉంటే ఏ వయసులోనైనా ఆరోగ్యంగా ఉండవచ్చని నీతా అంబానీ నిరూపించారు. ఆమె 63వ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫిట్‌నెస్ రహస్యాలు, రోజువారీ డైట్ ప్లాన్ సవివరంగా తెలుసుకుందాం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గతంలో నితా అంబానీ తన ఫిట్‌నెస్ దినచర్యను పంచుకుంటూ, మహిళలు తమ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆమె ఫిట్‌నెస్ విధానం కేవలం బరువు తగ్గడానికి మాత్రమే పరిమితం కాకుండా శరీర బలం, ఫ్లెక్సిబులిటీ, మొబిలిటీని పెంచేలా ఉంటుంది. "నాకు వ్యాయామంలో 'లెగ్ డే' (కాళ్ల వ్యాయామం) అంటే చాలా ఇష్టం. 6 ఏళ్ల వయస్సు నుంచే భరతనాట్యం సాధన చేయడం వల్ల నా కాళ్లకు మంచి దారుఢ్యం వచ్చింది. నా వ్యాయామాల్లో రోజుకో భాగానికి ప్రాధాన్యత ఇస్తాను. కాళ్లు, అప్పర్ బాడీ, వీపు భాగాలు.. ఇలా ప్రతీ రోజు వేర్వేరు శరీర భాగాలకు వ్యాయామం ఇస్తాను. వారంలో 5 నుంచి 6 రోజులు క్రమం తప్పకుండా వర్కౌట్ చేస్తాను," అని నితా అంబానీ పేర్కొన్నారు.
రోజువారీ వ్యాయామాలతో పాటు స్విమ్మింగ్, ఆక్వా ఎక్సర్‌సైజులు కూడా చేస్తారు నీతా అంబానీ. కొన్నిరోజులు గంటపాటు భరతనాట్యం సాధన చేయడంతో పాటు ప్రతిరోజూ 5,000 నుంచి 7,000 అడుగులు నడుస్తారు. వ్యాయామాన్ని ఒక భారంగా భావించకుండా, మనస్సుకు ప్రశాంతతను, సంతోషాన్ని ఇచ్చే ఒక మార్గంగా ఆమె చూస్తారు. కఠినమైన వ్యాయామాలతో పాటు సంపూర్ణ శాకాహార ఆహారాన్ని నీతా అంబానీ తీసుకుంటారు. ప్రకృతిసిద్ధంగా, ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఆహారానికి ఆమె ప్రాధాన్యత ఇస్తారు.
నా ఆహార నియమాలు ఎంతో సమతుల్యంగా ఉంటాయి. నేను సంపూర్ణ శాకాహారిని. నా తిండిలో ఆర్గానిక్ ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం. పంచదారను, దాని కృత్రిమ ప్రత్యామ్నాయాలను నేను పూర్తిగా వర్జిస్తాను శరీరానికి కావాల్సిన మ్యాక్రో, మైక్రో న్యూట్రియెంట్లు, విటమిన్లు, ప్రోటీన్లు అందేలా చూసుకోవడం ద్వారా జీవక్రియ శక్తివంతంగా ఉంటుంది. నిత్య జీవితంలో చక్కెర వాడకం అనేక అనారోగ్య సమస్యలకు మూలకారణమని, దానికి దూరంగా ఉండటమే సౌందర్యానికి, ఆరోగ్యానికి అసలు రహస్యమని ఆమె స్పష్టం చేశారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడంపై నీతా అంబానీ కీలక హెచ్చరిక చేశారు. ఈ క్రమంలో మహిళలు చిన్న వయస్సు నుంచే రోజువారీ వ్యాయామాలను అలవాటు చేసుకుని, కండరాల నిరోధకతను పెంచే వ్యాయామాలు, ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నీతా అంబానీ ఆకాంక్షించారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ 30 ఏళ్లు దాటిన గృహిణులు, ఉద్యోగిణులు ఈ సూత్రాలను పాటిస్తే దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.