...
...
Next Story

Apara Ekadashi: రేపే అపర ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే కోటి పుణ్యఫలాలు మీ సొంతం!

Apara Ekadashi: అపారమైన సంపదను, పుణ్యాన్ని ప్రసాదించే 'అపర ఏకాదశి' మే 13న రాబోతోంది. ఈ రోజు విష్ణుమూర్తిని ఎలా పూజించాలి? ఉపవాస నియమాలేంటి? పారణ సమయం ఎప్పుడో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే కోటి పుణ్యఫలాలు మీ సొంతం.

Published on: May 12, 2026, 14:00:43 IST
Advertisement

సనాతన ధర్మంలో ఏకాదశి తిథిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతి నెలా వచ్చే రెండు ఏకాదశులు శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనవి. అయితే వైశాఖ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని ‘అపర ఏకాదశి’ అని పిలుస్తారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి స్వామివారిని ఆరాధిస్తే అపారమైన పుణ్యం లభిస్తుందని, అందుకే దీనికి 'అపర' అనే పేరు వచ్చిందని పండితులు చెబుతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో దీనిని అచల ఏకాదశి, భద్రకాళీ ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు.

తేదీ, ముహూర్తం

Apara Ekadashi: రేపే అపర ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే కోటి పుణ్యఫలాలు మీ సొంతం! (pinterest)
Apara Ekadashi: రేపే అపర ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే కోటి పుణ్యఫలాలు మీ సొంతం! (pinterest)

ప్రతి ఏటా తిథుల హెచ్చుతగ్గుల వల్ల ఏకాదశి ఏ రోజు జరుపుకోవాలనే సందిగ్ధత భక్తులలో నెలకొంటుంది. 2026 సంవత్సరానికి సంబంధించి పంచాంగ కర్తలు అపర ఏకాదశి తేదీని ఖరారు చేశారు.

ఏకాదశి ప్రారంభం: మే 12, 2026 మధ్యాహ్నం 02:52 నిమిషాలకు తిథి మొదలవుతుంది.

ఏకాదశి ముగింపు: మే 13, 2026 మధ్యాహ్నం 01:29 నిమిషాలకు తిథి ముగుస్తుంది.

శాస్త్రం ప్రకారం ఉదయ తిథికి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, మే 13, బుధవారం రోజున అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. ఇక వ్రతాన్ని విరమించే సమయం (పారణ) మే 14వ తేదీ ఉదయం 05:31 నుండి 08:14 గంటల మధ్య ఉంటుందని గుర్తుంచుకోవాలి.

అపర ఏకాదశి విశిష్టత

ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితం గురించి పురాణాల్లో గొప్పగా వివరించారు. "అపర ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం వల్ల బ్రహ్మహత్యా పాతకం వంటి దోషాలు సైతం తొలగిపోతాయి," అని పురాణాలు పేర్కొంటున్నాయి. కురుక్షేత్రంలో స్నానం చేయడం లేదా కాశీలో పిండ ప్రధానం చేయడం ద్వారా వచ్చే పుణ్యంతో ఈ ఏకాదశి వ్రతాన్ని పోలుస్తారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు, మానసిక ప్రశాంతత కోరుకునే వారు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల సానుకూల ఫలితాలు కనిపిస్తాయి.

అపర ఏకాదశి ఉపవాసం

ఈ పవిత్రమైన రోజున భక్తులు అనుసరించాల్సిన పద్ధతులు ఇవే:

శుచీ శుభ్రత: సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం విష్ణువుకు ప్రీతికరం.

సంకల్పం: దేవుని గదిని శుభ్రం చేసి, దీపారాధన అనంతరం శ్రీహరిని స్మరిస్తూ వ్రత సంకల్పం తీసుకోవాలి.

నైవేద్యం: విష్ణువుకు తులసి దళాలు అంటే మహా ఇష్టం. కాబట్టి పూజలో తులసిని తప్పనిసరిగా వాడాలి. పండ్లు, పాయసం నైవేద్యంగా సమర్పించవచ్చు.

స్తోత్ర పఠనం: రోజంతా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

దీపారాధన: సాయంత్రం వేళ తులసి కోట వద్ద నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

ఏకాదశి వ్రతం అంటే కేవలం ఆహారం మానేయడమే కాదు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం కూడా. ఎవరిపైనా కోపం ప్రదర్శించకుండా, సాత్విక భావంతో ఉంటూ పేదలకు దానధర్మాలు చేయడం వల్ల ఈ వ్రత ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe