అధిక మాసం 2026: అప్పుల బాధలు తొలగి ఐశ్వర్యం కలగాలంటే.. ఈ మంత్రాలను వదలకండి!
2026లో రాబోతున్న అధిక మాసం విశేషాలు, తేదీలు, శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం పఠించాల్సిన శక్తివంతమైన మంత్రాల వివరాలు మీకోసం. ఈ కాలంలో చేసే జప, తపాలు కోటి రెట్లు ఫలితాన్నిస్తాయి.
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం 'అధిక మాసం' ఒక అద్భుతమైన కాలం. దీనిని 'పురుషోత్తమ మాసం' అని కూడా పిలుస్తారు. మూడు ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ పవిత్ర మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ సమయంలో మనం చేసే జపం, తపం, దానధర్మాలు లేదా పూజా కార్యక్రమాల వల్ల కలిగే ఫలితం సాధారణ రోజుల కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంటుందని పురాణాలు ఘోషిస్తున్నాయి.

2026 సంవత్సరంలో మే 17వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు అధిక మాసం ఉంటుంది. విశేషమేమిటంటే, ఈసారి 'జ్యేష్ఠ మాసం'లో అధిక మాసం రాబోతోంది. అంటే 2026లో జ్యేష్ఠ మాసం రెండుసార్లు వస్తుంది. ఈ పవిత్ర సమయంలో విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల విశేష ఫలితాలు పొందే అవకాశం ఉంది.
పురుషోత్తమ మాసం ప్రాముఖ్యత
అధిక మాసాన్ని ఒక అద్భుతమైన నెలగా పండితులు అభివర్ణిస్తారు. శాస్త్రాల ప్రకారం, ఈ మాసంలో విష్ణువును పూజించడం, మంత్రాలు పఠించడం మరియు సాత్విక జీవనశైలిని పాటించడం వల్ల పాత పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా జీవితంలో దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ మాసం ఒక వరం లాంటిది. ఈ సమయంలో పురుషోత్తముడు (విష్ణువు) భక్తులపై అత్యంత కరుణ చూపిస్తారని ప్రతీతి.
ధన లాభం.. అటకాయించిన పనుల కోసం
మీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా లేదా ఎక్కడైనా మీ డబ్బు నిలిచిపోయినా 'కార్తవీర్యార్జున మంత్రాన్ని' పఠించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
ఓం హ్రీం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్
యస్య స్మరేణ మాత్రేణ హృతం నష్టం చ లభ్యతే
ఈ మంత్రాన్ని అధిక మాసంలో ప్రతిరోజూ పఠించడం వల్ల నిలిచిపోయిన సొమ్ము తిరిగి రావడమే కాకుండా, ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. సంపదలో స్థిరత్వం వస్తుంది.
వివాహం.. దాంపత్య సుఖం కోసం
వివాహం ఆలస్యమవుతున్నా లేదా వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నా 'అనిరుద్ధ మంత్రాన్ని' ఆశ్రయించాలి.
ఓం అః అనిరుద్ధాయ నమః
అధిక మాసంలో ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల త్వరలోనే శుభ ఫలితాలు కనిపిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
లక్ష్మీ నారాయణుల కృప కోసం
శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందాలనుకునే వారు ఈ మంత్రాన్ని పఠించాలి.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఈ మంత్రం వల్ల ఇంట్లో ధనశామం తొలగిపోతుంది. సానుకూలత పెరిగి, అభివృద్ధి పథంలో ముందుకు సాగే మార్గాలు కనిపిస్తాయి.
లక్ష్మీ వినాయక మంత్రం
సంపద, విజయం మరియు విఘ్నాలు తొలగిపోవడానికి ఈ మంత్రం ఎంతో ప్రభావవంతమైనది.
దంతాభయే చక్ర దరో దధానం,
కరాగ్రగస్వర్ణఘటం త్రినేత్రమ్
ధృతాబ్జయా లింగితమబ్ధిపుత్రయా,
లక్ష్మీ గణేశం కనకాభమీడే
ఈ మంత్రాన్ని అధిక మాసంలో జపించడం వల్ల లక్ష్మీదేవి, గణపతి ఇద్దరి కృపాకటాక్షాలు లభిస్తాయి.
విష్ణు పంచరూప మంత్రాలు
జీవితంలోని అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి పొంది, సమతుల్యత సాధించడానికి విష్ణువు ఐదు రూపాలకు సంబంధించిన ఈ మంత్రాలు పఠించాలి:
ఓం నమో వాసుదేవాయ నమః
ఓం నమో సంకర్షణాయ నమః
ఓం నమో ప్రద్యుమ్నాయ నమః
ఓం నమో అనిరుద్ధాయ నమః
ఓం నమో నారాయణాయ నమః
ఈ ఐదు మంత్రాలు జీవితంలోని వివిధ దశల్లో ఎదురయ్యే ఆటంకాలను తొలగించి శుభ ఫలితాలను ఇస్తాయి.
సులభమైన నామ స్మరణ
ఒకవేళ క్లిష్టమైన మంత్రాలు పఠించలేకపోతే, "ఓం నమో నారాయణ" లేదా "శ్రీమన్ నారాయణ నారాయణ హరి హరి" అని నిత్యం స్మరించుకున్నా చాలు. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
అధిక మాసంలో పాటించాల్సిన నియమాలు
ఈ మాసంలో ప్రతిరోజూ విష్ణువును పూజించాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
శక్తి మేరకు పేదలకు దానధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.
ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండి, ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మంత్ర జపం చేయాలి.
2026లో రాబోతున్న ఈ పురుషోత్తమ మాసాన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుని కృపకు పాత్రులు కావాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


