ఆషాఢ గుప్త నవరాత్రులు: ఈరోజు ఈ 5 పనులు చేస్తే విజయంతో పాటు ఐశ్వర్యం మీ సొంతం!
ఆషాఢ గుప్త నవరాత్రులు జూలై 22న నవమి తిథితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల్లో పూజలు చేయలేకపోయినా, చివరి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజున మాతంగి దేవిని పూజించడం, హోమం నిర్వహించడం, కన్యాపూజ చేయడం శుభప్రదంగా భావిస్తారు.
ఏడాదిలో నాలుగు నవరాత్రులు వస్తాయి. అందులో ఆషాఢ మాసంలో వచ్చే వాటిని గుప్త నవరాత్రులు అని అంటారు. వీటిని అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు. తంత్ర, మంత్ర సాధనలు, రహస్య ఉపాసనలకు ఈ నవరాత్రులు ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.

జూలై 15న ప్రారంభమైన గుప్త నవరాత్రులు జూలై 22, అంటే నేటితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల్లో పూజలు, వ్రతాలు చేయకపోయినా, ఈరోజు అంటే నవమి తిథి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తే మంచిది. అలాగే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది.
గుప్త నవరాత్రుల్లో దశమహావిద్యలను ఆరాధిస్తారు. మాతంగి దేవిని పూజించడం ఆనవాయితీ. అలాగే ఈరోజు చాలా మంది హోమం, కన్యా పూజ వంటివి జరుపుతారు. ముఖ్యమైన పరిహారాలు ఇవే. మరి మీరు పాటిస్తున్నారా?
1.కన్యా పూజ:
నవమి నాడు కన్యా పూజ చేయడం చాలా మంచిది. హిందూ శాస్త్రాల ప్రకారం రెండు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు ఉండే బాలికలు దుర్గాదేవి స్వరూపులు. అందుకని తొమ్మిది మంది బాలికలకు సాత్విక భోజనం పెట్టి, వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆ బాలికలకు వస్త్రాలు, కానుకలు ఇస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
2.మాతంగి దేవి పూజ:
నవమి నాడు ఎర్రటి వస్త్రాన్ని పీఠంపై పరచి, మాతంగి దేవి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అమ్మవారికి పూలు, దీపం, ధూపం, నైవేద్యాలను సమర్పించాలి. ఆ తర్వాత "ఓం హ్రీం ఐం భగవత్యై మాతంగ్యై నమః" మంత్రాన్ని జపించాలి.
3.హోమం:
నవమి నాడు హోమం చేయడం చాలా మంచిది. ఆవు పిడకలు, గుగ్గులు, సాంబ్రాణి, హోమ ద్రవ్యాలతో పాటు లవంగాలు కూడా వేసి హోమాన్ని చేయాలి. ఇలా చేస్తే ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
4.మహాలక్ష్మి దేవి పూజ:
నవమి నాడు రాత్రి మహాలక్ష్మి దేవిని విధివిధానాలతో ఆరాధించాలి. దేవికి పాయసం నైవేద్యంగా పెట్టాలి. గులాబీ పూలు, తామర పూలను సమర్పించాలి. తామర గింజల మాలతో మహాలక్ష్మి మంత్రాలను జపిస్తే సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి.
5.రత్నాలు ధరించండి:
చాలా మంది గ్రహ దోషాలతో బాధపడుతూ ఉంటారు. జాతకంలో గ్రహదోషాలు ఉన్నట్లయితే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అనుభవజ్ఞుడైన జ్యోతిష నిపుణుల సలహా మేరకు రత్నాలను ధరిస్తే సంబంధిత గ్రహం బలపడి శుభ ఫలితాలను చూడొచ్చు. కష్టాలు అన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


